మాఫీ మాటలే.. చేసింది అరకొరే
కాగ్ నివేదికలో బయటపడ్డ రుణమాఫీలో డొల్లతనం
సాక్షి, అమరావతి: అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన రుణ మాఫీ పథకంలో డొల్లతనాన్ని కాగ్ నివేదిక సైతం బట్టబయలు చేసింది. చంద్రబాబు సర్కార్ రుణ మాఫీ విషయంలో మొదటి నుంచి చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లు ఉందన్న ఆరోపణలకు కాగ్ నివేదిక బలాన్ని ఇచ్చింది. రుణ మాఫీ లెక్కలు అన్నీ తప్పుల తడకలు అని, ప్రకటించిందే అరకొర నిధులు కాగా అవీ రైతులకు చేరలేదని ఇటీవల అసెంబ్లీలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది. ఈనేపధ్యంలో శుక్రవారం విడుదల అయిన కాగ్ నివేదిక అనేక వాస్తవాలను వెల్లడించింది. రుణ మాఫీకి బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, అందులో ఖర్చుచేసిన మొత్తం వివరాలు చూస్తే చంద్రబాబు రైతులకు ఎలా షాక్ ఇచ్చారో అర్థమవుతుంది.
2014–15లో రుణమాఫీ అమలు చేపట్టగా ఆ మరుసటి ఏడాది కేటాయించిన మొత్తాన్నే పక్కదారి పట్టించిన ఘనత సంపాదించింది. మొదట చెప్పిన వ్యవసాయ రుణమాఫీ మొత్తం సుమారు 81 వేల కోట్లు కాగా కోటయ్య కమిటీ పేరుతో అనేక కొర్రీలు పెట్టి దాన్ని సుమారు 24వేల కోట్లకు పరిమితం చేసింది. కనీసం ఆ మేరకైనా రైతులకు చేరలేదనే కఠోర వాస్తవాలను కాగ్ బయటపెట్టింది. రుణ మాఫీ పథకానికి 2015–16 బడ్జెట్‌లో రూ.4300 కోట్లు కేటాయిస్తే రూ.743.52 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన రూ.3,557.68 కోట్లను ఇతర పద్దులకు సర్దుబాటు చేసింది. ఈ రూ.743.52 కోట్లలోనూ రూ.375 కోట్లను ఆ ఏడాది చివర్లో రైతు సాధికార సంస్థ పీడీ ఖాతాకు సర్దుబాటు చేసినట్టు పరిశీలనలో తేలింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం తీరుపై కూడా కాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కేటాయింపులు బారెడు, ఖర్చు మూరెడు
వ్యవసాయం గురించి సీఎం చంద్రబాబు చెబుతున్న పెద్దపెద్ద మాటలు ఉత్తివే అని భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ నివేదిక (కాగ్) తేల్చేసింది. కేటాయింపుల్లో సగం కూడా వ్యయం చేయలేదని నివేదికలో పేర్కొంది. వ్యవసాయ గ్రాంటు కింద 2015–16 ఆర్థిక సంవత్సరానికి చేసిన బడ్జెట్ కేటాయింపులు రూ.7,967.77 కోట్లు (అనుబంధ కేటాయింపులు 605.77 కోట్లుతో కలిపి) కాగా వ్యయం చేసింది మాత్రం రూ.3,785.40 కోట్లు, తిరిగి సరెండర్ చేసింది రూ.4,100.27 కోట్లు. అంటే కేటాయింపుల్లో 53 శాతం నిధులు ఖర్చు చేయలేదు.