అప్పుటి తప్పే శాపమై..
అప్పుటి తప్పే శాపమై..
Published Thu, Mar 16 2017 2:04 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓటు వేయడమే ఇప్పుడు తమ పాలిట శాపమైందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో రుణాలు కట్టొద్దని, అధికారంలోకి వస్తే అవన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పైసా రుణమాఫీ కాకపోగా, బ్యాంకులు తమను దొంగలుగా చిత్రీకరించి నోటీసులు జారీచేస్తున్నాయని, రుణ ఎగవేతదారులుగా ప్రకటించి పత్రికల్లో ఫొటోలు వేయిస్తామని బెదిరింపులకు దిగుతున్నాయని కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఏలూరు (మెట్రో) : తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రుణమాఫీ హామీని నమ్మి రుణాలు చెల్లించని రైతులను బ్యాంకులు తీవ్రంగా వేధిస్తున్నాయి. మానసికంగా కుంగదీస్తున్నాయి. నోటీసులు జారీ చేసి దొంగలుగా చిత్రీకరిస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అన్నదాతలకు అండగా నిలవడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు విడతల్లోనూ అన్యాయమే
ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కాక మాట మార్చింది. డ్వాక్రా మహిళలకు రిక్తహస్తం చూపింది. రైతులకూ షరతులతో ఐదు విడతల్లో రుణమాఫీ చేస్తామని 2014 ఆగస్టు 14న 174 జీవోను విడుదల చేసింది. జిల్లాలో ఐదు విడతల్లోనూ అర్హులైన రైతులకు న్యాయం జరగలేదు. జిల్లాలో 5 లక్షల మంది రైతులు ఉండగా.. వారికి రూ.12వందల కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. కౌలు రైతులు 53 వేల మంది ఉండగా వారికి రూ.165 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. ఈ ఐదు విడతల్లోనూ రూ.90కోట్లు మాత్రమే మాఫీ చేసిన ప్రభుత్వం మిగిలిన రుణాలు తీర్చాల్సిందేనంటూ రైతులకు బ్యాంకుల ద్వారా నోటీసులు పంపించే ఏర్పాట్లు చేసింది.
తాజాగా.. 36 మందికి
ఇప్పటికే రుణాలు చెల్లించని ఎందరో డ్వాక్రా మహిళలకు నోటీసులు జారీ చేసిన బ్యాంకులు ఇప్పుడు రైతులపై పడుతున్నాయి. తాజాగా పెదపాడు మండలం బూరాయిగూడేనికి చెందిన 36 మంది కౌలు రైతులకు ఏలూరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఈ 36 మంది రూ.పదివేల చొప్పున మొత్తం రూ.3లక్షల 60వేలు ఏలూరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి అప్పుగా తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆ అప్పు తీరిపోతుందని భావించారు. ఐదు విడతలూ పూర్తయినా తీరకపోవడంతో ఈ రుణాలు తక్షణమే కట్టాలంటూ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే పత్రికల్లో ఫొటోలు వేయించి రుణ ఎగవేత దారులుగా ప్రకటిస్తామని నోటీసుల్లో పేర్కొంది. రుణమాఫీకి బ్యాంకుకు ఎటువంటి సంబంధం లేదంటూ తేల్చిచెప్పింది.
మూడేళ్లుగా పంటలు పండక
నోటీసులు అందుకున్న రైతులకు కృష్ణాడెల్టా పరిధిలో పొలాలు ఉన్నాయి. ఈ డెల్టాలో మూడేళ్లుగా నీరు అందక పంటలు పండడం లేదు. భూములు బీడువారుతున్నాయి. దీంతో రైతులు రుణాలు చెల్లించలేకపోయారు. ఈ సమయంలో తీసుకున్న అప్పు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
సాగు లేదు.. రుణమాఫీ లేదు
మూడేళ్లుగా పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తీసుకున్న రుణం మాఫీ అవుతుందని ఎదురు చూశాం. మూడేళ్లయినా మా నిరీక్షణ ఫలించలేదు.
– డి.సూర్యప్రకాశరావు, నోటీసు అందుకున్న రైతు
పత్రికల్లో ఫొటోలు వేయిస్తారట
ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పినందువల్ల అప్పు చెల్లించలేదు. ఇప్పటికిప్పుడు కట్టాలని బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. లేదంటే పత్రికల్లో ఫొటోలు వేయిస్తామని చెబుతున్నారు. మేమెలా చెల్లించగలం?
– పిట్టా థామస్, నోటీసు అందుకున్న రైతు
మోసం చేసిన ప్రభుత్వాన్ని ఏమనాలి?
రుణం చెల్లించాలి లేకుంటే పత్రికల్లో ఫొటోలు వేయిస్తామని బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారు. రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ప్రభుత్వాన్ని ఏమనాలి. ప్రభుత్వం మోసం చేసినా ప్రజలు ఏమీ చేయలేరా? పంటలు పండకపోయినా రుణాలు ఎలా చెల్లించాలి?
– దాకారపు కేశవరావు, నోటీసు అందుకున్న రైతు
Advertisement
Advertisement