సత్తయ్య మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య, కూతురు
కేసముద్రం: మార్కెట్ యార్డులో చలికి తట్టుకోలేక ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్‌లో శనివారం చోటుచేసుకుంది. గూడూరు మండలం నాయక్‌పల్లికి చెందిన నల్లపురి సత్తయ్య (65) పది బస్తాల ధాన్యాన్ని అమ్మేందుకు గురువారం ఉదయం మార్కెట్‌కు తీసుకొచ్చారు. హరికృష్ణ కంపెనీకి చెందిన వ్యాపారి టెండర్ వేసి రూ.1849లకు కొనుగోలు చేశాడు. రాత్రి సమయంలో కాంటాలు కావడం.. సదరు వ్యాపారి డబ్బులు మరుసటి రోజు ఇస్తామని చెప్పాడు. ఇంతలో ఇంటికి వెళ్లి వద్దామన్నా వాహనాలు లేకపోవడంతో ఓపెన్ షెడ్డులో నిద్రించాడు. చలికి తట్టుకోలేని సత్తయ్య తెల్లవారుజామున అస్వస్థతకు గురై మూత్ర విసర్జన చేసి వస్తుండగా కింద పడిపోయాడు.
వెంటనే ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు మార్కెట్ కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. వ్యాపారి, అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు మృతి చెందాడని ఆరోపించారు. జాయింట్ కలెక్టర్ డేవిడ్, డీఎంవో సురేఖ, ఆర్డీఓ కొమురయ్య, ఎస్‌ఐ సతీష్, మార్కెట్ కార్యదర్శి మల్లేశం ఆందోళనకారులకు సర్ది చెప్పారు. తక్షణ సాయంగా మార్కెట్ నుంచి రూ.10వేలు, వ్యాపారి రూ.10 వేలను అందజేశారు. మార్కెట్ నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు డీఎంవో సురేఖ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment