సాక్షి, హైదరాబాద్: వరి పంటకు ఎకరాకు రూ. 32 వేల నుంచి 34 వేల మధ్య బ్యాంకులు రుణం ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కోరింది. ఈ మేరకు వచ్చే వ్యవసాయ సీజన్‌కు సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ కొలబద్ధ) నిర్ణయించాలని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి ప్రతిపాదనలు పంపింది. 2018–19 వర్షాకాల సీజన్‌కు సంబంధించి బ్యాంకులు ఇవ్వాల్సిన ఏకీకృత రుణ పరిమితి పెంపుపై పంటల సాగు ఖర్చుల ఆధారంగా నివేదించింది. ఎకరా సాగు ఖర్చుల ఆధారంగా లెక్కలు తీసిన అధికారులు అంత మొత్తానికి 10 నుంచి 20 శాతం అధికంగా రుణం ఇవ్వాలని పేర్కొన్నారు. 2017–18 సాగు ఖర్చుల ప్రకారం ఎకరా వరికి రూ. 28,066 వ్యయం అవుతోంది.
ఇందుకు అనుగుణంగా రానున్న సీజన్‌లకు వరికి ఎకరాకు రూ. 32 వేల నుంచి రూ. 34 వేల మధ్య రుణం ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 29 వేల నుంచి రూ. 31 వేల మధ్య ఉంది. సాగునీటి వనరులు లేని ప్రాంతాల్లో మొక్కజొన్న పంటకు రూ. 18 వేల నుంచి రూ. 20 వేల మధ్య రుణ పరిమితి నిర్ణయించాలని కోరింది. ప్రస్తుతం ఇది రూ. 16 వేల నుంచి రూ. 18 వేల మధ్య ఉంది. యాసంగిలో మొక్కజొన్న అధికంగా సాగు చేస్తారని, ప్రస్తుతం వచ్చిన నూతన వంగడాలతో దిగుబడి కూడా పెరిగిందని, రుణం కూడా అధికంగా ఇస్తే రైతులు ఎక్కువగా సాగు చేస్తారని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆహార ధాన్యాలు, ఉద్యాన, నూనె గింజలు తదితర మొత్తం 81 పంటలకు ఎస్‌ఎల్‌టీసీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయనుంది.
వాటికి రుణం పెంచాల్సిందే...
పప్పు ధాన్యాల పంటల సాగు ఏటా పడిపోతోందని వ్యవసాయశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుల్లో పంట రుణం తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. పప్పు దినుసుల పంటలకు రుణ పరిమితి పెంచితే సాగు కూడా పెరుగుతుందని భావిస్తోంది. కందులకు రూ. 15 వేల నుంచి రూ. 18 వేల మధ్య రుణం ఇవ్వాలని నివేదించింది. పెసర, మినుములు ఇతరత్రా పంటలకు రూ. 12 వేల నుంచి రూ. 16 వేల మధ్య ఉండాలని ప్రతిపాదించింది. సాగునీటి వనరులున్న చోట పత్తికి రూ. 34 వేల నుంచి రూ. 35 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. సోయాబీన్ పంటకు సంబంధించి ప్రయోగాల నివేదికలు రానందున ఇంకా ప్రతిపాదనలు తయారు చేయలేదు. వ్యవసాయశాఖ ప్రతిపాదనలపై ఎస్‌ఎల్‌టీసీ చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.
వరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ. 34 వేలు
Published Wed, Jan 24 2018 4:05 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment