అన్నదాతను ఆదుకునే తీరిదేనా? | YS Jagan question to the Chandrababu government | Sakshi
Sakshi News home page

అన్నదాతను ఆదుకునే తీరిదేనా?

Published Wed, Mar 8 2017 2:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అన్నదాతను ఆదుకునే తీరిదేనా? - Sakshi

అన్నదాతను ఆదుకునే తీరిదేనా?

బాబు సర్కార్‌కు వైఎస్‌ జగన్‌ ప్రశ్న
కరువునూ క్యాష్‌ చేసుకుంటారా?
రెయిన్‌గన్స్‌తో ఒక్క ఎకరమన్నా బతికిందా?
పంటనష్టం సాయంలేదు.. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు
రుణమాఫీతో ఒరిగింది గోరంత..భారం కొండంత..
మూడేళ్లుగా రైతుల పరిస్థితి దుర్భరం..


సాక్షి, అమరావతి: మూడేళ్లుగా కరువుతో అల్లాడుతున్న అన్నదాతను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ రుణమాఫీ జరక్క, రుణాల రీషెడ్యూల్‌ జరక్క, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందక, పంటనష్టం సాయం అందక రైతులు దుర్భరమైన జీవితం గడుపుతున్నారని వివరించారు. రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులను చేపట్టకుండా కమీషన్లు వచ్చే పట్టిసీమ వంటి ప్రాజెక్టులపైనే దృష్టిపెడుతున్నారని విమర్శించారు. ఇంకా ఆయనేమన్నారంటే...

‘‘బాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి మూడేళ్లుగా కరువే కరువు. ఎంత దారుణమైన కరువంటే, రాష్ట్రంలో సగటు వర్షపాతం 860 మిల్లీమీటర్లయితే 2014లో 559 మి.మీ, 2015లో 814 మి.మీ, 2016లో 600 మి.మీ. వర్షపాతమే నమోదైంది. ప్రతియేటా రబీలో 24.63 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేస్తాం. మూడేళ్లలో ఏ సంవత్సరమూ ఆ మేరకు నాట్లు పడలేదు. ఈ ఏడాది మరీ దారుణంగా 19.56 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. అంటే 5 లక్షల హెక్టార్లలో విత్తనం తక్కువ పడింది. 2016 ఖరీఫ్‌ చూస్తే.. ఆగస్టులో వర్షాలు లేక ఏకంగా 10 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయింది. అప్పుడే చంద్రబాబు రెయిన్‌గన్స్‌ అన్నారు, నాలుగు రోజుల్లో కరువును పారద్రోలాం అన్నారు.

కేవలం పది రోజుల కోసం రెయిన్‌గన్స్‌ కొనుగోలుకు రూ.160 కోట్లు ఖర్చు పెడితే, రూ.103 కోట్లతో వాటిని ఆపరేట్‌ చేశారు. చివరకు వాటివల్ల ఒక్క ఎకరా కూడా పంట బతకలేదు. పంట పూర్తిగా ఎండిపోయింది. అనంతపురంలో మొత్తం 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. అంటే రెయిన్‌ గన్స్‌ పూర్తిగా విఫలమయ్యాయని అర్థమవుతోంది. రెయిన్‌గన్స్‌తో పంటలకు తడి అందించాలంటే 5 లక్షల ట్రాక్టర్లు అవసరం. సమీపంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపినా అన్ని ట్రాక్టర్లు ఉండవేమో?

కరువు రైతులతో చెలగాటం..
రాష్ట్రంలో మొత్తం 664 మండలాలుంటే, 2014–15లో 238 మండలాలను, 2015–16లో 359 మండలాలను, 2016–17లో 301 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. కరువు మండలాలుగా ప్రకటిస్తే.. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం గట్టిగా మాట్లాడి తమకు సాయం చేస్తారని రైతులు ఆశిస్తారు. రుణాలు రీషెడ్యూలు అవుతాయనుకుంటారు. కానీ ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా రుణాలు రీషెడ్యూలు కాలేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తుం దని, పంటలు నష్టపోయినందుకు సాయం వస్తుందని అనుకుంటారు. 2013–14లో రూ.2,306 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలి, అందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా కేంద్రం ఇచ్చిన వాటాను వేరే పనులకు మళ్లించారు. 2014–15లో రూ.1,500 కోట్లు ఇవ్వాలని కలెక్టర్లు చెబితే, దాన్ని తగ్గించి రూ.1,067 కోట్లు చేశారు.

మళ్లీ కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి రూ.692 కోట్లకు తగ్గించారు. ఇవాల్టికీ అందులో రూ. 20, 30 కోట్లు బకాయిలు ఉన్నాయి. 2015–16లో భారీ వర్షాల వల్ల రూ.270 కోట్లు, కరువు వల్ల రూ.600 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే, ఇవాల్టికీ ఇంకా ఇవ్వలేదు. 2016–17లో కరువు వచ్చింది. 268 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిం చారు. దానివల్ల రూ.1,760 కోట్లు, మళ్లీ వర్షాలకు రూ.51 కోట్లు మొత్తం కలిపి రూ.1,811 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలి. అందులో ఒక్క దమ్మిడీ కూడా ఇవ్వకపోగా, కలెక్టర్లు 400 మండలాలను సిఫార్సు చేస్తే, 268 మండలాలే ప్రకటించారు. తర్వాత మళ్లీ ప్రజలనుంచి ఒత్తిడి వస్తే మరో 33 మండలాలను కలిపారు. అక్టోబర్‌లో ప్రకటించాల్సిన వాటిని కేంద్రబృందం వెళ్లిపోయాక ఫిబ్రవరిలో ఈ 33 మండలాలు కలిపారు.

మాఫీ హామీతో రైతులకు రుణభారం
రుణమాఫీ వాగ్దానం చూస్తే.. రైతులు లాభపడిందానికన్నా కోల్పోయిందే ఎక్కువ. 197వ ఎస్‌ఎల్‌బిసీ నివేదికను బట్టి చూస్తే.. 2014–15కు సంబంధించి రైతులకు రూ.56వేల కోట్లు పంటరుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.39,938 కోట్లు మాత్రమే ఇచ్చారు.  2016–17కు రైతులకు బ్యాంకులు 83వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే రూ.55,914 కోట్లు మాత్రమే ఇచ్చారు. రైతులకు రుణాలు అందడం లేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు రుణాలు ఇవ్వకపోవడం ఒకటైతే.. రుణభారం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రైతుల రుణభారం రూ.87,612 కోట్లు కాగా 2016 సెప్టెంబర్‌ 30 నాటికి అంటే.. రెండున్నరేళ్లలో రైతుల రుణభారం రూ.1,03,238 కోట్లకు పెరిగింది.

రుణాలపైన ఏడాదికి 18శాతం అపరాధ వడ్డీ రూ. 15,770 కోట్లు చొప్పున మూడేళ్లలో రైతులు బ్యాంకులకు కట్టాల్సిన అపరాధ వడ్డీ  రూ. 47వేల కోట్లు అయ్యింది. చంద్రబాబు ఇచ్చింది కేవలం రూ.10,600 కోట్లు మాత్రమే. అంటే బాబు ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోలేదన్నమాట. మొత్తం రైతుల ఖాతాలు 1.10 కోట్లు కాగా.. వాటిలో ఓవర్‌డ్యూ 31,13,215 ఖాతాలు, ఎన్‌పీఏ ఖాతాలు 8,41,790గా  ఉన్నాయి. చంద్రబాబు రుణమాఫీని నమ్మిన రైతుల పరిస్థితి ఇది. రైతులకు మొత్తం పంట రుణాలు రూ.69,434 కోట్లయితే, వాటిలో ఓవర్‌డ్యూ, ఎన్‌పీఏ కలిపి దాదాపు రూ.25వేల కోట్లు( 35 శాతం). వ్యవసాయ టర్మ్‌ లోన్లు రూ.33,804 కోట్లు కాగా అందులో ఓవర్‌డ్యూ, ఎన్‌పీఏలు కలిపితే దాదాపుగా రూ.10వేల కోట్లు ఉన్నాయి. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీనిని బట్టి తెలుసుకోవచ్చు.

135 కోట్లు ఖర్చుపెట్టి సముద్రంలోకి పట్టిసీమ నీళ్లు..
ఏ ప్రాజెక్టులు ఉపయోగం అన్న ఆలోచన కూడా లేకుండా కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నారు. ఎలాంటి స్టోరేజి కెపాసిటీ లేని పట్టిసీమ కడతారు. ఈ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీలు లిఫ్ట్‌ చేశారంటే మంత్రి 54 టీఎంసీలు అంటారు. ఎస్‌ఈని అడిగితే 48 టీఎంసీలంటారు. కరెంటు బిల్లులు చూశాం.  రూ. 135.46 కోట్ల బిల్లులు వచ్చాయి. అంటే లిఫ్టులు 110 రోజులు పనిచేశాయి. వాటి ఆధారంగా చూస్తే 42 టీఎంసీల నీళ్లు లిఫ్ట్‌ చేశారు. కానీ 55 టీఎంసీల నీళ్లు ప్రకాశం బ్యారేజీ వద్ద సముద్రంలో కలుపుతారు. అంటే అంతర్వేది వద్ద సముద్రంలో కలవాల్సిన గోదావరి నీళ్లను రూ. 135 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులకు ఖర్చు పెట్టి లిఫ్ట్‌ చేసి ప్రకాశం బ్యారేజీ వద్ద సముద్రంలో కలిపారన్నమాట. ప్రకాశం బ్యారేజి నుంచి నీళ్లు సముద్రంలోకి పోయేది అప్పుడే, పట్టిసీమ నీళ్లు లిఫ్ట్‌ చేసేదీ అప్పుడే. అదే 110 రోజులు కరెంటు బిల్లులు కట్టి నీళ్లు ఎత్తిపోశారు.

అదే 110 రోజులపాటు 55 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ వద్ద సముద్రంలో కలిశాయి. కరెంటు బిల్లుల మీద పెట్టిన రూ.135 కోట్లు.. తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న రూ.120 కోట్లు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి ఇస్తే, వాళ్లు ఆ ఊళ్లను ఖాళీ చేయించి ఇచ్చేవారు. అప్పుడు పులిచింతలలో 45 టీఎంసీల  నీళ్లు నిల్వచేసుకునే పరిస్థితి వచ్చేది. వాళ్లకు ఆ డబ్బులు ఇవ్వని కారణంగా పులిచింతల ప్రాజెక్టు రెడీ అయినా ఇప్పుడు గరిష్టంగా 28 టీఎంసీలు మాత్రమే నిల్వచేయగలిగారు. దాని పూర్తి సామర్థ్యం 45 టీఎంసీలు. గన్నవరంలోను, తన నియోజకవర్గంలోను పంటలు కాపాడలేని పరిస్థితిలో నీటిపారుదల మంత్రి ఉన్నారు. హంద్రీ–నీవాకు సంబంధించి పోయి ధర్నాలు చేయాల్సి వచ్చింది.

80 శాతం పనులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే అయిపోయాయి. కేవలం 20 శాతం మిగిలి ఉన్నాయి వాటిని పూర్తి చేయడానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ పనులు పూర్తిచేయాలని ధర్నాలు చేశాం. అవి రాకపోవడం వల్ల అనంతపురం జిల్లాలో మొత్తం 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. నిజంగా నీళ్లిచ్చి ఉంటే ఆ పరిస్థితి ఎందుకు ఉంటుంది? గాలేరు–నగరి ప్రాజెక్టూ అంతే. గండికో ట కెపాసిటీ 26 టీఎంసీలు. 6 టీఎంసీలు వరద కాలువ ద్వారా తీసుకురావాల్సి ఉన్నా ఆ పనిచేయలేదు. వేరే మార్గం గుండా తీసుకొచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సీఎం కాకముందు 2012లోనే అప్పటి కలెక్టర్‌ శశిధర్‌ 3 టీఎంసీల నీళ్లు నింపి ఫొటో దిగారు, వీళ్లూ అదే పని చేశారు. వరద కాలువ పూర్తి చేయాలనే విషయాన్ని మాత్రం ఆలోచించరు. అది పూర్తయితే గాలేరునగరి మొదటి దశ పూర్తయి నీళ్లిచ్చే పరిస్థితి ఉంటుంది. దానిపై ధ్యాసపెట్టరు.’’

హేచరీస్‌ ఉన్న చోట ఫార్మా పరిశ్రమలా?
చంద్రబాబు పుణ్యాన హేచరీలు ఉన్నచోట్ల ఫార్మా యూనిట్లు పెడుతున్నారు. తుని వద్దకు వెళ్లి చూస్తే, 65 లక్షల లీటర్ల కాలుష్య జలాలు రోజూ సముద్రంలో కలుపుతున్నారు. హేచరీలకు హాని కలుగజేస్తూ సముద్రపు నీళ్లు కలుషితం అవుతున్నాయి. పరిశ్రమలకు నేను వ్యతిరేకం కాదు.. వాటిని పెట్టాల్సిన చోట పెట్టాలి. ఫార్మాసిటీలో అయితే ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఉంటాయి. కానీ హేచరీల క్లస్టర్‌ వద్ద పెడితే అవి నాశనం అయిపోతాయి. చంద్రబాబు విధానాల వల్ల చేపలు పట్టే మత్స్యకారులు వేటకు వెళ్లాలంటే లోతుగా సముద్రంలోకి వెళ్లాల్సి వస్తోంది. తిరిగి ఇంటికి వస్తాడా రాడా అన్న భయం వేస్తోంది.

దమ్మున్న సీఎం ఉంటేనే రైతుకు మద్దతుధర
ఇదే వ్యవసాయ రంగంలో చంద్రబాబు సీఎం అవ్వడానికి ముందు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయిస్తామని, పెట్టుబడికి 50 శాతం లాభం వచ్చేలా కనీస మద్దతు ధర ఇప్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. కేంద్రంలో భాగస్వామ్య ప్రభుత్వంలో ఉన్న వీళ్లు కనీస మద్దతు ధర విషయం చూడాలి. చంద్రబాబు సీఎం అయినప్పుడు వరి రూ.1360 ఉంటే, 2015–16కు కేవలం 50 రూపాయలు పెంచారు, 2016–17కు రూ.1,470కి మాత్రమే పెరిగింది. 4 శాతం కంటే తక్కువ మాత్రమే పెరిగింది. పత్తి 2014–15లో రూ.3,750 ఉంటే 2015–16లో రూ.3,850, 2016–17లో రూ.3,860 మాత్రమే అయ్యింది.

అంటే ఒకటి నుంచి ఒకటిన్నర శాతమే పెరిగింది. ద్రవ్యోల్బణం 5 శాతం పైనే ఉంది. అంటే రైతులకు కనీస మద్దతు ధర దానికి సరిపోయేలా కూడా పెంచకపోతే రైతుల వాస్తవాదాయం పెరిగిందా.. తగ్గిందా? ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరికి కనీస మద్దతు ధర రూ.530 నుంచి రూ.1,050కి పెరిగింది. ముఖ్యమంత్రి కేంద్రం మీద తెచ్చే ఒత్తిడి ఆధారంగానే కనీస మద్దతు ధరలు పెరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement