Rice harvest
-
వరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ. 34 వేలు
సాక్షి, హైదరాబాద్: వరి పంటకు ఎకరాకు రూ. 32 వేల నుంచి 34 వేల మధ్య బ్యాంకులు రుణం ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కోరింది. ఈ మేరకు వచ్చే వ్యవసాయ సీజన్‌కు సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ కొలబద్ధ) నిర్ణయించాలని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి ప్రతిపాదనలు పంపింది. 2018–19 వర్షాకాల సీజన్‌కు సంబంధించి బ్యాంకులు ఇవ్వాల్సిన ఏకీకృత రుణ పరిమితి పెంపుపై పంటల సాగు ఖర్చుల ఆధారంగా నివేదించింది. ఎకరా సాగు ఖర్చుల ఆధారంగా లెక్కలు తీసిన అధికారులు అంత మొత్తానికి 10 నుంచి 20 శాతం అధికంగా రుణం ఇవ్వాలని పేర్కొన్నారు. 2017–18 సాగు ఖర్చుల ప్రకారం ఎకరా వరికి రూ. 28,066 వ్యయం అవుతోంది. ఇందుకు అనుగుణంగా రానున్న సీజన్లకు వరికి ఎకరాకు రూ. 32 వేల నుంచి రూ. 34 వేల మధ్య రుణం ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 29 వేల నుంచి రూ. 31 వేల మధ్య ఉంది. సాగునీటి వనరులు లేని ప్రాంతాల్లో మొక్కజొన్న పంటకు రూ. 18 వేల నుంచి రూ. 20 వేల మధ్య రుణ పరిమితి నిర్ణయించాలని కోరింది. ప్రస్తుతం ఇది రూ. 16 వేల నుంచి రూ. 18 వేల మధ్య ఉంది. యాసంగిలో మొక్కజొన్న అధికంగా సాగు చేస్తారని, ప్రస్తుతం వచ్చిన నూతన వంగడాలతో దిగుబడి కూడా పెరిగిందని, రుణం కూడా అధికంగా ఇస్తే రైతులు ఎక్కువగా సాగు చేస్తారని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆహార ధాన్యాలు, ఉద్యాన, నూనె గింజలు తదితర మొత్తం 81 పంటలకు ఎస్‌ఎల్‌టీసీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయనుంది. వాటికి రుణం పెంచాల్సిందే... పప్పు ధాన్యాల పంటల సాగు ఏటా పడిపోతోందని వ్యవసాయశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుల్లో పంట రుణం తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. పప్పు దినుసుల పంటలకు రుణ పరిమితి పెంచితే సాగు కూడా పెరుగుతుందని భావిస్తోంది. కందులకు రూ. 15 వేల నుంచి రూ. 18 వేల మధ్య రుణం ఇవ్వాలని నివేదించింది. పెసర, మినుములు ఇతరత్రా పంటలకు రూ. 12 వేల నుంచి రూ. 16 వేల మధ్య ఉండాలని ప్రతిపాదించింది. సాగునీటి వనరులున్న చోట పత్తికి రూ. 34 వేల నుంచి రూ. 35 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. సోయాబీన్ పంటకు సంబంధించి ప్రయోగాల నివేదికలు రానందున ఇంకా ప్రతిపాదనలు తయారు చేయలేదు. వ్యవసాయశాఖ ప్రతిపాదనలపై ఎస్‌ఎల్‌టీసీ చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. -
దెబ్బతీసిన ‘ఉపాధి’
యాచారం, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతుండడంతో వరికోతలకు కూలీల కొరత సమస్య తీవ్రంగా పరిణమించింది. తీరా చేతికి అందవచ్చిన పంటలు నేలపాలయ్యాయి. పనులు నిలిపివేయాలని ఎంత వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఇటీవల వడగళ్ల వర్షాలతో రైతులు పంటలు నష్టపోయారు. దీనికి పూర్తి బాధ్యత అధికారులే వహించాల్సి ఉంటుందని రైతులు స్పష్టం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వరిపంట కోత వచ్చింది. కూలీలు ఉపాధి హామీ పనులకు వెళుతుండడంతో వరికోతలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఆయా గ్రామాల రైతులు కోతలు ముగిసే వరకు ఉపాధి పనులు నిలిపేయాలని అధికారులను కోరినా ఫలితం శూన్యంగానే మారింది. కొన్ని గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పంట కోయకుండా ఉంచడంతో ఎండకు వాలిపోయింది. ఆర్థికంగా ఉన్న రైతులు యంత్రాల ద్వారా కోయించారు. పేద రైతులు యంత్రాల ఖర్చు భరించలేక సకాలంలో కోతలు కోయలేదు. వరికోతలు ఆలస్యం కావడంతో వడగళ్లతో పంట నష్టపోవాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి వడగళ్లతో మండలంలోని చింతుల్ల, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, మల్కీజ్‌గూడ, గునుగల్, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. నిజానికి కూలీల సమస్య లేకుంటే వారం ముందే కోత కోసి ధాన్యాన్ని ఇంటికి చేర్చుకునేవారు రైతులు. అధికారులు ఉపాధి పనులు నిలిపేస్తే కూలీల సమస్య వచ్చేది కాదు. వడగళ్ల వర్షం వల్ల పంటలు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చేది కాదు. నెలరోజుల ముందే కోతల ప్రారంభంలోనే నక్కర్తమేడిపల్లి, యాచారం, చింతుల్ల, చింతపట్ల గ్రామాల రైతులు అధికారులకు వినతిపత్రాలిచ్చారు. అయినా అధికారులు ఉపాధి పనులు నిలిపివేయలేదు. కూలీల కొరత కారణంగానే వరికోతల్లో జాప్యం ఏర్పడిందని సోమవారం పలు గ్రామాల రైతులు ఆవేదన చెందారు. జరిగిన నష్టానికి అధికారులే బాధ్యత వహించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మూడెకరాల పంట నష్టపోయా వడగళ్లతో మూడెకరాల వరి పంట నష్టపోయాను. కొద్ది రోజుల్లో పంట కోతకు వచ్చే అవకాశం ఉండగా వడగళ్లు నష్టపరిచాయి. అయినా పంటను కోద్దామంటే కూలీల సమస్య తీవ్రంగా మారింది. అధికారులు రైతులపై కక్షగట్టి దెబ్బతీశారు. - హరికిషన్‌రెడ్డి, రైతు, మొగుళ్లవంపు పొలం కౌలు ఎలా తీర్చాలి? గ్రామానికి చెందిన ఓ భూస్వామి వద్ద మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాను. కూలీల సమస్యతో కోతకు వచ్చిన వరిని కోయలేదు. వడగళ్లతో రూ. లక్ష విలువైన పంట పూర్తిగా నష్టపోయా. కౌలు ఎలా చెల్లించేది. అధికారులే ఆదుకోవాలి. - బేత ముత్యాలు, రైతు, నక్కర్తమేడిపల్లి -
మొన్న పై-లీన్.. నేడు హెలెన్రైతుల హడల్
=జిల్లాపై వాయుగుండం ప్రభావం.. పలు ప్రాంతాల్లో వర్షం =వరి కోత సమయం కావడంతో అన్నదాతల్లో ఆందోళన =దోమకాటు విజృంభించే అవకాశం =మిర్చికి మచ్చ తెగులు.. వ్యవసాయ శాస్త్రవేత్తల హెచ్చరిక వరంగల్, న్యూస్‌లైన్: రైతులకు మరోసారి కష్టాలు మొదల య్యాయి. ఇప్పటికే పై-లీన్ ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులు... మరోసారి నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం, హెలెన్ ప్రభావంతో శనివారం జిల్లాలోని పలు ప్రాం తాల్లో వర్షం కురిసింది. వరి కోతకు వచ్చిన సమయంలో వర్షం కురవడంతో అన్నదా తలు లబోదిబోమంటున్నారు. పై-లీన్ ధాటికి ఇదివరకే లక్షల ఎకరాల మేర వరికి దోమకాటు సోకింది. ఇప్పుడు మళ్లీ వర్షం కురువడంతో రోగాలు మరింత ప్రబలే అవకాశముండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మధ్యాహ్నం నుంచి చిరు జల్లులతో మొదలైన వాన సాయంత్రం వరకు ఓ మోస్తారుగా కురిసింది. వరంగల్, నర్సంపేట, ములుగు, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, జనగామ, పరకాల ప్రాంతాల్లో వర్షం కురిసింది. రఘునాథపల్లిలో ఓ మోస్తారుగా వాన కురువడంతో వరి వంగింది. రాత్రి వరకు కూడా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. దీంతో మిర్చి, వరి పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లుతోంది. మిరప తోటలకు ఇప్పుడిప్పుడే కాయలు పడుతుండగా... కురుస్తున్న వర్షంతో కాయలపై మచ్చలు ఏర్పడి దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రైతులు వెంటవెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.