ఉష్ణోగ్రతలు తగ్గడంతో పట్టుగూళ్లకు సున్నపుకట్టు తెగులు
దిగుబడులు, నాణ్యతపై తీవ్ర ప్రభావం
మార్కెట్‌లో ఆశించిన ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులు
తళుక్కున మెరవాల్సిన ‘పట్టు’..మార్కెట్‌లో వెలవెలబోతోంది. చలి తీవ్రతకు పట్టుగూళ్లకు సన్నపుకట్టు తెగులు సోకుతుండగా నాణ్యత తగ్గి ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పట్టుగూళ్లు ఉత్పత్తి చేసిన రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు.
హిందూపురం: పట్టుగూళ్ల మార్కెట్‌కు సత్యసాయి జిల్లా హిందూపురం ఆసియాలోనే పేరుగాంచింది. మిగతా మార్కెట్లతో పోలిస్తే అధిక ధరలు దక్కుతుండటంతో హిందూపురం, మడకశిర, గుడిబండ, సోమందేపల్లి, లేపాక్షితోపాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వందలాది మంది రైతులు పట్టుగూళ్లను ఇక్కడి తీసుకువచ్చి విక్రయాలు చేస్తుంటారు. అందువల్లే హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌కు రోజూ 6 వేల క్వింటాళ్లకుపైగా పట్టుగూళ్లు వస్తుంటాయి. కానీ ప్రస్తుతం పట్టుగూళ్ల ఉత్పత్తిపై చలి ప్రభావం తీవ్రంగా చూపుతోంది. అంతేకాకుండా పట్టుగూళ్లకు సున్నపుకట్టు తెగులు సోకడంతో దిగుబడి తగ్గుతోంది. ప్రస్తుతం మార్కెట్‌కు 3 వేల క్వింటాళ్లలోపే పట్టుగూళ్లు వస్తున్నాయి.
ముందుకురాని రీలర్లు
దిగుబడి అంతంతమాత్రమే ఉండగా మార్కెట్‌లో మంచి ధర పలకాలి. కానీ పట్టుగూళ్ల కొనుగోళ్లకు రీలర్లు ముందుకురాకపోవడంతో ఆశించిన ధరలు రావడం లేదు. ఓ రీలర్ టెండర్ వేస్తే దాన్ని మించి కనీసం రూ.5 ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఈనెల 15వ తేదీన కిలో బైవోల్టీన్ రకం పట్టుగూళ్లు రూ.750 పలకగా, కనిష్టంగా రూ.552 మాత్రమే పలికాయి. అలాగే 19 తేదీన గరిష్టంగా రూ.744, కనిష్టంగా రూ.567, 20న గరిష్టంగా రూ.751, కనిష్టంగా రూ.620, 21వతేదీన కిలో గరిష్టంగా రూ.748, కనిష్టంగా రూ.544 మాత్రమే పలికాయి. దీంతో ఎంతో ఆశతో ఇక్కడివరకూ వస్తున్న రైతులు కనీసం రవాణా చార్జీలు దక్కక నష్టాలపాలవుతున్నారు.
ఉష్ణోగ్రత తగ్గకుండానే చూసుకోవాలి
పట్టుగూళ్లు షెడ్లలో ఉష్ణగ్రతలు తగ్గకుండా చూసుకోవాలని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే పట్టుగూళ్లు సున్నపుకట్టు బారిన పడి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. షెడ్లులో రాత్రిళ్లు కనీసం 20 డిగ్రీలు తగ్గకుండా ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. కొందరు రైతులు షెడ్లలో వేడికోసం 200 వాల్టల బల్పులు పెడుతున్నా, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. షెడ్లలో బొగ్గుల కుంపటి పెట్టి వేడిని పెంచుకోవాలన్నారు. మార్కెట్‌కు గూళ్లు తెచ్చే ముందు కూడా ఆ రోజు చివరగా అల్లిన గుడ్డులో పురుగు ప్యూపా అయిందో లేదో చూసి పూర్తిగా ప్యూపా దశలో ఉంటేనే మార్కెట్‌కు తీసుకువస్తే ఆశించిన ధర లభిస్తుంది.
ధర పెరిగితేనే గిట్టుబాటు
చలి ప్రభావంతో పట్టుగూళ్ల ఉత్పత్తి చాలా ఇబ్బందికరంగా మారుతోంది. వ్యయప్రసాలకోర్చి గూళ్లను మార్కెట్‌కు తీసుకువస్తే సరైన ధర దక్కక నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుత ‘పురం’ మార్కెట్‌లో క్వింటా బైవోల్ట్‌న్ రకం పట్టుగూళ్లు రూ.700 వరకు పలుకుతున్నాయి. క్వింటా కనీసం రూ.800పైగా పలికితే నష్టాలు ఉండవు. లేకపోతే రైతుల రెక్కల కష్టం వృథా కావడం ఖాయం. – వీరాంజినేయ, పావగడ
రీలర్లు ముందుకు రావడం లేదు
పట్టుగూళ్ల కొనుగోలుకు రీలర్లు ముందుకు రావడం లేదు. ఒక రీలర్ టెండరు వేస్తే దానిపైన రూ.5 పెంచేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. వ్యయ ప్రయాసల కోర్చి పట్టుగూళ్లును మార్కెట్‌కు తెస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. కనీసం క్వింటా పట్టుగూళ్లు రూ.750పైబడి పలికితే రైతులకు ఇబ్బందులు ఉండవు. ప్రసుత్తం ఆ మేర ధర పలకడం లేదు. – హర్షవర్థన్‌రెడ్డి, వైబీ హళ్లి
Comments
Please login to add a commentAdd a comment