బ్యాంకర్లను కోరిన ఆర్థికశాఖ 25లోగా సమాచారమివ్వాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రైతుల వ్యవసాయ రుణాల మాఫీపై తామడిగిన వివరాలను ఈ నెల 25వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోను అందజేయాల్సిందిగా ఆర్థిక శాఖ బ్యాంకర్లను కోరింది. ఈ అంశంపై శనివారం జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. వ్యవసాయ పంట రుణాలతోపాటు బంగారంపై తీసుకున్న పంట రుణాల మాఫీకి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలనటంతో బ్యాంకర్లకు సమస్యలు తలెత్తుతున్నాయి. బ్యాంకర్ల దగరున్న సమాచారం కాకుండా రైతుల నుంచి ఆధార్, రేషన్ కార్డులను కూడా సేకరించి ఆ వివరాలను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అలాగే రైతుల వ్యవసాయ భూమి విస్తీర్ణంతో పాటు సర్వే నెంబర్లనూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొంది.
దీంతో బ్యాంకులు రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తూనే మరోవైపు ఇవన్నీ సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. నిజానికి బ్యాంకులు గత నెల్లోనే 17 అంశాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ప్రభుత్వం మరో 14 అంశాలు చేర్చి 31 అంశాలను పంపాలని కోరింది. అది సిద్ధం చేస్తున్న తరుణంలో ఇపుడు మరో మూడంశాలను చేర్చింది. ఇవన్నీ కలిపి ఈ నెల 25లోగా పంపాలని తాజాగా కోరింది. ఇలా ఎప్పటికప్పుడు అంశాలను పెంచుతూ ప్రభుత్వం గడువులిస్తుండటంతో బ్యాంకులు తలలు పట్టుకుంటున్నాయి. పెపైచ్చు ఈ సమాచారమేమీ వారివద్ద సిద్ధంగా ఉన్నది కాదు. రైతుల నుంచి సేకరించాలి. చిన్న చిన్న బ్రాంచులకు కూడా ఐదారువేల ఖాతాలు ఉండటంతో అవన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయటం వారికి తలకు మించిన భారమవుతోంది. దీంతో బ్యాంకులకు వివరాలిచ్చేందుకు రైతులను ప్రోత్సహించి, వారితో బ్యాంకులకు ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ ప్రతులను ఇప్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి లేఖలు కూడా రాశారు.
మాఫీ కోసం రైతుల వివరాలివ్వండి
Published Sun, Sep 21 2014 2:00 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement