సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్మును చెక్కుల ద్వారానే పంపిణీ చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ రైతులు చెక్కుల ద్వారానే తమకు సొమ్ము చెల్లించాలని వ్యవసాయ శాఖ సర్వేలో చెప్పడంతో ఉపసంఘం కూడా అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంది. మొదట్నుంచీ నిపుణులు, ఉన్నతాధికారులు, కొందరు మంత్రులు కూడా చెక్కుల ద్వారానే పంపిణీకే మొగ్గు చూపారు. వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కార్యాలయం నిర్వహించిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఉపసంఘంలోని మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో నేరుగా రైతుల వద్దకే వెళ్లి వారి మనోగతం తెలుసుకోవాలని నిర్ణయించారు.
వ్యవసాయ శాఖ కూడా ఆగమేఘాలపై ఒకే ఒక్క రోజులో సర్వే చేపట్టి మెజారిటీ అభిప్రాయాన్ని నివేదించడంతో.. చివరకు చెక్కులు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రైతులందరికీ వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మే 15 నాటికి ఎకరానికి రూ.4 వేల చొప్పున అందనుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 71.75 లక్షల రైతు ఖాతాలకు చెందిన 1.42 కోట్ల ఎకరాలకు నగదు సొమ్ము అందనుంది. పెట్టుబడి సొమ్మును ఎలా అమలు చేయాలన్న దానిపై వ్యవసాయశాఖ మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో జిల్లాల నుంచి వ్యవసాయాధికారులను హైదరాబాద్ పిలిపించి అమలు ఎలా ఉండాలన్న అంశంపై చర్చించనుంది. వారి అభిప్రాయాల ప్రకారం మార్గదర్శకాలు ఖరారు చేస్తామని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. మార్గదర్శకాలు ఖరీఫ్ సీజన్‌లో అమలుకు సంబంధించే ఉంటాయి. రబీ సీజన్‌లో ఎలా అమలు చేయాలనే దానిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోబోమని అధికారులు చెబుతున్నారు.
సాగు చేస్తేనే సొమ్ము!
రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాల భూమి సాగు యోగ్యమైనదిగా రెవెన్యూ శాఖ తేల్చింది. అయితే అనేకచోట్ల రైతులు భూమి సాగు చేయడం లేదని అంటున్నారు. కొన్నిచోట్ల కొండలు, గుట్టలతో భూమి ఉంది. చెరువుల్లోనూ పట్టా భూమి కలిగిన వారున్నారు. ఇలా సాగుకు యోగ్యంకాని భూములకు కూడా పెట్టుబడి రాయితీ ఇవ్వడం వల్ల ఇతర రైతుల్లో వ్యతిరేకత వస్తుందని కొందరు మంత్రులు ఉపసంఘం సమావేశంలో అభిప్రాయపడ్డారు. అందుకు సంబంధించి మార్గదర్శకాలు పకడ్బందీగా తయారు చేయాలని ఆదేశించారు. భూమిని సాగు చేస్తున్నట్లు రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని కూడా కొందరు సూచించారు. అయితే వచ్చే ఖరీఫ్ ప్రారంభానికి ముందే అంటే మే 15 నాటికి పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి ఉండటంతో ఎవరు సాగు చేస్తారో చేయరో అంచనాకు రాలేమని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్‌కు అందరికీ ఇచ్చి ఆ తర్వాత రబీ సీజన్ నుంచి కట్టుదిట్టం చేయాలని కొందరు సూచించారు. డిక్లరేషన్ తీసుకుంటున్నందున సాగుచేసే వారే పెట్టుబడి సొమ్ము తీసుకుంటారని అంటున్నారు.
పెద్దలను స్వచ్ఛందంగా తప్పించాలి
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులు, ధనవంతులందరికీ పెట్టుబడి పథకాన్ని వర్తింప చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న చర్చ మంత్రివర్గ ఉపసంఘంలో జరిగింది. ఎక్కువ భూమి ఉన్న వారిని గుర్తించి ఎంతో కొంత సీలింగ్ పెట్టి పెట్టుబడి సొమ్ము ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ సీలింగ్ పెడితే ఇబ్బందులు వస్తాయని, రాజకీయాలు చొరబడి అర్హులైన రైతులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని మరికొందరు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని ధనవంతులు స్వచ్ఛందంగా వదులుకునేలా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. అలాగే రాష్ట్రంలోనూ పెట్టుబడి రాయితీని వదులుకునేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీలకు చెందిన ధనవంతులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ తదితరులను ప్రోత్సహించి ‘నాకు పెట్టుబడి రాయితీ వద్దు’అని వారితో ప్రకటన చేయిస్తారు. అంతే తప్ప ఒత్తిడి చేసి రాయితీ నుంచి తప్పించకూడదని నిర్ణయించారు.
అప్పులేని బ్యాంకులో డిపాజిట్‌కు అవకాశం
చెక్కులిస్తే వాటిని బ్యాంకులు తమ అప్పుల కింద జమ చేసుకుంటాయన్న భయం రైతులకు ఉంది. రుణమాఫీ వడ్డీల విషయంలో బ్యాంకులు రైతులతో ఇలాగే వ్యవహరించాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి తలెత్తకుండా చెక్కులు ఏ బ్యాంకులోనైనా చెల్లుబాటయ్యేలా ఏర్పాటు చేస్తారు. చాలామంది రైతులకు రెండు మూడు బ్యాంకుల్లో ఖాతాలున్నాయని అంచనా. ఒకవేళ ఒకే ఖాతా ఉండి, అందు లో బ్యాంకు రుణం చెల్లించని పరిస్థితి ఉంటే మరో బ్యాంకు ఖాతా తీసుకోవచ్చు. ఆ విధంగా చెక్కు మార్చుకోవచ్చు. నేరుగా చెక్కులిచ్చి నగదు తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఇదేకాకుండా పోస్టాఫీసుల్లోనూ బ్యాంకు చెక్కులు క్లియర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఈ మేరకు సహకారం అందిస్తామని పోస్టల్ శాఖ వర్గాలు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. ఈ చెక్కులను గ్రామసభలు పెట్టి రైతులకు పంపిణీ చేస్తారు. గ్రామాల్లో ఒకే పేరు, ఇంటిపేరున్న వారు ఉండే అవకాశం ఉన్నందున అకౌంట్ చెక్కులు జారీ చేయడంతోపాటు వాటిపై సంబంధిత రైతుల ఆధార్ నంబర్ రాయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment