దెబ్బతీసిన ‘ఉపాధి’
యాచారం, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతుండడంతో వరికోతలకు కూలీల కొరత సమస్య తీవ్రంగా పరిణమించింది. తీరా చేతికి అందవచ్చిన పంటలు నేలపాలయ్యాయి. పనులు నిలిపివేయాలని ఎంత వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఇటీవల వడగళ్ల వర్షాలతో రైతులు పంటలు నష్టపోయారు. దీనికి పూర్తి బాధ్యత అధికారులే వహించాల్సి ఉంటుందని రైతులు స్పష్టం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వరిపంట కోత వచ్చింది. కూలీలు ఉపాధి హామీ పనులకు వెళుతుండడంతో వరికోతలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఆయా గ్రామాల రైతులు కోతలు ముగిసే వరకు ఉపాధి పనులు నిలిపేయాలని అధికారులను కోరినా ఫలితం శూన్యంగానే మారింది.
కొన్ని గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పంట కోయకుండా ఉంచడంతో ఎండకు వాలిపోయింది. ఆర్థికంగా ఉన్న రైతులు యంత్రాల ద్వారా కోయించారు. పేద రైతులు యంత్రాల ఖర్చు భరించలేక సకాలంలో కోతలు కోయలేదు. వరికోతలు ఆలస్యం కావడంతో వడగళ్లతో పంట నష్టపోవాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి వడగళ్లతో మండలంలోని చింతుల్ల, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, మల్కీజ్‌గూడ, గునుగల్, చౌదర్‌పల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. నిజానికి కూలీల సమస్య లేకుంటే వారం ముందే కోత కోసి ధాన్యాన్ని ఇంటికి చేర్చుకునేవారు రైతులు.
అధికారులు ఉపాధి పనులు నిలిపేస్తే కూలీల సమస్య వచ్చేది కాదు. వడగళ్ల వర్షం వల్ల పంటలు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చేది కాదు. నెలరోజుల ముందే కోతల ప్రారంభంలోనే నక్కర్తమేడిపల్లి, యాచారం, చింతుల్ల, చింతపట్ల గ్రామాల రైతులు అధికారులకు వినతిపత్రాలిచ్చారు. అయినా అధికారులు ఉపాధి పనులు నిలిపివేయలేదు. కూలీల కొరత కారణంగానే వరికోతల్లో జాప్యం ఏర్పడిందని సోమవారం పలు గ్రామాల రైతులు ఆవేదన చెందారు. జరిగిన నష్టానికి అధికారులే బాధ్యత వహించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మూడెకరాల పంట నష్టపోయా
వడగళ్లతో మూడెకరాల వరి పంట నష్టపోయాను. కొద్ది రోజుల్లో పంట కోతకు వచ్చే అవకాశం ఉండగా వడగళ్లు నష్టపరిచాయి. అయినా పంటను కోద్దామంటే కూలీల సమస్య తీవ్రంగా మారింది. అధికారులు రైతులపై కక్షగట్టి దెబ్బతీశారు.
- హరికిషన్‌రెడ్డి, రైతు, మొగుళ్లవంపు
పొలం కౌలు ఎలా తీర్చాలి?
గ్రామానికి చెందిన ఓ భూస్వామి వద్ద మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాను. కూలీల సమస్యతో కోతకు వచ్చిన వరిని కోయలేదు. వడగళ్లతో రూ. లక్ష విలువైన పంట పూర్తిగా నష్టపోయా. కౌలు ఎలా చెల్లించేది. అధికారులే ఆదుకోవాలి.
- బేత ముత్యాలు, రైతు, నక్కర్తమేడిపల్లి