ఆశలపై నీళ్లు
⇒కొండెక్కిన రైతు రుణమాఫీ అప్పీళ్లు!
⇒జిల్లా కేంద్రానికి తిరిగి వేసారిన రైతులు
⇒ఆదేశాలు అందలేదంటున్న బ్యాంకర్లు
రైతుల రుణమాఫీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. అన్ని అర్హతలు ఉండి మాఫీ కాకుండా పోయిన రైతులు గత ఏడాది జిల్లాలోని పలు కేంద్రాల్లో ఏర్పాటుచేసిన రుణమాఫీ కేంద్రాలకెళ్లి తగిన ధ్రువపత్రాలతో అప్పీ ళ్లు చేసుకుని ఏడాది గడుస్తున్నా ఇం తవరకూ ఉలుకూ పలుకూ లేదు. దీంతో బాధిత రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయారు.
పలమనేరు: తమకు అర్హత ఉందని రుణమాఫీ కోరుతూ రైతులు చేసుకున్న అప్పీళ్లపై ప్రభుత్వం విచారణ కూడా జరపలేదు. అసలు అధికారులు ఆ ఫైళ్లను ఎప్పుడో మరచిపోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా వేలాది మంది అర్హత ఉన్న రైతులు ఇక రుణమాఫీపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 500 పైగా బ్యాంకులుండగా వాటి పరిధిలో 4 లక్షల మందికి పైగా రైతులు అన్ని రకాల రుణాలతో కలపి రూ.3,822 కోట్లు పొందారు. అయితే ఈ రుణాలను జల్లెడ పట్టిన ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో కేవలం 1.4 లక్షల మందిని మాత్రమే రుణమాఫీకి అర్హులుగా ప్రకటించింది. మిగిలిన వారి పేర్లు వివిధ రకాల సాంకేతిక కారణాల సాకుతో పక్కన పెట్టింది. దీంతో జిల్లాలో 22 వేల మంది రైతులు తమకు రుణమాఫీ వర్తింపజేయాలని అధికారుల వద్ద అప్పీలు చేసుకున్నారు. వారిలో నో డేటాతో 15 వేల మంది అప్పీలు చేసుకున్నారు.
ఇదిగో సాక్ష్యం
పలమనేరు ఇండియన్ బ్యాంకులో 487 క్రాప్ లోన్లకు రూ.4.5 కోట్లు, 2,243 బంగారం రుణాలకు రూ.18 కోట్లు గతంలో పొందారు. ఇందుకు సంబంధించి రుణమాఫీ మొదటి జాబితాలో 755 ఆపై రెండు జాబితాల్లో 800 మంది పేర్లు మాత్రమే అర్హులుగా వచ్చాయి. మిగిలిన 1,185 మందికి సాంకేతికపరమైన ఇబ్బందులని, డాక్యుమెంట్లు లేవని, ఆధార్ డబుల్ ఎంట్రీ, నాన్ అగ్రికల్చర్ కేటగిరీ అనీ రుణమాఫీ జరగనేలేదు. మొత్తం మీద ఈ ఒక్క నియోజకవర్గ పరిధిలో 8వేల మంది దాకా రైతులకు రుణమాఫీ జరగక తిరిగి వడ్డీతో కలిపి రుణాలు చెల్లించాల్సి వచ్చింది.
అప్పీళ్లపై చర్యలు ఏమయ్యాయి?
తమ అప్పీళ్లపై చర్యలు ఏమయ్యాయని రైతులు జిల్లా కేంద్రానికి వెళ్లి విచారించగా హైదరాబాద్‌కు పంపామని జిల్లా జేడీ కార్యాలయ అధికారులు కొన్నాళ్లు చెబుతూ వచ్చారు. ప్రస్తుతం తమకేమీ సంబంధం లేదని సమాధానం చెబుతుండడంతో ఇక రుణమాఫీ వీరికి కానట్టేనని తెలుస్తోంది. స్థానిక బ్యాంకర్లను సంప్రదిస్తే తమకు పైనుంచి ఏ విధమైన జాబితాలు అందలేదని చెబుతున్నారు. ఫలితంగా అర్హులైన రైతులు రుణమాఫీకి నోచుకోక బ్యాంకుల్లో తడిసిమోపెడైన అసలు వడ్డీలు చెల్లిస్తూ అప్పుల పాలయ్యారు.