శీతాకాలంలో గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు
భారత వాతావరణ విభాగం ప్రాథమిక అంచనా
లానినొ పరిస్థితులతో చలి తీవ్రత ఎక్కువగా ఉండే చాన్స్
రానున్న రెండ్రోజులు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత శీతాకాలంలో చలితీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. డిసెంబర్, జనవరి నెలల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతాయని సూచించింది. లానినొ పరిస్థితుల కారణంగా వాతావరణంలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక అంచనాలను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా విడుదల చేసింది.
సాధారణంగా వర్షాకాలం ముగిసిన తర్వాత అక్టోబర్ నెలలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువ స్థాయిలో నమోదవుతుంటాయి. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం రాష్ట్రంలో ఏర్పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల సాధారణం కంటే అధికంగా నమోదు కావడంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి.
పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం, ఆ తర్వాత ఒక్కసారిగా పతనం కావడంలాంటి పరిస్థితులు ఈ సీజన్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తూర్పు, మధ్య పసిఫిక్ ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు (లానినొ) నమోదవుతుండడమే ఇందుకు కారణమని వివరిస్తున్నారు.
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని, ఉదయం వేళల్లో తీవ్రమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. గతంలో, తాజాగా 2022లో కూడా రాష్ట్రంలో ఈ తరహా లానినొ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర శివారుల్లోని కొన్ని ప్రాంతాల్లో 8 డిగ్రీ సెల్సీయస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయని, ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 4 డిగ్రీలకు పడిపోయిందని గుర్తుచేస్తున్నారు.
సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
సోమవారం రాష్ట్రంలోని పలు ప్రధాన కేంద్రాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 35.6 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా దుండిగల్‌లో 20.7 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది.
పలు జిల్లాలకు వర్ష సూచన
రాష్ట్రంలో రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ, మధ్య బంగాళాఖాతం సమీపంలోని ఏపీ తీర ప్రాంతంలో చక్రవాతపు ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం ఏపీలో అధికంగా ఉన్నప్పటికీ, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని సూచించింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment