రైతులకు మూడో విడత రుణమాఫీ అంటూ ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి దిగింది. రెండో విడత రుణమాఫీ నగదు జమగాక నేటికీ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం మూడో విడత అంటూ గొప్పలు చెబుతోంది. బ్యాంకుల్లో నగదు జమచేయకుండా రైతులకు రుణ ఉపశమన పత్రాలు పంపిణీచేసి మభ్యపెడుతోంది. నగదు కోసం ఆశగా బ్యాంకులకు వెళ్తున్న రైతులు నిరాశతో ఇంటిదారి పడుతున్నారు.
సాక్షి, మచిలీపట్నం: రైతు రుణ మాఫీకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా రూ.1507 కోట్ల మేర నిధులు అవసరం. అయితే ప్రభుత్వం రెండు విడతలుగా రూ.809 కోట్ల మేర మాఫీ చేసింది. ఇందులో తొలి దశగా రూ.50 వేల లోపు రుణం ఉన్న రైతులకు ఏకకాలంలో మాఫీ చేసింది. ఇలా మొదటి విడతలో రూ.577 కోట్లు, రెండో విడతలో రూ.50 వేల కంటే పైగా రుణం ఉన్న వారికి దశల వారిగా అమలు చేస్తున్నారు. రెండో విడతలో 2,96,324 మంది రైతులకు రూ.232 కోట్లు విడుదలైంది. ఇంకా రూ.697 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. అయితే మూడో విడత మాఫీకి రూ.232 కోట్లు మాత్రమే కేటాయించింది. వాస్తవంగా మూడో విడత రుణమాఫీ గత నెల ప్రారంభంలోనే జరగాల్సి ఉన్నా నిధుల సర్దుబాటు నేపథ్యంలో ఆలస్యమైందని పాలకులు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సంబంధించి రైతు సాధికార సంస్థ నుంచి ఆమోదం లభించాలి. అనంతరం ఆ నిధులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. అక్కడి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతుంది. నిధులు జమ కాకుండానే రైతులకు రుణ ఉపశమన పత్రాలు పంపిణీచేస్తున్నారు. మూడు విడతలు కాకుండా, మరో రెండు విడతల్లో రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో రైతులకు ఎదరుచూపులు తప్పడంలేదు.
ఇప్పుడు ఇస్తేనే...
పంపిణీచేసిన రుణ ఉపశమన పత్రాలను రైతులు బ్యాంకులకు తీసుకెళ్లి ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాటికి రైతు సాధికార సంస్థ అనుమతులు తప్పనిసరి అన్న నిబంధనలు విధించారు. ఈ తతంగా పూర్తయ్యే సరికి రెండు నెలల సమయం పడుతోంది. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పంటలను చీడపీడలు ఆశిస్తున్నాయి. ఇప్పుడు మాఫీ సొమ్ము అందితే రైతులకు పెట్టుబడులకు ఇబ్బందులు ఉండవు. గత నెలలోనే రుణమాఫీ చేపడతామని ప్రచారం చేసినా రైతులకు ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఆర్భాటం చేయడం తప్ప ఇప్పట్లో సొమ్ము అందే సూచనలు కనిపించడం లేదని రైతులు పేర్కొంటున్నారు. మరో వైపు బ్యాంకర్లు, వ్యవసాయాధికారుల మధ్య సమన్వయ లోపం కరువడంతో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. రుణ ఉపశమన పత్రాలను వ్యవసాయాధికారులకు ఇవ్వాలా? బ్యాంకర్లకు ఇవ్వాలా అన్న సందిగ్ధం రైతుల్లో నెలకొంది. ఉపశమన పత్రాలను గడువులోగా సమర్పించకపోతే ఉపయోగం ఉండదు. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించే నాథుడే కరువయ్యాడు.
రెండో విడత పరిస్థితేంటి?
జిల్లాలో రెండో విడతలో రుణమాఫీకి అర్హులైన రైతులు ఉపశమన పత్రాలతో నగదు కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 30 శాతం మందికిపైగా రైతులకు రెండో విడతలో రుణమాఫీ కాలేదని సమాచారం. వారందరూ నగదు కోసం అధికారులు, బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన మూడో విడత రుణమాఫీ సొమ్ము కోసం రుణ అర్హత పత్రాలను తీసుకెళ్తుంటే తమ పరిస్థితి ఏమిటని రెండో విడత రుణం మాఫీ కావాల్సిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
జమయ్యేది రెండు నెలల తరువాతే..
తొలుత రైతులు రుణ ఉపశమన పత్రాలను బ్యాంకులకు తీసుకెళ్లి ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత రైతు సాధికార సంస్థ నుంచి అనుమతి వస్తుంది. ఈ అనుమతి వచ్చిన రెండు రోజుల తర్వాత రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. అయితే ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో తమకు నగదు ఎప్పుడు అందుతుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు.
పత్రం.. ఏమాత్రం?
Published Wed, Oct 18 2017 11:29 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment