ఇచ్చింది నాలుగు వేల కోట్లే!
ఖరీఫ్‌లో రూ.14 వేల కోట్ల రుణాలివ్వాల్సి ఉన్నా మొండికేస్తున్న బ్యాంకులు
పాత బకాయిలన్నీ చెల్లిస్తేనే రుణాలంటూ ఆంక్షలు
కనీసం రూ.9 వేల కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లను కోరిన ప్రభుత్వం
ఆ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు ఆదేశం
హైదరాబాద్: తెలంగాణలో రైతులకు రుణాలు అందడం కష్టమైపోతోంది. రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా అప్పు పుట్టడం లేదు. పాత బకాయిలు మొత్తం చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామంటూ బ్యాంకర్లు మొండికేస్తున్నారు. పై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే కొత్త రుణాలిస్తామంటూ బ్యాంకు మేనేజర్లు తెగేసి చెబుతున్నారు. పలు జిల్లాల్లో బ్యాంకుల్లో రుణ వితరణ ఇంకా ప్రారంభమే కాలేదు. ఖరీఫ్ సీజన్‌లో దాదాపు రూ.14 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించారు. అందులో ఇప్పటిదాకా రూ.4 కోట్ల రుణాలు రైతులకు ఇచ్చినట్లు బ్యాంకర్లు ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీంతో కనీసం రూ.9 వేల కోట్ల రుణాలైనా ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకర్లకు విజ్ఞప్తి చేసింది. ఈనెల 15లోపు రైతులకు రుణాలు అందేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ప్రతిరోజు బ్యాంకర్లతో సమావేశం కావాలని, రోజువారీగా రుణ వివరాలను అందించాలని ప్రభుత్వం కలెక్టర్లకు మార్గనిర్దేశనం చేసింది. కాగా రుణమాఫీ కింద ప్రభుత్వం విడుదల చేసిన రూ.4,250 కోట్లు బ్యాంకులకు చేరినప్పటికీ.. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయలేదు. ఈ రూ.4,250 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించిన తర్వాత.. ఆ మేరకు మాత్రమే రైతులకు కొత్త రుణాలు ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. రుణ వితరణకు సంబంధించి ప్రభుత్వం ఒత్తిడి తెస్తే మొత్తం ఆరేడు వేల కోట్ల రూపాయల మేరకు రుణాలిచ్చి చేతులు దులుపుకొనే యత్నంలో బ్యాంకర్లు ఉన్నట్లు సమాచారం.
రైతుల నుంచి హామీ పత్రం: రుణమాఫీకి అనర్హుడిగా తేలితే ప్రభుత్వం నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని రైతులు హామీపత్రం రాసివ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు రూపొందించిన హామీపత్రం నమూనాలను ప్రభుత్వం జిల్లాలకు పంపిణీ చేసింది. రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం తరఫున తహశీల్దార్ సంతకం చేసిన హామీపత్రం ఇస్తూనే.. రైతుల నుంచి పైన పేర్కొన్న విధంగా పత్రాలు తీసుకోనుంది. ఈ పత్రాలకు సంబంధించిన ఫైలుకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వాటిని జిల్లాల కలెక్టర్లకు పంపిణీ చేస్తున్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా రైతులకు అందించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.