
అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. జనం ఒక్కసారిగా ఎగబడగా.. నియంత్రించేందుకు సరైన పోలీసు సిబ్బంది లేకుండా పోయారు. హత్యా రాజకీయాలకు బలైన వైఎస్సార్‌సీపీ బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించి.. ఓదార్చారు.
ఈ క్రమంలో రామగిరి పర్యటనలో ఎక్కడా తగిన భద్రతా సిబ్బంది కనిపించలేదు. పైగా హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో.. ఆ జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల రీత్యా వీఐపీని తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.
ఈ పరిణామంతో హెలికాఫ్టర్ నుంచి దిగిపోయి రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వపెద్దల ఉద్దేశపూర్వక చర్యలు మరోసారి తేటతెల్లం అయ్యాయని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. జగన్ పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. కనీస భద్రత కల్పించకపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో వైఎస్ జగన్ పర్యటనల సందర్భంగానూ కూటమి ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించింది. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.
