పరిహారం పరిహాసం | Compensation ridicule | Sakshi
Sakshi News home page

పరిహారం పరిహాసం

Published Tue, Dec 24 2013 1:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పరిహారం పరిహాసం - Sakshi

పరిహారం పరిహాసం

=వ్యవసాయ రుణాలకూ ఇబ్బందులే
 =ప్రభుత్వ విధానాలతో రైతులకు చేటు
 =జిల్లాలో 4.56 లక్షల మంది రైతులు
 =25 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవు
 =ఏజెన్సీలో బ్రాంచ్‌ల ఏర్పాటుకు బ్యాంకుల విముఖత

 
అన్ని విధాలా అన్యాయమైపోయేది అన్నదాతేనని ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.  ప్రభుత్వం కరుణించక, ప్రకృతి కనికరించక అవస్థలు పడే కర్షకుడికి చివరికి పరిహారం విషయంలోనూ పరిహాసమే ఎదురవుతోంది. పంటలకు పెట్టుబడి లేక, రుణాలు ఇచ్చే బ్యాంకులు కానరాక.. దేవుడే దిక్కనుకునే రైతు అప్పులు చేసి పంటలు వేస్తే.. అతివృష్టో, అనావృష్టో సంభవించి మొత్తం పంట మట్టిపాలవుతోంది. ఇంత కష్టంలోనూ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే పరిస్థితి ఎండమావిలా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్యాంకుల నిర్లిప్తతతో వ్యవసాయదారు పరిస్థితి దయనీయంగా ఉంది.
 
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో మొత్తం 4,56,445 మంది రైతులు ఉన్నారు. ఇందులో సుమారుగా 60 వేల మంది కౌలు రైతులు ఉంటారు. వీరిలో దాదాపుగా 90 వేల మంది వరకు ఏజెన్సీలో పంటలను సాగు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకు సేవలు లేకపోవడంతో గిరిజన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. బ్యాంకులను ఏర్పాటు చేయాలని రైతులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా అందుకూ ఆస్కారం లేకుండా పోతోంది. బ్యాంకు సేవలు లేకపోవడంతో గిరిజన రైతులకు బ్యాంకు రుణాలు అందే అవకాశం లేకుండా పోతోంది.
 
సాయానికి ఎగనామం : బ్యాంకుల నుంచి తోడ్పాటు లేకపోవడంతో అధిక శాతం రైతులు పంటల పెట్టుబడికి  ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారు. అప్పులు చేసి పంటలు వేసుకున్నా, మూడేళ్లుగా వరదలు, కరువు కారణంగా పంట నష్టం అపారంగా ఉంటోంది. ఏడాది క్రితం నవంబర్‌లో వచ్చిన నీలం తుఫాన్ వల్ల జిల్లాలో 80,915 ఎకరాల పంటలు నీట మునిగాయి. దాంతో జిల్లాలో 1,45,487 మంది రైతులు నష్టపోయారు. పెట్టుబడి రాయితీగా రూ. 30.24 కోట్లకు ప్రతిపాదనలు అధికారులు ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి స్థాయిలో మంజూరు చేయలేదు.

పరిహారాన్ని చెక్కుల ద్వారా కాక, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే పరిహారాన్ని జమ చేసే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. అయితే బ్యాంకు సేవలు అందుబాటులో లేని ప్రాంతాలు, అక్కడి రైతుల పరిస్థితులను విస్మరించింది. అకౌంట్లు ఉన్న రైతుల కోసం రెండు విడతల్లో రూ.23.41 కోట్లు పెట్టుబడి రాయితీగా విడుదల చేసింది. ఇంకా 39,306 మంది రైతులకు పరిహారం మంజూరు చేయాల్సి ఉంది. ఏజెన్సీలో రైతులకు చెక్కుల ద్వారా పంపిణీ చేసేందుకు అనుమతివ్వాలని జిల్లా అధికారులు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.
 
 ఎప్పుడూ ఇంతే...

 రెండేళ్ల క్రితం కరువు తాండవించినప్పుడూ ఇదే పరిస్థితి ఉండేది. రైతులకు బ్యాంకు అకౌంట్లు లేని కారణంగా మంజూరైన పరిహారం వెనక్కు పోయిం ది. గత నెలలో భారీ వర్షాలకు జిల్లాలో 14,923 హెక్టార్లలో పంట దెబ్బతినగా 59,387 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో 15 శాతం మంది రైతులకు బ్యాంకు ఖాతాలు లేనట్లు తెలుస్తోంది. దీంతో వీరికి ఈసారి కూడా పరిహారం లభించే అవకాశం ఉండదు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యాంకు ఖాతాలు లేని రైతుల విషయంలో కొంత వెసలుబాటు కల్పిస్తే బాగుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement