Difficulties for farmers
-
చలికి ‘పట్టు’ తప్పుతోంది
తళుక్కున మెరవాల్సిన ‘పట్టు’..మార్కెట్లో వెలవెలబోతోంది. చలి తీవ్రతకు పట్టుగూళ్లకు సన్నపుకట్టు తెగులు సోకుతుండగా నాణ్యత తగ్గి ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పట్టుగూళ్లు ఉత్పత్తి చేసిన రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు.హిందూపురం: పట్టుగూళ్ల మార్కెట్‌కు సత్యసాయి జిల్లా హిందూపురం ఆసియాలోనే పేరుగాంచింది. మిగతా మార్కెట్లతో పోలిస్తే అధిక ధరలు దక్కుతుండటంతో హిందూపురం, మడకశిర, గుడిబండ, సోమందేపల్లి, లేపాక్షితోపాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వందలాది మంది రైతులు పట్టుగూళ్లను ఇక్కడి తీసుకువచ్చి విక్రయాలు చేస్తుంటారు. అందువల్లే హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌కు రోజూ 6 వేల క్వింటాళ్లకుపైగా పట్టుగూళ్లు వస్తుంటాయి. కానీ ప్రస్తుతం పట్టుగూళ్ల ఉత్పత్తిపై చలి ప్రభావం తీవ్రంగా చూపుతోంది. అంతేకాకుండా పట్టుగూళ్లకు సున్నపుకట్టు తెగులు సోకడంతో దిగుబడి తగ్గుతోంది. ప్రస్తుతం మార్కెట్‌కు 3 వేల క్వింటాళ్లలోపే పట్టుగూళ్లు వస్తున్నాయి. ముందుకురాని రీలర్లు దిగుబడి అంతంతమాత్రమే ఉండగా మార్కెట్లో మంచి ధర పలకాలి. కానీ పట్టుగూళ్ల కొనుగోళ్లకు రీలర్లు ముందుకురాకపోవడంతో ఆశించిన ధరలు రావడం లేదు. ఓ రీలర్ టెండర్ వేస్తే దాన్ని మించి కనీసం రూ.5 ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఈనెల 15వ తేదీన కిలో బైవోల్టీన్ రకం పట్టుగూళ్లు రూ.750 పలకగా, కనిష్టంగా రూ.552 మాత్రమే పలికాయి. అలాగే 19 తేదీన గరిష్టంగా రూ.744, కనిష్టంగా రూ.567, 20న గరిష్టంగా రూ.751, కనిష్టంగా రూ.620, 21వతేదీన కిలో గరిష్టంగా రూ.748, కనిష్టంగా రూ.544 మాత్రమే పలికాయి. దీంతో ఎంతో ఆశతో ఇక్కడివరకూ వస్తున్న రైతులు కనీసం రవాణా చార్జీలు దక్కక నష్టాలపాలవుతున్నారు. ఉష్ణోగ్రత తగ్గకుండానే చూసుకోవాలి పట్టుగూళ్లు షెడ్లలో ఉష్ణగ్రతలు తగ్గకుండా చూసుకోవాలని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే పట్టుగూళ్లు సున్నపుకట్టు బారిన పడి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. షెడ్లులో రాత్రిళ్లు కనీసం 20 డిగ్రీలు తగ్గకుండా ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. కొందరు రైతులు షెడ్లలో వేడికోసం 200 వాల్టల బల్పులు పెడుతున్నా, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. షెడ్లలో బొగ్గుల కుంపటి పెట్టి వేడిని పెంచుకోవాలన్నారు. మార్కెట్‌కు గూళ్లు తెచ్చే ముందు కూడా ఆ రోజు చివరగా అల్లిన గుడ్డులో పురుగు ప్యూపా అయిందో లేదో చూసి పూర్తిగా ప్యూపా దశలో ఉంటేనే మార్కెట్‌కు తీసుకువస్తే ఆశించిన ధర లభిస్తుంది. ధర పెరిగితేనే గిట్టుబాటు చలి ప్రభావంతో పట్టుగూళ్ల ఉత్పత్తి చాలా ఇబ్బందికరంగా మారుతోంది. వ్యయప్రసాలకోర్చి గూళ్లను మార్కెట్‌కు తీసుకువస్తే సరైన ధర దక్కక నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుత ‘పురం’ మార్కెట్లో క్వింటా బైవోల్ట్న్ రకం పట్టుగూళ్లు రూ.700 వరకు పలుకుతున్నాయి. క్వింటా కనీసం రూ.800పైగా పలికితే నష్టాలు ఉండవు. లేకపోతే రైతుల రెక్కల కష్టం వృథా కావడం ఖాయం. – వీరాంజినేయ, పావగడరీలర్లు ముందుకు రావడం లేదు పట్టుగూళ్ల కొనుగోలుకు రీలర్లు ముందుకు రావడం లేదు. ఒక రీలర్ టెండరు వేస్తే దానిపైన రూ.5 పెంచేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. వ్యయ ప్రయాసల కోర్చి పట్టుగూళ్లును మార్కెట్‌కు తెస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. కనీసం క్వింటా పట్టుగూళ్లు రూ.750పైబడి పలికితే రైతులకు ఇబ్బందులు ఉండవు. ప్రసుత్తం ఆ మేర ధర పలకడం లేదు. – హర్షవర్థన్‌రెడ్డి, వైబీ హళ్లి -
కౌలు రైతుల ఊసేదీ..!
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: కౌలు రైతుల కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. సర్కారు నిర్లక్ష్యంతో వేలాది మంది కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దశాబ్దాలుగా వ్యవసాయ భూమిలేని పేద, మధ్యతరగతి కుటుంబాలు రైతుల వద్ద నుంచి భూముల్ని కౌలుకు తీసుకుని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. పదేళ్లుగా వ్యవసాయంలో తీవ్రంగా నష్టాలు వస్తుండటంతో వేలాది మంది భూ యజమానులు తమ భూములను కౌలుకు ఇవ్వడం ప్రారంభించారు. అంతే స్థాయిలో కౌలుకు తీసుకునేవారు అధికమయ్యారు. అలా కౌలు భూములపై ఆధారపడి జీవించే కుటుంబాలు జిల్లాలో 1.50 లక్షలకుపైగా ఉన్నాయి. కౌలు రైతులకు ఎలాంటి రక్షణ చట్టాలు లేకపోవడంతో భూ యజమానుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి విపత్తులకు గురై తీవ్రంగా నష్టపోతున్న రైతులకు పంట నష్టపరిహారంలోనూ అన్యాయం జరుగుతోంది. గ్రామ సభల ద్వారా స్థానిక రెవెన్యూ అధికారులు కౌలు రైతులను గుర్తించాలి. ప్రతి కౌలు రైతుకు రుణ అర్హత కార్డుల్ని రెవెన్యూ అధికారులు మంజూరు చేయాలి. ఇవి ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు చేయాలి. జూలై నాటికి రుణ అర్హత కార్డుల పంపిణీ పూర్తికావాలి. గుర్తించిన కౌలు రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయించాలి. కానీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జూన్ నెల ప్రారంభమైనా నేటికీ అధికారుల్లో కౌలు రైతుల ఊసే లేకుండా పోయింది. నాలుగేళ్లుగా పరిశీలిస్తే... 2011-12లో 14, 500 మందికి రుణ అర్హత కార్డులిచ్చారు. 2012-13 సంవత్సరంలో 8,149 మందికి ఇవ్వగా, గత ఏడాది 5,213 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బ్యాంకులు మాత్రం 30 వేల మందికి దాదాపు రూ.40 కోట్ల వరకు రుణాలివ్వాలని లక్ష్యం కాగా..కేవలం 200 మందికి రూ.30 లక్షలే ఇచ్చారు. పైగా ఈ ఏడాది కౌలు రైతులకు విభజన దెబ్బ తగిలింది. రాష్ట్ర విభజన ఒక వైపు.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు రావడంతో కౌలు రైతులను ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం ప్రకటించిన రుణాలపై కౌలు రైతులు ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. రుణ మాఫీతో కొంతైనా ఊరట కలుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు సంఘాలు కూడా ఎలాంటి ఆంక్షలు లేని రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది కౌలు రైతులను గుర్తించేందుకు షెడ్యూల్ ప్రకటించాలని, అందరికీ బ్యాంకు రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు. -
రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ మండలస్థాయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ నుంచి ఎంఆర్ఐలు, వీఆర్వోలతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేం దుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఏ మార్కెట్లోనైనా కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కువగా ఉంటే తడిచిపోకుం డా టార్పాలిన్లు కప్పాలని సూచించారు. ధాన్యా న్ని మిల్లులకు తరలించే క్రమంలో వాహనాల ఇబ్బంది ఏర్పడితే అద్దెకు తీసుకోవాలన్నారు. వాటి బిల్లులను సంబంధిత ఆర్డీఓలకు పంపించాలని వివరించారు. మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే డీఎస్ఓకు, ఏఎస్‌ఓకు ఫోన్‌చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, తరలింపులో ఎటువంటి సమస్యలున్నా శనివారంలోగా పరిష్కరించుకోవాలన్నారు. 11వ తేదీ వరకు ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తేవొద్దు అల్పపీడన ప్రభావం కారణంగా ఈ నెల 11వ తేదీ వరకు ఐకేపీ కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకురావద్దని జేసీ కోరారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కొనుగోళ్లు నిలుపుదల చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని అధికారులు, ఐకేపీ సిబ్బంది రైతులకు తెలియజేయాలని కోరారు. ఈ సెట్ కాన్ఫరెన్సులో పీడీ డీఆర్డీఏ సుధాకర్, డీఎం సివిల్ సప్లయిస్ వరప్రసాద్, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు ఉన్నారు. -
దెబ్బతీసిన ‘ఉపాధి’
యాచారం, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతుండడంతో వరికోతలకు కూలీల కొరత సమస్య తీవ్రంగా పరిణమించింది. తీరా చేతికి అందవచ్చిన పంటలు నేలపాలయ్యాయి. పనులు నిలిపివేయాలని ఎంత వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఇటీవల వడగళ్ల వర్షాలతో రైతులు పంటలు నష్టపోయారు. దీనికి పూర్తి బాధ్యత అధికారులే వహించాల్సి ఉంటుందని రైతులు స్పష్టం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వరిపంట కోత వచ్చింది. కూలీలు ఉపాధి హామీ పనులకు వెళుతుండడంతో వరికోతలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఆయా గ్రామాల రైతులు కోతలు ముగిసే వరకు ఉపాధి పనులు నిలిపేయాలని అధికారులను కోరినా ఫలితం శూన్యంగానే మారింది. కొన్ని గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పంట కోయకుండా ఉంచడంతో ఎండకు వాలిపోయింది. ఆర్థికంగా ఉన్న రైతులు యంత్రాల ద్వారా కోయించారు. పేద రైతులు యంత్రాల ఖర్చు భరించలేక సకాలంలో కోతలు కోయలేదు. వరికోతలు ఆలస్యం కావడంతో వడగళ్లతో పంట నష్టపోవాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి వడగళ్లతో మండలంలోని చింతుల్ల, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, మల్కీజ్‌గూడ, గునుగల్, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. నిజానికి కూలీల సమస్య లేకుంటే వారం ముందే కోత కోసి ధాన్యాన్ని ఇంటికి చేర్చుకునేవారు రైతులు. అధికారులు ఉపాధి పనులు నిలిపేస్తే కూలీల సమస్య వచ్చేది కాదు. వడగళ్ల వర్షం వల్ల పంటలు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చేది కాదు. నెలరోజుల ముందే కోతల ప్రారంభంలోనే నక్కర్తమేడిపల్లి, యాచారం, చింతుల్ల, చింతపట్ల గ్రామాల రైతులు అధికారులకు వినతిపత్రాలిచ్చారు. అయినా అధికారులు ఉపాధి పనులు నిలిపివేయలేదు. కూలీల కొరత కారణంగానే వరికోతల్లో జాప్యం ఏర్పడిందని సోమవారం పలు గ్రామాల రైతులు ఆవేదన చెందారు. జరిగిన నష్టానికి అధికారులే బాధ్యత వహించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మూడెకరాల పంట నష్టపోయా వడగళ్లతో మూడెకరాల వరి పంట నష్టపోయాను. కొద్ది రోజుల్లో పంట కోతకు వచ్చే అవకాశం ఉండగా వడగళ్లు నష్టపరిచాయి. అయినా పంటను కోద్దామంటే కూలీల సమస్య తీవ్రంగా మారింది. అధికారులు రైతులపై కక్షగట్టి దెబ్బతీశారు. - హరికిషన్‌రెడ్డి, రైతు, మొగుళ్లవంపు పొలం కౌలు ఎలా తీర్చాలి? గ్రామానికి చెందిన ఓ భూస్వామి వద్ద మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాను. కూలీల సమస్యతో కోతకు వచ్చిన వరిని కోయలేదు. వడగళ్లతో రూ. లక్ష విలువైన పంట పూర్తిగా నష్టపోయా. కౌలు ఎలా చెల్లించేది. అధికారులే ఆదుకోవాలి. - బేత ముత్యాలు, రైతు, నక్కర్తమేడిపల్లి