విశేషాధికారాల ముసుగులో.. టీడీపీ సేవ | Nimmagadda Rameshkumar made another controversial decision | Sakshi
Sakshi News home page

విశేషాధికారాల ముసుగులో.. టీడీపీ సేవ

Published Tue, Mar 2 2021 4:32 AM | Last Updated on Tue, Mar 2 2021 8:35 AM

Nimmagadda Rameshkumar made another controversial decision - Sakshi

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ప్రక్రియ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీకి మేలు చేకూర్చేలా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తాజాగా మరో ఉత్తర్వు జారీచేశారు. ఈనెల 10న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఘట్టం ఎప్పుడో ముగిసిపోయినప్పటికీ కొందరు టీడీపీ నేతలకు మాత్రం ఇప్పుడు నామినేషన్‌ వేసుకునేందుకు తన విశేషాధికారాలతో అనుమతిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిశాక మళ్లీ వాటిని వేసేందుకు వీల్లేదని ఎన్నికల చట్టాలు స్పష్టంగా చెబుతున్నా నిమ్మగడ్డ వాటన్నింటినీ తోసిరాజని.. ఫిర్యాదులు, వినతులు వచ్చాయంటూ ఓ పార్టీకి లబ్ధిచేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలను దెబ్బతీసేందుకే ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. మరోవైపు.. నామినేషన్లపై తామెంలాంటి ఫిర్యాదు చేయలేదని, వినతులు కూడా పంపలేదంటూ ఇద్దరు నేతలు స్పందించినట్లు తెలిసింది. తమ సంతకాలను ఎవరన్నా ఫోర్జరీ చేసి వినతులు పెట్టి ఉండొచ్చని, ఇప్పుడు నామినేషన్ల దాఖలుపై తమకెలాంటి ఆసక్తిలేదని వారు ఎన్నికల అధికారులకు స్పష్టంచేసినట్లు సమాచారం. వివరాలివీ..

తిరుపతి నగరపాలక సంస్థతో పాటు పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులలో టీడీపీ అభ్యర్థులకు ఇప్పుడు ప్రత్యేకంగా నామినేషన్ల దాఖలుకు వీలుకల్పిస్తూ నిమ్మగడ్డ సోమవారం ఆదేశాలు జారీచేశారు. నిజానికి ఈ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ 2020 మార్చి 13నే ముగిసింది. ఆ మరసటి రోజు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యాక కరోనా సాకుతో ఎన్నికల ప్రక్రియ వాయిదా వేశారు. అప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి తిరిగి కొనసాగిస్తున్నట్లు గత నెలలో ఎస్‌ఈసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల దాఖలు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశంలేదు. కానీ, నిమ్మగడ్డ మాత్రం.. పలువురు టీడీపీ నేతలకు అవకాశం కల్పిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవాలను అడ్డుకునేందుకేనా!?
నిజానికి తిరుపతి నగరపాలక సంస్థలోని ఆరు డివిజన్లలో సింగిల్‌ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అవీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులవే. అంటే ఇక్కడ వీరి ఎన్నిక దాదాపు ఏకగ్రీవమే. అయితే, ఇప్పుడు ఆ ఆరు డివిజన్లలో నామినేషన్లకు మళ్లీ అవకాశం కల్పించడమంటే వైఎస్సార్‌సీపీకి అయ్యే ఏకగ్రీవాలకు గండికొట్టి టీడీపీకి లబ్ధిచేకూర్చడమేనన్నది స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పుంగనూరు, రాయచోటిలోనూ ఇదే లక్ష్యం కనపిస్తోందంటున్నారు.

అవి ఫోర్జరీలేమో..
ఇదిలా ఉంటే.. పుంగనూరులోని 14, 28 వార్డుల్లో కొత్తగా నామినేషన్‌ దాఖలకు అవకాశం దక్కిన వారిలో ఇద్దరు నాయకులు ఎస్‌ఈసీ నిర్ణయంపై విస్మయం వ్యక్తంచేసినట్లు తెలిసింది. తాము అసలు కొత్తగా నామినేషన్‌ వేసేందుకు జిల్లా కలెక్టరుకుగానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కుగానీ ఎలాంటి వినతులు పంపలేదని.. తమ సంతకాలను ఎవరన్నా ఫోర్జరీ చేసి వినతులు పెట్టి ఉండొచ్చని వారు ఎన్నికల అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఇప్పుడు నామినేషన్ల దాఖలుపై తమకెలాంటి ఆసక్తి కూడా లేదని వారు స్పష్టంచేసినట్లు తెలిసింది.  

అప్పుడు అడ్డుకున్నారంటూ.. 
తిరుపతి నగరపాలక సంస్థలోని 2, 8, 10, 21, 41, 45 డివిజన్లలో ఐదుగురు టీడీపీ, ఒక బీజేపీ నేత పేర్లను ప్రత్యేకంగా తెలియజేస్తూ మంగళవారం సా.3 గంటల వరకు వారి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లుచేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే, పుంగనూరు మున్సిపాలిటీలోని 9, 14, 28 వార్డులు.. వైఎస్సార్‌ జిల్లా రాయచోటి మున్సిపాలిటీలోని 20, 31 వార్డుల్లో ఐదుగురు టీడీపీ నేతల పేర్లను ప్రత్యేకంగా పేర్కొన్నారు. గతంలో వీరు నామినేషన్లు వేయడానికి సిద్ధపడగా, ప్రత్యర్థులు వీరిని అడ్డుకున్నట్లుగా తాను నిర్ధారణకు వచ్చానని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అలాగే, వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో కూడా 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత ముగ్గురితో వారి ప్రత్యర్థులు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని.. వారికీ ఇప్పుడు మళ్లీ నామినేషన్‌ దాఖలకు అవకాశం కల్పిస్తున్నట్లు నిమ్మగడ్డ ఆదేశాలు జారీచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement