అన్నదాత కన్నెర్ర
♦ రుణమాఫీ కావడం లేదంటూ తాండూరులో ఆందోళన
♦ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన రైతులు
♦ బ్యాంకు భవనంపై నుంచి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు
♦ రాస్తారోకోతో తీవ్ర ఉద్రిక్తత, భారీగా స్తంభించిన ట్రాఫిక్
తాండూరు: పంట రుణమాఫీ వర్తించడంలేదని, కొత్తగా బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని ఆగ్రహించిన రైతులు మంగళవారం తాండూరులో ఆందోళనకు దిగారు. పంటల సాగుకు ప్రైవేట్‌గా అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీఓలకు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తాండూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదురుగా తాండూరు -కోడంగల్ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో తాండూరు -కోడంగల్ మార్గంలో ఐదు కి.మీ. మేరకు వాహనాలు నిలిచిపోయాయి.
సీఐతో వాగ్వాదం
రాస్తారోకో విరమించాలని తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య ఆందోళనకారులను కోరినా ససేమిరా అన్నారు. సబ్ కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే విరమిస్తామని తేల్చిచెప్పారు. నాయకులను అక్కడి నుంచి బలవంతంగా తరలించేందుకు సీఐ సిబ్బందితో ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం జరిగింది. డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి రోడ్డుమీద పడుకున్నారు. పోలీసులు డౌన్ డౌన్, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
పుల్‌స్టాప్‌కు బదులు కామతో సమస్య
కంప్యూటర్‌లో లక్ష తరువాత పుల్‌స్టాప్‌కు బదులు కామ పెట్టడం రుణమాఫీ వర్తించకపోవడానికి కారణమని బ్యాంకు అధికారులు చెబుతున్నారని రైతులు వివరించారు. ఈ సాంకేతిక కారణం వల్లే విడతలవారీగా రుణం అందలేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఫైల్ పరిశీలనతో ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు రమేష్, లక్ష్మారెడ్డి, నరేష్, ధారాసింగ్, అపూ, సీసీఐ రాములు, పట్లోళ్ల నర్సింహులు, సునీత, శ్రీనివాసాచారి, హేమంత్, రాజారత్నం, రాజ్‌కుమార్, ఎం.శ్రీనివాస్, సీ.మల్లికార్జున్, లింగదళ్లి రవి, సంతోష్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
రైతు ఆత్మహత్యాయత్నం..
పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామానికి చెందిన రైతు సాయప్ప ఆందోళన చేస్తున్న ప్రాంతం నుంచి సమీపంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు భవనం మీదకు వెళ్లి దూకే ప్రయత్నం చేశాడు. రైతులు, నాయకులు సర్ధిచెప్పి కిందకు దించారు. స్థానిక సీఐ సూచన మేరకు తాండూరు తహసీల్దార్ రవీందర్‌తో రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ సబ్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చివరకు 15 రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో నాయకులు రాస్తారోకో విరమించారు.