టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశీవాళీ క్రికెట్‌లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన కిషన్.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో జార్ఖండ్‌కు సారథ్యం వహిస్తున్న కిషన్.. సోమవారం మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.
255 పరుగుల లక్ష్య చేధనలో కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ది బౌలర్లను ఈ జార్ఖండ్ డైనమెట్ ఊచకోత కోశాడు. కేవలం 78 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా జార్ఖండ్ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్ల మాత్రమే కోల్పోయి 28.3 ఓవర్లలో చేధించింది. కిషన్‌తో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(68) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. మణిపూర్ బ్యాటర్లలో ప్రియోజిత్ సింగ్(43), జాన్సెన్ సింగ్(69) పరుగులతో రాణించారు. జార్ఖండ్ బౌలర్లలో అనుకుల్ రాయ్, ఉత్కర్ష్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వికాస్ సింగ్,సుప్రీయో చక్రవర్తి తలా వికెట్ సాధించారు.
కాగా ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు బీసీసీఐ అతడిపై వేటు వేసింది. ఇప్పుడు దేశీవాళీ క్రికెట్‌లో రాణిస్తూ రీఎంట్రీ దిశగా ఇషాన్ అడుగులు వేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment