
సాక్షి, అమరావతి: రాజ్యాంగ పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొద్ది నెలలుగా డ్రామాలు చేస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులతో కుమ్మక్కై వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టులో వేసే అఫిడవిట్‌ను ముందురోజే మీడియాకు లీక్ చేయడం ఏమిటన్నారు. హైకోర్టులో నవంబర్ 4న వేసిన అఫిడవిట్‌ను మూడోతేదీనే మీడియాకు లీక్‌చేశారన్నారు. ‘ముందురోజే లీక్ ఇవ్వడంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఉన్న ప్రత్యేక ఇంట్రస్టు ఏమిటి? దీనివెనుక ఆంతర్యం, అత్యుత్సాహం ఏమిటి? హైకోర్టుకు నివేదించే విషయాలను ముందురోజే మీడియాకు ఎలా ఇచ్చారు? రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తి ఇలా చేయవచ్చా? రాజ్యాంగ వ్యవస్థలంటే మీకున్న గౌరవం ఇదేనా?’ అని ప్రశ్నించారు.
రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తూ నీతి, న్యాయం పాటించకుండా ఆ వ్యవస్థను రమేష్‌కుమార్ ఎలా దిగజారుస్తున్నాడో అర్థమవుతోందన్నారు. ‘ఇవన్నీ చూశాక ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఎవరైనా అనుకుంటారా? చంద్రబాబు భ్రష్టుపట్టించిన వ్యవస్థకు మరమ్మతు చేసే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటే.. ఇంకా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తారా? రాష్ట్రంలో మూడే కరోనా కేసులున్నప్పుడు ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదన్న నిమ్మగడ్డ.. రోజుకు మూడువేల కేసులు వస్తున్నప్పుడు ఎలా సాధ్యం అవుతుందంటారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే ఇలాంటి వ్యక్తి స్థానికసంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తాడంటే ఎవరైనా నమ్ముతారా..’ అని ప్రశ్నించారు. ఎన్నికలంటే వైఎస్సార్‌సీపీకి భయం లేదని, ఎపుడు జరిగినా తమ విజయం నల్లేరు మీద నడకేనని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment