సాక్షి, హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో జమ్మూ కశ్మీర్ జట్టు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గ్రూప్ ‘డి’లో భాగంగా జింఖానా మైదానంలో పటిష్ట సౌరాష్ట్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. చతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, రాబిన్ ఉతప్ప, జైదేవ్ ఉనాద్కట్‌లతో కూడిన సీనియర్ల బృందం జమ్మూ కశ్మీర్ యువ ఆటగాళ్లకు పోటీనివ్వలేకపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు సాధించింది. ఉతప్ప (20), పుజారా (27), ఉనాద్కట్ (12) విఫలమయ్యారు. దీంతో 131 పరుగులకే 5 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అర్పిత్ వసవాదా (73 బంతుల్లో 85; 1 ఫోర్, 6 సిక్స్‌లు), పరేఖ్ మన్కడ్ (48 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో ప్రత్యర్థికి ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో వసీం రజా 2 వికెట్లు తీశాడు. మంజూర్ దార్, మొహమ్మద్ ముదసిర్, రామ్ దయాల్, ఉమర్ నజీర్ తలా వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో జమ్మూ కశ్మీర్ జట్టు 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. అహ్మద్ ఒమర్ బందీ (66 బంతుల్లో 65; 11 ఫోర్లు, 1 సిక్స్), పర్వేజ్ రసూల్ (80 బంతుల్లో 66 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభమ్ సింగ్ పుందిర్ (47 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. జతిన్ వాధ్వాన్ (30), బందీప్ సింగ్ (30) రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లలో కేఆర్ మక్వానా 3 వికెట్లు తీశాడు.
ఇషాన్ కిషన్ సెంచరీ...
సికింద్రాబాద్‌లోని ఏఓసీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టు 5 వికెట్లతో సర్వీసెస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ జట్టు టాపార్డర్ విఫలమవడంతో 50 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసింది. జార్ఖండ్ బౌలర్లు వరుణ్ ఆరోన్ (3/20), అనుకూల్ రాయ్ (2/26) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి సర్వీసెస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో హార్దిక్ సేథీ (78 బంతుల్లో 66; 4 ర్లు, 1 సిక్స్), దివేశ్ పఠానియా (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో జట్టు ఓ మోస్తరు స్కోరు సాధించింది. అనంతరం ఇషాన్ కిషన్ (75 బంతుల్లో 106; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడైన సెంచరీతో జట్టుకు ఈ టోర్నీలో తొలివిజయాన్ని అందించాడు. ఇషాన్‌తో పాటు సౌరభ్ తివారి (67 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో జార్ఖండ్ 30.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సర్వీసెస్ బౌలర్లలో వికాస్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment