రైతు ఆత్మహత్యలపై దద్దరిల్లిన సభ | Ys Jagan Mohan Reddy fires on government in farmer suicides issue | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలపై దద్దరిల్లిన సభ

Published Thu, Mar 23 2017 2:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

రైతు ఆత్మహత్యలపై దద్దరిల్లిన సభ - Sakshi

రైతు ఆత్మహత్యలపై దద్దరిల్లిన సభ

మత్తుమందుల వల్లే.. రైతుల చావులన్న మంత్రి ప్రత్తిపాటి
అన్నదాతల ఆత్మహత్యలతో అపహాస్యమా?
రైతులను బలిగొంటున్నది ప్రభుత్వమే..
రుణమాఫీ లేదు.. అందని ఇన్‌పుట్‌సబ్సిడీ
ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?
ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్షనేత జగన్‌


సాక్షి, అమరావతి: ‘‘రైతుల ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు, అనారోగ్యం, మత్తుమందుల వినియోగం, సాగు సంబంధ సమస్యలు, అప్పుల బాధ వంటివి కారణం’’అన్నదాతల ఆత్మహత్యలపై బుధవారం నాడు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ మంత్రి ప్రతిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్య ఇది. దీంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చెలరేగింది. మంత్రి వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారపక్ష, ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. చంద్రబాబు హామీ ఇచ్చిన రుణమాఫీ అమలు కాక, సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందక, గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని స్థితిలో  రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

వాస్తవాలను గుర్తించడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యాలు చెబుతోందని దుయ్యబట్టారు. రుణమాఫీలోని డొల్లతనాన్ని ఎండగట్టారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగవేతను సోదాహరణంగా వివరించారు. అన్నదాతల బలవన్మరణాలకు పాలకుల తప్పిదాలు కారణాలు కాగా మత్తుపదార్ధాలు, కుటుంబ సమస్యలంటూ అంటగడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అన్నదాతల ఆత్మహత్యల నివారణకు చేపడుతున్న చర్యలేమిటో చెప్పాలని నిలదీశారు. ఇన్‌పుట్‌సబ్సిడీ, రుణమాఫీలకు సంబంధించి ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏ విధంగా వ్యవహరించిందో వివరించేందుకు జగన్‌ ప్రయత్నిస్తుంటే యధాప్రకారం ఆయనను మాట్లాడనివ్వకుండా పదేపదే మైక్‌ కట్‌ చేశారు. రాష్ట్రప్రభుత్వ తప్పిదాలే రైతుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయని వైఎస్సార్సీపీ సభ్యులు ధ్వజమెత్తారు.

ఇరుపక్షాల వాగ్వాదాలు, పరస్పర సవాళ్లు, అరుపులు, కేకల మధ్య సభ తొలి గంటన్నర వ్యవధిలోనే రెండోసారి వాయిదాపడింది. రైతుల ఆత్మహత్యలపై వైఎస్సార్‌సీపీ సభ్యులు పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పి.రవీంద్రనాధ్‌రెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం ఇస్తున్న సందర్బంలో ఈ వివాదం చెలరేగింది. జాతీయ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం 2015లో 516 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీరిలో వంద మంది సాగు సంబంధిత సమస్యలతో, మరో 200 మంది అప్పుల బాధతో, 216 మంది కుటుంబ సమస్యలు, అనారోగ్యం, మత్తు మందుల వినియోగం వంటి కారణాలతో చనిపోయారని మంత్రి పుల్లారావు చెప్పారు. అయితే జిల్లా స్థాయి త్రిసభ్య కమిటీ నివేదికల ప్రకారం రాష్ట్రంలో 2015లో 137 మంది, 2016లో 35 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెబుతూ బలవన్మరణాలకు కారణాలను వివరించారు. రైతుల బలవన్మరణాలను నివారించడానికి రుణమాఫీని అమలు చేయడంతో పాటు కౌలు రైతులకు బ్యాంకు రుణాలను ఇప్పిస్తున్నట్టు తెలిపారు.

రైతులకు మానసిక సమస్యలు అంటగడతారా?
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం రైతులకు మానసిక రుగ్మతలను అంటగడతారా? అని వైస్సార్‌ సీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిని నిలదీశారు. రాష్ట్రంలో నానాటికీ రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ 2014 నుంచి ఇప్పటికి 916 మంది చనిపోయారన్నారు. ఈ ఏడాది జనవరి తొలి 12 రోజుల్లో 9 మంది చనిపోయారని చెప్పారు. చనిపోయిన 916 మందిలో కేవలం 160 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారని, వీరిలో 103 మందికి లక్షన్నర మాత్రమే పరిహారం ఇచ్చారని, 66 మందికి 5 లక్షలు ఇచ్చినట్టు వివరించారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఏమి చర్యలు చేపట్టారో చెప్పడానికి బదులు రెయిన్‌గన్లతో పది రోజుల్లో 6.25 లక్షల ఎకరాల్లో పంటల్ని కాపాడామని చెబుతారా? అంటూ నిలదీశారు.

రెయిన్‌గన్లతో పంటల్ని కాపాడేటట్టయితే నీటి పారుదల ప్రాజెక్టులపై వందల, వేల కోట్లు ఖర్చు పెట్టేకన్నా వీటితోనే నీళ్లు పారిస్తే సరిపోతుంది కదా? అని ఎద్దేవాచేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని రాబట్టేందుకు, గిట్టుబాటు ధర కల్పించడానికి ఏమేమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. 87 వేల కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ చేయాల్సి ఉంటే ఇప్పటికి ఇచ్చింది కేవలం 11,032 కోట్లని, ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతుల రుణ బకాయిలు లక్షా 5 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. వాస్తవాలు చెప్పకుండా దాపరికం ఎందుకని మండిపడ్డారు. ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల తమ ప్రాంతం నుంచి రైతులు, రైతు కూలీలు వలస పోతున్న వైనాన్ని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచే వలసలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కరువు మండలాలను ప్రకటించి సరిపెట్టుకోకుండా సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని, రైతులకు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని, 80 శాతం వరకు పూర్తయిన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ చర్చకు మంత్రి ప్రత్తిపాటి సమాధానం చెబుతూ రాష్ట్రంలో నానాటికీ ఆత్మహత్యలు తగ్గిపోతున్నాయని, అందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలే కారణమని చెప్పినప్పుడు విపక్ష సభ్యులు ఎద్దేవా చేశారు. పంటల వారీ రుణాలు, బీమా, రుణమాఫీ వంటి అంశాలను మంత్రి ప్రస్తావిస్తూ పనిలో పనిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏమి జరిగిందో ఏకరవుపెట్టారు. ఈ దశలో విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని అధికారపక్షం తీరును ఎండగట్టారు. వాస్తవాలను వక్రీకరించవద్దని హితవు పలికారు. మీరు చేసిందేమిటో చెప్పాలని, ఎనిమిదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి అంతకుముందు రెండేళ్ల క్రితం ఏదో చేయలేదని చెబుతూ సభను తప్పుదోవ పట్టించడం భావ్యం కాదన్నారు.

సభలో తీవ్ర గందరగోళం..
ఈ దశలో సభలో తీవ్రగందర గోళం జరిగింది. జగన్‌కు మైకు ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు.  8 వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎక్కడో, ఎట్లానో చెప్పాలని అధికారపక్ష సభ్యులు కేకలు వేయడంతో.. పెన్నూ, పేపరు తీసుకుంటే చెప్తా, రాసుకోవచ్చని జగన్‌ జవాబిచ్చారు. 2013–14లో రూ. 2,360 కోట్లు అని చెప్పబోతుండగా అధికార పక్షం అడ్డుతగిలింది. స్పీకర్‌ సైతం జోక్యం చేసుకున్నారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ తాను సబ్జెక్ట్‌ మీదనే మాట్లాడుతున్నానని, రైతు ఆత్మహత్యలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, రుణమాఫీ అన్నీ కారణాలేనని వివరించారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన దానికీ.. చేసిన దానికి ఎంత తేడా ఉందో చెబుతూ 87వేల కోట్లకు పైగా మాఫీ చేయాల్సి ఉండగా ఏడాదికి 3 వేల కోట్లు విదిలిస్తూ పోతే రైతుల బతుకులు ఎట్లా గట్టెక్కుతాయని ప్రశ్నించారు. జగన్‌ రుణమా ఫీ లెక్కలు చెబుతుండగా స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు. దీంతో సభ్యులు పోడియం ఎదుట నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.ప్రతిగా అధికార పక్ష సభ్యులు సైతం వెల్‌లోకి వచ్చే ప్రయత్నం చేయడంతో స్పీకర్‌ కోడెల 10.39 గంటల ప్రాంతంలో పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, వర్మకి విపక్ష సభ్యులు కోటింరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.

ధర్మశ్రీ రుణమాఫీ ఉదంతాన్ని బైటపెట్టిన జగన్‌
రుణమాఫీ గురించి మంత్రి పుల్లారావు ఘనంగా చెబుతున్నారని, కానీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉదంతాన్ని చూస్తే రుణమాఫీ డొల్లతనం బైటపడుతుందని జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ధర్మశ్రీ ఉదంతం గురించి సభకు తెలిపారు. గతంలో మంత్రి ప్రత్తిపాటి.. ధర్మశ్రీ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ రుణమాఫీ వల్ల ఆయనకు చాలా మేలు జరిగినట్టు చెప్పిన సంగతి తెల్సిందేనని ఆయన గుర్తుచేశారు.

అసలు రూ..50 వేలల్లో 3,200 రూపాయలు పోగా మిగిలిన మొత్తం రు.46,800 అసలుగానూ, ఇంకా మిగిలిన వడ్డీగా రు.4200, మొత్తం బాకీ ఇప్పటి వరకు 51 వేలుగా ఉంది. అంటే గతంలో తీసుకున్న అసలు 50 వేలు, వడ్డీగా వేయి రూపాయలు ఇంకా బాకీ ఉంది. రుణమాఫీ కింద ఇప్పటి వరకు ఇచ్చిన రెండు విడతల మొత్తం వడ్డీకే సరిపోలేదు.  కానీ మంత్రి గారు 1,36,935 రూపాయల రుణమాఫీ చేసినట్టు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అసత్యాలు చెప్పడం న్యాయమా? ప్రత్తిపాటివి ఒట్టి మాటలేనని ఈ సంఘటన రుజువు చేసిందని జగన్‌ వివరించారు.  ప్రతి చోటా ఇదే తంతు జరుగుతోందని జగన్‌ పేర్కొన్నారు. రుణమాఫీ కింద 87,612 కోట్లు చెల్లించాల్సి ఉంటే ఆ మాఫీకి ఏటా మూడు వేలో, మూడువేల 5 వందల కోట్లో ఇస్తే అది ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం కేటాయిస్తున్న మొత్తాలు వడ్డీకి కూడా సరిపోవడం లేదని, 18 శాతం వడ్డీ చొప్పున ఏటా రూ.16 వేల కోట్లు అవుతుందన్నారు. గత మూడేళ్లలో ఇచ్చింది రూ.11,032 కోట్లయితే వడ్డీ 48 వేల కోట్లయిందని అంటూ ఉండగా స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు.  

ఇదీ ధర్మశ్రీకి జరిగిన రుణమాఫీ
తీసుకున్న మొత్తం రుణం రూ.50 వేలు
► ఇన్సూరెన్స్‌ 7 రూపాయలు
► మొత్తం బాకీ 50,007 రూపాయలు
► రుణం తీసుకున్న తేదీ 2014 ఫిబ్రవరి 4న
► మొదటివిడత రుణమాఫీగా రూ.10వేలు
► జమ అయిన తేదీ– జనవరి 17, 2015న
► దానిలో అసలు కింద రూ.3200
► వడ్డీ రూపేణా రూ.6,800
► రెండోవిడత మాఫీ .. సెప్టెంబర్‌ 15, 2016
► ఇచ్చిన మొత్తం రూ.11 వేలు
► ఇందులో వడ్డీ రూపేణా రూ.10,480
► ఏఆర్‌బీ ఫీజుగా రూ.520
మిగిలిన రుణం రూ. 51,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement