గడికోట శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రతీ మాట అబద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓవైపు రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడిపోతుంటే.. పట్టిసీమ వల్ల రాయలసీమ బాగుందంటూ బాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం లోటస్‌పాండ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాగ్ ఇచ్చిన నివేదిక నిజం కాదా అని ప్రశ్నించారు. ‘2014లో అధికారంలోకి రాగానే 17 వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 67 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని మంత్రి దేవినేని చెబుతున్నారు. అంటే దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేర టీడీపీ అవినీతికి పాల్పడింది’ అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అనుసంధానం వల్ల ఏం లాభం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ మహానేత వైఎస్సార్ హయాంలోనే జరిగాయని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన పాలనా కాలంలోనే 80 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయలేక చంద్రబాబు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. గోదావరి- పెన్నా లింకేజీ అంటూ టెండర్లను పిలిచేది మరోసారి దోపిడీ చేయడానికే బాబు సిద్ధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గతంలో కంటే సాగు విస్తరణ 2లక్షల హెక్టార్లలో తగ్గిందన్న శ్రీకాంత్ రెడ్డి.. మరి నదుల అనుసంధానం చేసి ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ‘రాష్ట్రంలోనే ఏమి చేయలేని వాడివి. కేంద్రంలో ఏం సాధిస్తావ్. మొన్న మోదీ, నిన్న రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకున్నావ్. పదవి కోసం ఇన్ని కుట్రలు, మోసాలు చేయాలా’ అని చంద్రబాబును విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment