Cold intensity
-
ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
-
Andhra Pradesh: ఏజెన్సీ గజగజ
ఏజెన్సీ ప్రాంతంలో సాయంత్రం 4గంటల నుంచే చలిగాలులు విజృంభిస్తున్నాయి. పాడేరు ఘాట్‌లో చలితీవ్రత మరింత ఎక్కువైంది. శనివారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 14డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీవ్యాప్తంగా ఉదయం 10గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. సాయంత్రం నుంచే అన్ని వర్గాల ప్రజలు చలిమంటలను ఆశ్రయించారు. ఘాట్ ప్రాంతాల్లో చలి మరింత ఇబ్బంది పెడుతోంది.– సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
మొదలైన ‘గజగజ’!.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుత సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, మరోవైపు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవటంతో జ్వరాలు, జలుబు, దగ్గులాంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రమంతా పడిపోతున్న ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 9.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన పట్టణాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.1 డిగ్రీలు నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 11.8 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, హనుమ కొండ, మెదక్, పటాన్చెరు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు.. హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడురోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
ఈసారి వణికించే చలి!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత శీతాకాలంలో చలితీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. డిసెంబర్, జనవరి నెలల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతాయని సూచించింది. లానినొ పరిస్థితుల కారణంగా వాతావరణంలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక అంచనాలను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా విడుదల చేసింది. సాధారణంగా వర్షాకాలం ముగిసిన తర్వాత అక్టోబర్ నెలలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువ స్థాయిలో నమోదవుతుంటాయి. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం రాష్ట్రంలో ఏర్పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల సాధారణం కంటే అధికంగా నమోదు కావడంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం, ఆ తర్వాత ఒక్కసారిగా పతనం కావడంలాంటి పరిస్థితులు ఈ సీజన్లో కనిపించే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తూర్పు, మధ్య పసిఫిక్ ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు (లానినొ) నమోదవుతుండడమే ఇందుకు కారణమని వివరిస్తున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని, ఉదయం వేళల్లో తీవ్రమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. గతంలో, తాజాగా 2022లో కూడా రాష్ట్రంలో ఈ తరహా లానినొ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర శివారుల్లోని కొన్ని ప్రాంతాల్లో 8 డిగ్రీ సెల్సీయస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయని, ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 4 డిగ్రీలకు పడిపోయిందని గుర్తుచేస్తున్నారు.సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలుసోమవారం రాష్ట్రంలోని పలు ప్రధాన కేంద్రాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 35.6 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా దుండిగల్‌లో 20.7 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది. పలు జిల్లాలకు వర్ష సూచనరాష్ట్రంలో రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ, మధ్య బంగాళాఖాతం సమీపంలోని ఏపీ తీర ప్రాంతంలో చక్రవాతపు ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం ఏపీలో అధికంగా ఉన్నప్పటికీ, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని సూచించింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. -
మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో నెలకొంటున్న మార్పు లు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలాచోట్ల సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మంలో 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా.. అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత సిర్పూర్లో 8.3 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయని.. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
పగలు భగభగ.. రాత్రి గజగజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గతవారం వరకు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా... ఇప్పుడు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పూర్తి కావడంతో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం తోడుకావడం, రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పతనం కావడంతో పాటు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లో తక్కువగా.. సెప్టెంబర్ నెలాఖరుతో వానాకాలం ముగిసినప్పటికీ... అక్టోబర్ రెండో వారం వరకు నైరుతి ప్రభావం ఉంటుంది. తాజాగా నాలుగో వారం వరకు చలి తీవ్రత పెద్దగా లేకపోగా... రెండ్రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో కని ష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. మెదక్, వరంగల్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే దక్షిణ ప్రాంత జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... ఉత్తర ప్రాంతంలో మాత్రం సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 15 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. -
మన్యం గజగజ! భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. అరకులోయలో 8.6 డిగ్రీలు..
సాక్షి, పాడేరు: చలి తీవ్రతకు మన్యం ప్రాంతం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పొగమంచు, చలిగాలుల తీవ్రత పెరగడంతోపాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. అరకులోయలోని కేంద్ర కాఫీబోర్డు వద్ద సోమవారం ఉదయం 8.6 డిగ్రీలు, పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో ఆదివారం 10 డిగ్రీలు, అరకులోయలో 15.2 డిగ్రీలు, చింతపల్లిలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఒక్కరోజులోనే మినుములూరు మినహా, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి చలిగాలులు పెరిగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి చలి తీవ్రత పెరగడంతో స్థానికులతోపాటు ఏజెన్సీని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. సోమవారం ఉదయం 10గంటల వరకు అరకులోయ, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, చింతపల్లి ప్రాంతాల్లో పొగమంచు కురిసింది. పది గంటల తర్వాతే సూర్యుడు కనిపించాడు. పొగమంచు కారణంగా లంబసింగి, పాడేరు, అనంతగిరి, దారకొండ, రంపుల, మోతుగూడెం, మారేడుమిల్లి ఘాట్‌రోడ్లలో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
మన్యం గజగజ
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు): ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలిపులితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13 డిగ్రీల నుంచి 8.2 డిగ్రీలకు, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 12 డిగ్రీల నుంచి 9 డిగ్రీలకు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 12.7 డిగ్రీల నుంచి 9.7 డిగ్రీలకు పడిపోయింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ గ్రామాల్లో చలిగాలులు అధికమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి చలి తీవ్రతకు ప్రజలు తాళలేకపోయారు. ఒక వైపు బంగాళాఖాతంలో అల్పపీడనంపై వాతావరణ శాఖ ప్రచారం చేసినా మన్యంలో మాత్రం పొగమంచు దట్టంగా కురిసి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. బుధవారం ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురిసింది. సూర్యోదయం ఆలస్యమైంది. మన్యంలో వృద్ధులు, చిన్నారులు చలితో అవస్థలు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పొగమంచు, చలితీవ్రతతో వణుకుతున్నారు. మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, మోతుగూడెం, చింతూరు ప్రాంతాల్లో కూడా చలితీవ్రత నెలకొంది. ఘాట్ ప్రాంతాల్లో పొగమంచు తీవ్రతతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. అయితే చలిగాలులు విజృంభించినప్పటికీ పర్యాటకుల తాకిడి మన్యానికి ఏమాత్రం తగ్గలేదు. పొగమంచు ప్రకృతి అందాలను తనివితీరా వీక్షిస్తూ మధురానుభూతి పొందుతున్నారు. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 8.2 డిగ్రీలు మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 9.0 డిగ్రీలు అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 9.7 డిగ్రీలు -
తెలంగాణలో చలి పెరుగుతోంది.. మెదక్‌లో అత్యల్పం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 32.2 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు సగటున 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. సాధారణంగా నమోదు కావాల్సిన కనిష్ట ఉష్ణోగ్రతల కంటే మరింత తక్కువగా నమోదవుతున్నాయి. మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.1 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. హన్మకొండలో 4.8 డిగ్రీల సెల్సియస్, రామగుండంలో 3.3 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈశాన్య రుతుపవనాల రాక నేపథ్యంతో పాటు ఈశాన్య/ తూర్పు దిశల నుంచి రాష్ట్రానికి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగినట్లు వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. -
హైదరాబాద్‌ను వణికిస్తోన్న చలి (ఫొటోలు)
-
గజగజ మొదలైంది! రాష్ట్రంలో ఒక్కసారిగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాత్రిపూట బయటికి రావాలంటే గజగజ వణికే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఈనెల ప్రారంభం నుంచి శీతాకాలం ప్రారంభమైనప్పటికీ వరుస వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోపగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతుండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకట్రెండు చోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో 20 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణం కంటే తక్కువగా... బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 13.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతలకు ఒక డిగ్రీ అటుఇటుగా నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే భారీగా తగ్గాయి. హనుమకొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదైంది. హైదరాబాద్‌లో 5.6, మెదక్‌లో 5.4. నల్లగొండలో 3.6 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. 29 నుంచి ‘ఈశాన్య’ వర్షాలు నైరుతి రుతుపవనాలు దాదాపు దేశమంతటా ఉపసంహరణ అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈనెల 29న బంగాళాఖాతం మీద, దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మీదుగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. వీటి ప్రభావంతో ఆగ్నేయ ద్వీపకల్ప భారతంలో ఈనెల 29 నుంచి ఈశాన్య రుతుపవన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రానికి ఈశాన్య, తూర్పు దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు తప్ప ఎలాంటి హెచ్చరికలు లేవని చెప్పింది. -
మన్యంలో విజృంభిస్తున్న చలి
పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో మళ్లీ చలి గాలులు విజృంభిస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం తెల్లవారుజామున చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యల్పమని పరిశోధన స్థానం ఇన్చార్జి చెప్పారు. జి.మాడుగులలో 5.58, జి.కె.వీధిలో 5.72, అరకులోయలో 6.45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9 డిగ్రీలు, అరకులోయ కేంద్రం కాఫీబోర్డు వద్ద 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురవడంతో ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీలోని అరకులోయ, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో సూర్యోదయం కాలేదు. మంచు తీవ్రత చలిగాలులతో వ్యవసాయ పనులు, వారపుసంతలకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచుతో పాడేరు, చింతపల్లి, అనంతగిరి ఘాట్ రోడ్లలో వాహన చోదకులంతా లైట్లు వేసుకునే వాహనాలు నడిపారు. -
చింతపల్లి @ 5.6 డిగ్రీలు
సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. అన్ని ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సగటున 2 నుంచి 4 డిగ్రీల మేర పడిపోయాయి. ఈ సమయంలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల వరకూ నమోదవుతుంటాయి. తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కి.మీ. ఎత్తులో వీస్తున్న ఉత్తర గాలుల వల్ల చలి తీవ్రత పెరిగినట్టు వాతావరణ శాఖాధికారులు చెప్పారు. రానున్న వారం రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని, 15 రోజుల పాటు దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. విశాఖ మన్యంలో వారం రోజులుగా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం చింతపల్లిలో అత్యల్పంగా 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర తీరం మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తర భారతదేశం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో మూడు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ముంచంగిపుట్టులో 12.63 డిగ్రీలు, జి.మాడుగులలో 13.64, డుంబ్రిగూడలో 13.74, అరకులో 13.91, పెదబయలులో 14.61, హుకుంపేటలో 14.80, పాడేరులో 15.16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు మరింత క్షీణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
వణికిస్తున్న చలి
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/పాడేరు/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి విజృంభిస్తోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలిగాలుల తీవ్రత మరో రెండు రోజులు పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా విశాఖ ఏజెన్సీలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సోమవారం సాధారణం కంటే 3.7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఈ సీజన్లోనే అత్యల్పంగా చింతపల్లిలో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 11 డిగ్రీలు, నందిగామలో 12.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతిశీతల ప్రాంతాలైన లంబసింగి, పాడేరు ఘాట్, డల్లాపల్లి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. -
చలి మంటలు
సాక్షి,అమరావతి/సాక్షి, విశాఖపట్నం: శీతాకాలం ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. క్రమేణా చలి పెరుగుతోంది. రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంగా వేడి ఎక్కువగా ఉండే విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో సైతం చలి తీవ్రత పెరిగింది. దీంతో ఇంట్లో ఏసీల వాడకం తగ్గింది. స్వెట్టర్లు ధరించి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఏజెన్సీ, కొండప్రాంతాల్లోని ప్రజలను చలిపులి వణికిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతోంది. ఇక్కడ చలిమంటల (క్యాంప్ ఫైర్) వేస్తూ, చల్లటి వాతావరణంలో వేడిని ఆస్వాదిస్తూ పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉదయం పది వరకూ పొగమంచు తెరలు వీడటంలేదు. దీంతో రహదారులు కానరాక వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పొగమంచు సమయంలో ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రవాణా, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. శనివారం విశాఖపట్నం జిల్లా లంబసింగిలో 9, చింతపల్లిలో 12.2, పాడేరులో 12, అరకులో 14 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం నగరంలో కనీస ఉష్ణోగ్రత సాధారణం కంటే 3, కళింగపట్నంలో 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. అప్రమత్తంగా ఉండటం అవసరం చలి పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణిలు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లే వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఎండ వచ్చిన తర్వాత వెళ్లాలని చెప్పారు. చలి నుంచి రక్షణకు ఊలు కోటు, మంకీక్యాప్/మఫ్లర్ వాడటం ఉత్తమని, ఉదయం గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలని, ఆస్తమా బాధితులు చలి ప్రాంతాలకు వెళ్లరాదని హైదరాబాద్‌కు చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ పీఎల్ఎన్ కపర్ధి సూచించారు. చర్మసంబంధిత సమస్యలు కూడా చలికి ఎక్కువవుతాయని వైద్య నిపుణులు చెప్పారు. ఈ చలికాలం భిన్నం సుమీ! ఈ ఏడాది చలికాలం భిన్నంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ ఎక్కువ నమోదై వేడి పెరుగుతుంది.. రాత్రి ఉష్ణోగ్రతలు 1 నుంచి 3 డిగ్రీలు తగ్గి.. చలిగా ఉంటుందని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే సాధారణం కన్నా స్వల్ప అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయనీ పేర్కొంది. ఈ నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. దేశ ఉత్తర అంచుల్లో ఉన్న ప్రాంతాలు మినహా.. అన్నిచోట్లా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వెల్లడించింది. మాన్సూన్ కపుల్డ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ (ఎంసీఎఫ్‌ఎస్) ఆధారంగా, నవంబర్‌లో నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఐఎండీ ఈ అంచనాల్ని విడుదల చేసింది. దీని ప్రకారం డిసెంబర్ నెలాఖరు వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తుందని స్పష్టం చేసింది. కోస్తా తీరంలో వెచ్చటి సముద్ర గాలుల కారణంగా.. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ అధికంగా ఈ నెలాఖరు వరకూ నమోదవుతాయని అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం 1 నుంచి 3 డిగ్రీల వరకూ తగ్గుతాయన్నారు. రాయలసీమలో మరోరకంగా.. రాయలసీమలో పరిస్థితి మాత్రం కోస్తాకు భిన్నంగా ఉంటుందని, ఈసారి ఆ ప్రాంతంలో చలి వణికించనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉదయం, రాత్రి సాధారణం కంటే కనీసం 2 నుంచి 3 డిగ్రీలు తగ్గుదల కనిపిస్తుందన్నారు. -
చలి చంపేస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... ఖమ్మంలో గరిష్టంగా 32.6 డిగ్రీ సెల్సియస్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో కనిష్టంగా 7.1 డిగ్రీల సెల్సియస్ నమోద య్యాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని 9 మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదైనట్లు వాతా వరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. చదవండి: సిద్దిపేటలో సామూహిక గృహ ప్రవేశాలు ప్రస్తుత సీజన్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.6 డిగ్రీలు తక్కువ నమోదవుతుండగా.. గరిష్ట ఉష్ణోగ్రత 3.9డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. జిల్లా కేంద్రాలవారీగా ఉష్ణోగ్రతల నమోదును పరిశీలిస్తే.. నల్లగొండ మినహాయించి అన్నిచోట్లా గరిష్ట ఉష్ణోగ్రతలు 30డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అధికంగా ఖమ్మం 32.6 డిగ్రీలు, నిజామాబాద్ 32.4డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 10.6 డిగ్రీలు, మెదక్‌లో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రెండ్రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం/తిరుమల: ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు మన్నార్ గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ట్రోపో ఆవరణం ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో నెల్లూరులో 6 సెం.మీ, వెంకటగిరి, శ్రీకాళహస్తిలో 5, తొట్టంబేడులో 4, తడ, సూళ్లూరుపేట, గూడూరు, పలమనేరు, పెనగలూరులో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వారం రోజులుగా వర్ష ప్రభావంతో తిరుమల గిరుల్లో చలితీవ్రత అధికమైంది. ఆదివారం కురిసిన వర్షానికి రెండో ఘాట్ వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. అధికారులు సకాలంలో వాటిని తొలగించారు. -
దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి తమిళనాడు తీరానికి సమీపంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. దీపావళి తర్వాత చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గడచిన 24 గంటల్లో కావలిలో 7 సెం.మీ., సూళ్లూరుపేటలో 6, ఒంగోలు, తడ, వింజమూరు, శ్రీకాళహస్తి, తొట్టంబేడులో 4, వెంకటగిరి, చీమకుర్తి, సత్యవేడు, పుల్లంపేటలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
మార్కెట్లో చలితో రైతు మృతి
కేసముద్రం: మార్కెట్ యార్డులో చలికి తట్టుకోలేక ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో శనివారం చోటుచేసుకుంది. గూడూరు మండలం నాయక్‌పల్లికి చెందిన నల్లపురి సత్తయ్య (65) పది బస్తాల ధాన్యాన్ని అమ్మేందుకు గురువారం ఉదయం మార్కెట్‌కు తీసుకొచ్చారు. హరికృష్ణ కంపెనీకి చెందిన వ్యాపారి టెండర్ వేసి రూ.1849లకు కొనుగోలు చేశాడు. రాత్రి సమయంలో కాంటాలు కావడం.. సదరు వ్యాపారి డబ్బులు మరుసటి రోజు ఇస్తామని చెప్పాడు. ఇంతలో ఇంటికి వెళ్లి వద్దామన్నా వాహనాలు లేకపోవడంతో ఓపెన్ షెడ్డులో నిద్రించాడు. చలికి తట్టుకోలేని సత్తయ్య తెల్లవారుజామున అస్వస్థతకు గురై మూత్ర విసర్జన చేసి వస్తుండగా కింద పడిపోయాడు. వెంటనే ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు మార్కెట్ కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. వ్యాపారి, అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు మృతి చెందాడని ఆరోపించారు. జాయింట్ కలెక్టర్ డేవిడ్, డీఎంవో సురేఖ, ఆర్డీఓ కొమురయ్య, ఎస్ఐ సతీష్, మార్కెట్ కార్యదర్శి మల్లేశం ఆందోళనకారులకు సర్ది చెప్పారు. తక్షణ సాయంగా మార్కెట్ నుంచి రూ.10వేలు, వ్యాపారి రూ.10 వేలను అందజేశారు. మార్కెట్ నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు డీఎంవో సురేఖ తెలిపారు. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. లంబసింగిలో 3 డిగ్రీలు, చింతపల్లి 5, జికె వీది 5, పాడేరు 4, మినుములూరు 2, జి మాడుగుల 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
చలి గుప్పిట్లో విశాఖ ఏజెన్సీ
సాక్షి, విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. విశాఖ ఏజెన్సీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగి, చింతపల్లిలో కూడా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. లంబసింగిలో '0' డిగ్రీలు, చింతపల్లి, జికె వీది 3, పాడేరు 9, మినుములూరు 7.2, జి మాడుగుల 7.2 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. -
చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ /సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా అతి శీతల ప్రభావాన్ని చవిచూస్తున్నారు. శీతాకాలం అంటే సహజంగా రాత్రి వేళ చలి వణికిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. కానీ కొన్నాళ్లుగా రాత్రే కాదు.. పగలు కూడా చలి వెంటాడుతోంది. ఇటీవల సంభవించిన పెథాయ్ తుపాను తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమయింది. ఉత్తరాదితో పాటు వాయవ్య భారతదేశంలోనూ శీతల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీసహా వాయవ్య భారతంలో వచ్చే రెండు మూడ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఉత్తరాదిలో పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సింగిల్ డిజిట్‌కి చేరుకోవడంతో పంటలపై కూడా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. గడ్డకట్టిన దాల్ సరస్సు చలితో జమ్ము కశ్మీర్ వాసులు గజగజలాడుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత 11 ఏళ్లలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 6.8 డిగ్రీలకు పడిపోయాయి. ఫలితంగా ప్రఖ్యాత దాల్ సరస్సులో కొంత భాగం గడ్డ కట్టింది. వాటర్ పైపులలో నీరు గడ్డ కట్టేయడంతో ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. సరస్సులు కూడా గడ్డ కట్టేయడం గత పదకొండేళ్లలో ఇప్పుడే జరిగింది. ఇక కార్గిల్‌లో మైనస్ 15.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పగలు చలి ఎందుకంటే..? సాధారణంగా ఆకాశం నిర్మలంగా ఉంటే సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. అందువల్ల పగటి వేళ ఎండ ప్రభావం ఉండడంతో చలి తీవ్రత కనిపించదు. కానీ పగలు పొగమంచు కూడా ఏర్పడుతోంది. ఈ మంచు సూర్యోదయంకాగానే పైకి చేరి తేలికపాటి మేఘాలుగా ఏర్పడుతోంది. దీంతో సూర్యరశ్మి భూమికి అంతగా చేరడం లేదు. ఇదే వాతావరణం అటు ఉత్తర, వాయవ్య భారతదేశంలోనూ ఉంటోంది. ఫలితంగా అటు నుంచి పగలు కూడా చల్లగాలులు వీస్తున్నాయి. ఇవన్నీ వెరసి పగటి చలికి కారణమవుతున్నాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి వివరించారు. ప్రస్తుతం ఇటు కోస్తాంధ్ర (రాయలసీమ మినహా), అటు ఉత్తర తెలంగాణల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా రికార్డవుతుండడంతో చలి తీవ్రతకు కారణమవుతోంది. 11 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోయాయి. ముఖ్యంగా మైదానంకంటే ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా క్షీణిస్తున్నాయి. కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా లంబసింగిలోను 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్రలో గరిష్ట ఉష్ణోగ్రతలు 27–30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 11–21 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అయితే రాయలసీమలో మాత్రం పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–3 డిగ్రీలు అ«ధికంగా నమోదవుతుండడం వల్ల కోస్తా, తెలంగాణ కంటే చలి ప్రభావం అక్కడ తక్కువగా ఉంటోంది. మరో వారం రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగడమే కాక చలి మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జనవరి మొదటి వారం నుంచి క్రమంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వీరు పేర్కొంటున్నారు. -
చలి మంటే చితిమంటైంది!
రాయపర్తి: చలి మంటే ఓ వృద్ధుడి పాలిట చితిమంటైంది. చలి తీవ్రతను తట్టుకోలేక ఇంట్లోనే చలికాగుతూ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లక్ష్మణ్‌రావు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కుంట మారయ్య (85), మల్లమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు ఒక్క కూతురు. అందరి వివాహాలు చేశారు. భార్య మల్లమ్మ మృతితో మారయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. రెండు నెలల క్రితం అనారోగ్యం బారిన పడి కాళ్లు చచ్చుపడిపోయాయి. చలిని తట్టుకోలేక మంచం పక్కనే మంట పెట్టుకుని పడుకున్నాడు. మధ్యరాత్రి గొంగడికి నిప్పంటుకోగా.. కాళ్లు సహకరించకపోవడంతో లేవలేని పరిస్థితిలో అక్కడికక్కడే ఆహుతయ్యాడు. చలికి 18 మంది మృతి సాక్షి నెట్వర్క్: చలి తీవ్రతకు బుధవారం 18 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మంది, కరీంనగర్ జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పెథాయ్ తుపాను ప్రభావంతో వీస్తున్న చలిగాలులతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. -
రాష్ట్రం.. గజగజ
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం: చలి.. చలి! చిన్నా పెద్దా ఒకటే వణుకు... ఉష్ణోగ్రతల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో పగలు, రాత్రి అనే తేడా తెలియడం లేదు. భానుడి కిరణాలు సోకక ఎటు చూసినా, ఎప్పుడు చూసినా మసక మసకగానే కనిపిస్తోంది. చలి పులి పట్టపగలే అందరినీ గజగజలాడిస్తోంది. శీతల గాలుల ప్రభావానికి రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల వ్యవధిలో 45 మంది మృత్యువాత పడటం గమనార్హం. ఇక నోరులేని మూగజీవాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, పెథాయ్ తుపాను ప్రభావంతో అతి శీతలమైన ఈదురు గాలులు ఈడ్చి కొడుతుండటంతో రాష్ట్రం మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర చలితో వణికిపోతోంది. రాత్రి ఉష్ణోగ్రతలే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. దీంతో పగటిపూట కూడా చలిగా ఉంటోంది. ఒక్కసారిగా పెరిగిన చలి జనం ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న శీతల పవనాలకు తట్టుకోలేక సోమవారం 26 మంది ప్రాణాలు కోల్పోగా మంగళవారం 19 మంది చనిపోయారు. రాష్ట్రంలో వడగాడ్పు మరణాలు భారీగా నమోదైనా చలిగాలులకు ఇంత పెద్ద ఎత్తున మృత్యువాత పడటం అరుదని పేర్కొంటున్నారు. వణికిస్తున్న ఉత్తరాది గాలులు బంగాళాఖాతంలో అల్పపీడనం/వాయుగుండం/తుపాన్లు ఏర్పడినప్పుడు మేఘాలు ఆవరించి ఉంటాయి. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చలి తీవ్రత అంతగా ఉండదు. అయితే నిన్నటిదాకా కొనసాగిన పెథాయ్ తుపాను అల్పపీడనంగా బలహీనపడడంతో చలికి రెక్కలొచ్చి నట్టయింది. శనివారం నుంచే వణికించడం మొదలైంది. అల్పపీడనం ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశం నుంచి కోస్తా వైపు చల్ల గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో పగలు, రాత్రి చలి తీవ్రత పెరుగుతోంది. ఇళ్లలోనే గడుపుతున్నా ఇబ్బంది పెడుతోంది. డిసెంబర్ 22వతేదీ నుంచి సూర్యుడు ఉత్తరార్థగోళం వైపు పయనించడం వల్ల భూమికి దూరమవుతాడు. ఫలితంగా సూర్యకిరణాలు వాలుగా పడుతూ ఎండ తీవ్రత తగ్గి రాత్రి ఉష్ణోగ్రతలు క్షీణిస్తాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా (సాధారణం కంటే 3–10 డిగ్రీలు) తక్కువగా నమోదవుతున్నాయి. ఇది క్రమంగా మరింత తగ్గి చలి విజృంభిస్తుందని, అదే సమయంలో పొగమంచు కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పడిపోయిన గరిష్ట ఉష్ణోగ్రతలు.. రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే బాగా పడిపోయాయి. కృష్ణా జిల్లా నందిగామలో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు విజయవాడలో 9, మచిలీపట్నంలో 8, తునిలో 7, నరసాపురంలో 7, జంగమేశ్వరపురంలో 6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన పగటి, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం స్పల్పంగా మాత్రమే ఉండటం గమనార్హం. చలి భారీగా పెరగడంతో ఉదయం 9 గంటలకు కూడా ట్యాప్ తిప్పితే నీళ్లు షాక్ కొడుతున్నాయి. మంచు దట్టంగా కురుస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామునే చలిమంటలు వేస్తున్నారు. పంటలకు కాపలాగా పొలాల్లో పడుకునే వారు దుంగలు రాజేసి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చలికి శరీరం గడ్డ కట్టుకుపోయేలా ఉందని వృద్ధులు పేర్కొంటున్నారు. ఉదయం 9 గంటలకు కూడా చలిగా ఉండటంతో బయటకు వెళ్లినవారు వణుకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. తెల్లవారుజామునే ఉదయం నడక కోసం వెళ్లేవారు ఈ చలితో సమయాన్ని మార్చుకుని 8 –9 గంటల మధ్య వెళుతున్నారు. పొలం పనులకు వెళ్లే కూలీలు వణికిపోతున్నారు. సూర్యరశ్మి లేకపోవటంతో అరటి, బొప్పాయి ఆకులపై కురిసిన మంచు నీటి బిందువుల్లా ఉండిపోతోంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారు చలి తీవ్రత వల్ల నరకయాతన అనుభవిస్తున్నారు. చలి నేపథ్యంలో స్వెట్టర్లు, ఉన్ని దుస్తులకు బాగా గిరాకీ పెరిగింది. వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏజెన్సీలో రాకపోకలకు ఇబ్బందులు ఏజెన్సీ ప్రాంతంలో రాత్రిపూట పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో రాత్రిపూట వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అరకులో పర్యాటకుల కోసం రిసార్టు నిర్వాహకులు రాత్రిపూట చలిమంటలు ఏర్పాటు చేస్తున్నారు. గాజు కిటికీలకు బయట భాగంలో మంచు దట్టంగా ఆవరిస్తోంది. జనవరిలో మరింత ఉధృతం... విశాఖపట్నం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉన్నా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా పూర్తిస్థాయిలో పడిపోలేదు. విశాఖ జిల్లా లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత డిసెంబరు చివరికి సున్నా డిగ్రీలకు చేరిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 7 – 8 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడే ఇక్కడి వారు ఇబ్బంది ఎదుర్కొంటారు. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతే ఇళ్ల ఎదుట చలిమంటలు వేసి నిద్రిస్తారు. దీంతో కొంతవరకూ చలి నుంచి ఊరట లభిస్తుంది. చింతపల్లి, పాడేరు, నర్సీపట్నం, అరకు, మారేడుమిల్లి, సీతంపేట ఏజెన్సీల్లో జనవరిలో చలి తీవ్రరూపం దాల్చుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా చలి ముదురుతుంది. రక్తనాళాలు పూడుకుపోయే ప్రమాదం.. చలి బాగా పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, గుండె, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి సూచించారు. ‘చలికి శరీరంలో రక్తానికి గడ్డ కట్టే స్వభావం ఉంటుంది. దీనివల్ల గుండె రక్తనాళాలు పూడుకుపోతాయి. అందువల్ల హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, బలహీనులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. చలి నుంచి కాపాడుకోవాలి ఇలా.... – చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు ధరించాలి. చెవులకు చల్ల గాలి తగలకుండా ఉన్ని మఫ్లర్, టోపీ ధరించాలి. – ఇళ్లలోకి చల్ల గాలి రాకుండా కిటికీలు మూసివేయాలి. – అవకాశం ఉన్నవారు గది వాతావరణం పడిపోకుండా ఎయిర్ కండిషనర్లు వాడుకోవచ్చు. – ద్విచక్ర వాహనాలపై రాత్రిపూట, తెల్లవారుజామున వెళ్లాల్సి వస్తే ముక్కు, చెవులకు చల్ల గాలి తగలకుండా ఉన్ని టోపీ ధరించాలి.స్వెట్టర్లు వాడాలి. – ఉదయం నడక అలవాటు ఉన్నవారు సూర్యోదయమైన తర్వాత వెళ్లడం మంచిది.