అప్పు అట్లనే ఉంది! | Farmers Debt problems | Sakshi
Sakshi News home page

అప్పు అట్లనే ఉంది!

Published Tue, Jun 27 2017 2:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

అప్పు అట్లనే ఉంది! - Sakshi

అప్పు అట్లనే ఉంది!

♦ తడిసి మోపెడైనరుణాల భారం
♦ మూడేళ్ల కిందట రూ.17 వేల కోట్లు
♦ ఐదు విడతల్లో మాఫీ చేసిన ప్రభుత్వం
♦ ఇప్పుడు మళ్లీ బ్యాంకుల్లో రైతుల పేరిట రూ.34,136 కోట్ల రుణాలు
♦ వడ్డీలు, అపరాధ రుసుంతో రైతుల నడ్డి విరిచిన బ్యాంకులు

తడిసి మోపెడైన రుణాల భారం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ల్లో రైతుల పేరిట ఉన్న లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేసింది.. 2014 నుంచి విడతలవారీగా రూ.17 వేల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు చెల్లించింది.. మరి రైతులు నిజంగానే ఊపిరి పీల్చుకున్నారా..? అప్పుల ఊబి నుంచి బయటపడ్డారా..? ఇవే ప్రశ్నలడిగితే.. ‘‘అదేమీ లేదు. మూడేళ్ల కిందట బ్యాంకు ఖాతాల్లో ఉన్న అప్పు తీరింది. కానీ.. ఇప్పుడు నా ఖాతాలో మళ్లీ అంతకంటే ఎక్కువే అప్పుంది..’’అని రాష్ట్రవ్యాప్తంగా రైతులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట రుణాలు మాఫీ చేసినా.. ఏ ఏటికాయేడు అన్నదాతల అప్పులు రెట్టింపయ్యాయి. పెట్టుబడి ఖర్చులకు రైతులు తీసుకున్న అప్పుల భారం అంతకంతకు తడిసి మోపెడైంది. ఈ భారం మూడేళ్లలో ఏకంగా రూ.34 వేల కోట్లు దాటింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం కాక ముందే రైతుల ఖాతాల్లో సగటున రూ.70 వేల చొప్పున అప్పులు పేరుకున్నట్లు బ్యాంకర్లు వెల్లడించారు. అంటే ప్రభుత్వం చేసిన రుణమాఫీ తాత్కాలిక ఉపశమనంగానే మిగిలిపోయిందని అర్థమవు తోంది. మూడేళ్లలోనే మళ్లీ రైతులు మోయ లేనంత అప్పుల ఊబిలో కూరుకుపోవటం ఆందోళన రేకెత్తిస్తోంది.
 

బ్యాంకుల మాయాజాలం..
ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేస్తే నిజంగానే రైతులు లాభపడ్డారా.. బ్యాంకులు బాగుపడ్డాయా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పుల్లో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు 2014లో రాష్ట్ర ప్రభుత్వం అప్పటివరకు బ్యాంకులు లెక్కతేల్చిన రూ.17 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది. దాదాపు 35 లక్షల మంది రైతులు పంట రుణాల నుంచి విముక్తులైనట్లు ప్రకటించింది. భారీ మొత్తం కావటంతో ఒకేసారి చెల్లించటం అసాధ్యమని, నాలుగేళ్లలో అయిదు విడతల్లో బ్యాంకులకు చెల్లించింది. ఈ నిర్ణయమే రైతులను గందరగోళానికి గురి చేసింది. బ్యాంకులకు పంట పండించింది. అసలు ప్రభుత్వమెంత మాఫీ చేసింది.. తమకెంత అప్పు మాఫీ అయిందని రైతులు కూడా పక్కాగా లెక్క చెప్పలేనంతగా బ్యాంకులు మాయాజాలం చేశాయి. దీంతో ఇప్పటికీ చాలా మంది రైతుల అప్పులు తీరలేదు.

వడ్డీ లేకున్నా జబర్దస్త్‌గా వసూల్‌..
నిజానికి పంట రుణాలపై వడ్డీ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వడ్డీని బ్యాంకులకు రీయింబర్స్‌ చేస్తున్నాయి. గడిచిన మూడేళ్లకు సంబంధించిన వడ్డీ చెల్లింపుల్లో భాగంగానే రెండ్రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు లకు రూ.271 కోట్లు విడుదల చేసింది. కానీ ఈలోగానే బ్యాంకులు రైతులపై ప్రతాపం చూపించాయి. బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌.. పాత అప్పులో కొంచెం రికవరీ.. మళ్లీ కొత్త అప్పు.. ఖాతాల్లో ఇలా రకరకాల రాతలతో రైతులకు పంగనామాలు పెట్టాయి. ముక్కుపిండి వడ్డీలు వసూలు చేసిన ఉదంతానలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంలో కేవలం 5 శాతం మందికే మొత్తం రుణం మాఫీ అయిందని, మిగతా 95 శాతం మంది రైతుల నుంచి వడ్డీ, అపరాధ రుసుం.. ఏదో ఒక పేరుతో బ్యాంకులు అడ్డగోలు చార్జీల పేరుతో రూ.వందల కోట్ల వ్యాపారం చేసినట్లు ఫిర్యాదులున్నాయి. ఇçప్పటికీ రాష్ట్రంలో 49 లక్ష ల మంది రైతుల పేరిట రూ.34,136 కోట్ల పం ట రుణాలు బ్యాంకుల్లో పేరుకుపోయాయి.

రైతుల పేరిట  బ్యాంకుల్లో ఉన్న రుణాలు
సంవత్సరం    రైతులు    రుణాలు
                                 (రూ.కోట్లలో)
2014    35,82,065    17,000
2017    49,87,231    34,136

లక్షకు లక్ష అట్లనే ఉంది..: మిట్టకోడూరు బాబయ్య, రైతు, పరిగి, వికారాబాద్‌ జిల్లా
రుణ మాఫీతో నాకున్న అప్పు తీరిపోతుందనుకున్నా. పరిగి ఏడీబీ (అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌–ఎస్‌బీఐ) బ్యాంకులో 2014లో నా పేరు మీద లక్ష రూపాయల పంట రుణముండే. ప్రభుత్వం తొలి విడత రూ.25 వేలు జమ చేసింది. అవన్నీ వడ్డీకే సరిపోతాయని, మరో రూ. 650 చెల్లిస్తే వడ్డీ పూర్తవుతుందని బ్యాంకు వాళ్లు చెపితే.. అవి కూడా నేనే కట్టిన. రెండో ఏడాది రూ.25 వేలు వస్తే అందులో రూ.17,500 కోతపెట్టి నాకు రూ.7,500 ఇచ్చారు. మూడో ఏడాది రెండుసార్లు కలిపి ప్రభుత్వం రూ.25 వేలు జమ చేసింది. అందులో రూ.9,500 తీసుకున్నా. ఇప్పటికీ రూ.లక్ష అప్పు అట్లనే ఉంది. ఆఖరి విడత వచ్చే వారం జమ అవుతుందని చెపుతున్నారు. నాలుగేళ్లల్లో నేను తీసుకున్నది రూ.17,000. నా పేరిట రూ.లక్ష అప్పు అట్లనే ఉంది. నా ఒక్కడిదే కాదు.. ఈ బ్యాంకుల్ల అప్పు తీసుకున్నోళ్లందరిదీ.   
 

ఇంకో రూ.11 వేలు వడ్డింపు
ఎస్‌బీహెచ్‌లో 2013లో రూ.1.03 లక్షల రుణం తీసుకున్నా. రుణమాఫీ పథకంలో భాగంగా రూ.లక్ష మాఫీ కావడంతో రూ.3 వేలు బకాయి ఉంటుందని అనుకున్న. ప్రభుత్వం అయిదు కిస్తుల్లో రుణమాఫీ నిధులు జమ చేసింది. పెట్టుబడులకు 2014లో రూ.21 వేలు, 2015లో రూ.13 వేలు, 2016లో రూ.30,600 చొప్పున రుణం తీసుకున్నా. బ్యాంకులో మొత్తం రూ.67,600 బకాయి ఉండాలి. కానీ ఇప్పటికీ రూ.78,212 బాకీ ఉన్నట్లు ఖాతాలో ఉంది.    – గోస్కుల నాంపల్లి, రైతు,  చిన్న బోనాల, రాజన్న సిరిసిల్ల జిల్లా

మొత్తం మాఫీ అయింది
నేను నేరెళ్ల సహకార సొసైటీలో 2013లో రూ.75 వేలు లోన్‌ తీసుకున్నా. ప్రభుత్వం రుణమాఫీ చేసింది. గడిచిన నాలుగేళ్లలో మళ్లీ రుణం తీసుకోలేదు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో నా రుణం మొత్తం మాఫీ అయిందని బ్యాంకర్లు చెప్పారు. – పి.లక్ష్మి, మహిళా రైతు,
రాజన్న సిరిసిల్ల జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement