రైతుపైకి రుణపాశం! | A tragedy of farmers | Sakshi
Sakshi News home page

రైతుపైకి రుణపాశం!

Published Mon, Jun 19 2017 1:58 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతుపైకి రుణపాశం! - Sakshi

రైతుపైకి రుణపాశం!

చేతిలో చిల్లిగవ్వలేక దిక్కులు చూస్తున్న అన్నదాతలు
- దుక్కి దున్నించేందుకు నగదు లేక విలవిల.. గత్యంతరం లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న వైనం
నగదు లేదంటూ చేతులెత్తేసిన బ్యాంకులు.. నాలుగో విడత రుణమాఫీ అందలేదంటూ సాకులు
కాలం కలిసొస్తున్నా.. కదలని కాడెడ్లు.. సాగని సాగు
ఈసారి ఇవ్వాల్సిన రుణాలు (అంచనా) రూ. 15,000 కోట్లు
ఇప్పటికి బ్యాంకులిచ్చింది (సుమారుగా) రూ. 1,000 కోట్లు
 
సాక్షి, నెట్‌వర్క్‌: ఈ ఏడాది కూడా వడ్డీ వ్యాపారి వద్ద చేయిచాచకుండా రైతులు సాగు పని మొదలు పెట్టే పరిస్థితి కన్పించడం లేదు. ఎరువుంటే.. విత్తనం దొరక్క, విత్తనం ఉంటే.. ఎరువు దొరక్క, ఈ రెండూ ఉంటే.. వర్షాల్లేక అన్నదాతలు ఏటా ఏదో ఓ రూపంలో కష్టాలను ఎదుర్కొనేవారు.  కానీ ఈ ఏడాది పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వలేక ఆరంభంలోనే దిక్కులు చూస్తున్నాడు. నాలుగో విడత రుణమాఫీ అందిందంటూనే బ్యాంకులు.. అప్పులకు ముఖం చాటేస్తున్నాయి. గతేడాది చేతికొచ్చిన ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నగదు చెల్లించలేదు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసి రెండు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికీ రైతుల ఖాతాలు ఖాళీగానే ఉన్నాయి. ఇక చేసేది లేక అన్నదాతలు వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగు తీస్తున్నారు.
 
ఇంకెప్పుడిస్తారు రుణం?
సీజన్‌ ప్రారంభమైనా ఇంకా రుణ ప్రణాళిక తయారు కాలేదు. ఈసారి ఇవ్వాల్సిన రుణాల అంచనా రూ.15 వేల కోట్లు. కానీ ఇప్పటికి బ్యాంకులు విదిల్చింది మాత్రం రూ.800 నుంచి రూ.వెయ్యి కోట్లు మాత్రమే. మరోవైపు  రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం కూడా చెల్లింపులు అరకొరగానే చేసింది. ఇంకా రైతులకు సుమారు రూ.వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దుక్కి దున్నించేందుకు ట్రాక్టరు కిరాయి కూడా పైసలు లేని స్థితిలో రైతులున్నారు. ఆలస్యమైతే విత్తనాలు దొరుకుతాయో లేదోనని అప్పు చేసి కొనుగోళ్లకు దిగుతున్నారు.
 
చేతిలో డబ్బెందుకు లేదు?
రైతు చేతిలో నగదు లేకపోవడానికి అనేక కార ణాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకులు.. రేపుమాపు అంటూ తిప్పుకుంటున్నాయి. మరోవైపు బ్యాంకుల్లో న గదు కొరత కూడా రైతులు ఇబ్బందులు ప డేందుకు కారణంగా కన్పిస్తోంది. కొన్ని బ్యాం కులు రైతుకు నేరుగా డబ్బులు ఇవ్వకుండా  ఖాతాల్లో వేస్తున్నాయి. దీంతో రైతులు బయట అవసరాలకు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఆందోళనకు దిగినచోట బ్యాంకర్లు రూ.10 వేలు ఇవ్వాల్సిన వారికి రూ.రెండు వేలు ఇస్తూ సర్దిచెబుతున్నాయి. ఇక ధాన్యం అమ్మిన డబ్బులు ఖాతాల్లో పడుతున్నా.. వాటిని చేతికి తీసుకోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. నగదు కొరత కారణంగా బ్యాంకుల్లో సిబ్బంది రూ.2 వేల నుంచి రూ,3 వేలు మాత్రమే చేతికిస్తున్నారు.
 
స్కూళ్ల ప్రారంభం ఇప్పుడేనాయే!
ఓవైపు పెట్టుబడికి డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న రైతులకు జూన్‌ నెల మరికొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ నెల రెండో వారం నుంచే విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటంతో పిల్లలకు స్కూల్‌ బుక్స్, ఫీజులు, డ్రెస్సులు... ఇతర ఖర్చులతో సతమతం అవుతున్నారు.
 
వెయ్యికి రూ.1,350..
వడ్డీ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. రూ.2, రూ.3 వడ్డీలు పాత మాట. ఇప్పుడు వెయ్యి రూపాయలు అప్పిచ్చి నాలుగు నెలల్లో పంట చేతికి రాగానే వడ్డీ కింద రూ.1,250 నుంచి రూ.1,350 వరకు తీసుకుంటున్నారు. అప్పు మొత్తాన్ని కూడా నగదు రూపంలో ఇవ్వకుండా విత్తనాలు, మందు బస్తాలు తీసుకొచ్చి నేరుగా రైతులకు ఇస్తున్నారు. వీటిలో లాభంతోపాటు 8 శాతం వరకు వడ్డీ రూపం లో వసూలు చేస్తున్నారు. 
 
ఇప్పటివరకు ఇచ్చింది 10 శాతమే!
నాలుగో విడత రుణ మాఫీ డబ్బులు ఇంకా బ్యాంకులకు చేరలేదని బ్యాంకర్లు రైతులకు నచ్చజెప్పి తప్పించుకుంటున్నారు. పెద్ద బ్యాంకులు మినహా మిగతా బ్యాంకులు పది శాతం రుణాలను కూడా రైతులకు ఇవ్వలేదు. రైతులు సాగుచేస్తున్న పంటను బట్టి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.36 వేల వరకు బ్యాంకులు రుణంగా ఇవ్వాల్సి ఉంది. అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. 
 
మచ్చుకు కొన్ని గ్రామాల్లో పరిస్థితి ఇదీ..
వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో సాగు భూమి 2,450 ఎకరాలు ఉంది. 989 మంది రైతులు ఉన్నారు. గ్రామానికి సుమారు రూ.2 కోట్ల వరకు పంట రుణాలు కావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.27 లక్షలు మాత్రమే ఇచ్చారు. కొందరు రైతులు డబ్బులు లేకపోవడంతో ఇంకా దుక్కి కూడా దున్నలేదు.
► నల్లగొండ జిల్లా అనుముల మండలం రామడుగులో సాగు విస్తీర్ణం 3,200 ఎకరాలు. ఇక్కడ 1,144 మంది రైతులు ఉన్నారు. గ్రామంలో రూ.1.14 కోట్లు రుణమాఫీ కాగా.. మూడు విడతల్లో రైతులకు ఆ డబ్బులు చెల్లించారు. నాలుగో విడతలో రూ.36.24 లక్షలు చెల్లించాల్సి ఉంది.
 
 అప్పు తెచ్చి మక్కలు వేస్తున్నా..
పెట్టుబడికి చేతిలో పెసల్లేవు.. నాతోటి రైతులంతా మక్కలు వేస్తున్నరు. వనపర్తిలో తెలిసిన వ్యాపారి దగ్గర రూ.2.50 వడ్డీకి 15 వేలు అప్పు తెచ్చిన. రెండెకరాల్లో మక్కలు వేస్తున్నా. రెండు విడతలు రుణమాఫీ రూ.9 వేలు మాత్రమే ఖాతాలో పడింది. మూడు, నాలుగో విడత ఖాతాలో పడలే. అడిగితే రాలేదని బ్యాంకోళ్లు తిప్పుకుంటున్నారు. రెండేళ్ల నుంచి పంట నష్టపరిహారం కూడా అందట్లే.
– వడ్డెమాన్‌ నిరంజన్, పొల్కెపహడ్‌ రైతు, గోపాల్‌పేట, వనపర్తి
 
అప్పు పుట్టక కౌలుకు ఇచ్చా..
నాలుగో విడత రుణమాఫీ పైసలు రాకపోవడంతో బ్యాంకు అధికారులు కొత్తగా అప్పు ఇవ్వడం లేదు. బయట అప్పు పుట్టకపోవడంతో పొలాన్ని కౌలుకు ఇచ్చుకున్న. డబ్బులు చేతిలో లేక తోటి రైతులు అవస్థలు పడుతున్నారు.
– నారందాసు వెంకటయ్య, రైతు, వడ్డెమాన్, బిజినేపల్లి, నాగర్‌కర్నూలు
 
దుక్కి దున్నేదెలా? 
దుక్కి దున్నడానికి డబ్బులు లేవు. గత ఏడాది నాలుగు ఎకరాల్లో మిర్చి, మూడు ఎకరాల్లో పత్తి వేశా. మిర్చి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోగా రూ.3 లక్షలు నష్టం వచ్చింది. అందుకే ఈ సంవత్సరం పత్తి ఎక్కువగా వేయాలనుకుంటున్నా. కానీ పంటల సాగుకు చేతిలో డబ్బులేదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం దుకాణాల్లో అప్పుల చేయాల్సి వస్తోంది.
– ఈసం లింగయ్య, గిరిజన రైతు, అనంతారం, కొత్తగూడెం జిల్లా 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement