ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పినా.. రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న బ్యాంకులు
అప్పులు కట్టాలని అన్నదాతలను వేధిస్తున్న అధికారులు
ఇబ్రహీంపట్నంలో ఒక మహిళా రైతు నుంచి లక్ష రూపాయలు వసూలు
వేధింపులు తట్టుకోలేక ప్రైవేట్ అప్పులు చేసి చెల్లిస్తున్న వైనం
చోద్యం చూస్తున్న వ్యవసాయశాఖ యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, బ్యాంకులు మాత్రం రైతుల నుంచి అప్పులు వసూలు చేస్తూనే ఉన్నాయి. నోటీసులు ఇవ్వడంతోపాటు అధికారులు రోజూ ఫోన్లు చేస్తూ చికాకు పెడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ వారి వేధింపులు ఆగడం లేదనడానికి సరస్వతి చెప్పిన సంఘటనే ఉదాహరణ. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రైతుభరోసా సొమ్మును కూడా అప్పు కింద జమ చేసుకున్నారు.
ఖరీఫ్ సీజన్ జూన్ నుంచే ప్రారంభం అవుతుందని, కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాలని, అప్పుడే కొత్త పంట రుణం ఇస్తామని చెబుతున్నాయి. మరోవైపు సహకార బ్యాంకులు కూడా రైతుల అప్పులను ముక్కుపిండి వసూలు చేస్తూనే ఉన్నాయి. వారు తాకట్టు పెట్టిన భూములను వేలం వేసేందుకు ఇప్పటికే అనేకమందికి నోటీసులు కూడా ఇచ్చాయి.
భరోసా ఇవ్వని యంత్రాంగం...
అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే రూ. 2 లక్షల వరకు రుణం మాఫీ చేయాలంటే రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.
ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికిప్పుడు రుణమాఫీ మార్గదర్శకాలు కానీ, అందుకు సంబంధించిన ప్రక్రియ కానీ మొదలు పెట్టడం సాధ్యం కాదని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. అంటే జూన్ 4వ తేదీ వరకు కోడ్ అమలులో ఉన్నందున అప్పటివరకు రుణమాఫీపై ముందుకు సాగలేమని అంటున్నారు. అయితే అప్పటివరకు రైతులు బ్యాంకుల్లో కొత్త పంటరుణాలు తీసుకోవాలి. కానీ పాతవి ఉండటంతో కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు.
బ్యాంకులు చెప్పిన ప్రకారమే పాత అప్పులు చెల్లించాలని, అంతకు మించి తాము ఏమీ చేయలేమని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేశాక బ్యాంకులకు రైతులు చెల్లించిన సొమ్ము అడ్జెస్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు మండి పడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపటా్ననికి చెందిన సీహెచ్ సరస్వతి గతేడాది లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో దానికోసం ఎదురుచూస్తు న్నారు. కానీ బ్యాంకర్లు మాత్రం ఆమెకు ప్రతీ రోజూ ఫోన్ చేసి అప్పు చెల్లించాల్సిందేనని, ప్రభుత్వ రుణమాఫీతో తమకు సంబంధం లేదని వేధిస్తున్నారు. అంతేగాక నోటీసులు ఇచ్చారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమె స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి వడ్డీతో కలిపి రూ.1.10 లక్షలు చెల్లించారు.
అతని పేరు లక్ష్మయ్య (పేరు మార్చాం)... ఖమ్మం జిల్లాకు చెందిన ఈ రైతు గత మార్చి నెలలో రూ. 95 వేల పంట రుణం తీసుకున్నా రు. బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడితో తీసు కున్న అప్పుతో కలిపి మొత్తం రూ.1.05 లక్ష లు చెల్లించాడు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, అప్పటివరకు ఆగాలని వేడుకున్నా బ్యాంకులు కనికరించలేదని వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment