సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
సాక్షి, అమరావతి: వార్డు వలంటీర్ల వద్ద ఉండే మొబైల్ ఫోన్లను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలు జారీచేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సోమవారం ఆయన విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, పద్మజారెడ్డిలు హాజరుకాగా.. టీడీపీ నుంచి వర్ల రామయ్య, సీపీఎం నుంచి వైవీ రావు, సీపీఐ తరఫున జల్లి విల్సన్, కాంగ్రెస్ నుంచి మస్తాన్‌వలితో పాటు బీజేపీ, జనసేన తదితర పార్టీల ప్రతినిధులూ హాజరయ్యారు. మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలవల్ల వార్డు వలంటీర్లు వారి రోజు వారీ విధులు నిర్వర్తించే పరిస్థితి ఉండదని, నిబంధనల పేరుతో వారికి ఆటంకాలు కలిగే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు.
వృద్ధులు, వికలాంగులకు రవాణా సౌకర్యం
వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాంగమే వారికి ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటుచేస్తుందని సమావేశంలో కమిషనర్ వివరించారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని నిమ్మగడ్డ స్పష్టంచేశారు. కాగా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పలుచోట్ల బదిలీలు జరుగుతున్నాయని పలువురు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు నిమ్మగడ్డ దృష్టికి తీసుకురాగా.. ‘దీర్ఘకాలికంగా ఒకేచోట ఉన్న వారి బదిలీలకు తానే సీఎస్‌కు సిఫార్సు చేశానని, అందుకనుగుణంగానే మార్పులు జరుగుతున్నాయ’ంటూ కమిషనర్ బదులిచ్చారు.
దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు: వర్ల
పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని సమావేశంలో వర్ల రామయ్య ప్రస్తావించడంతో నిమ్మగడ్డ ఆయన్ను వారించి మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడాలని సూచించారు. అయినా, అదే అంశాన్ని పెద్ద గొంతుతో పదేపదే ప్రస్తావిస్తుండడంతో ఎన్నికల కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశానంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ, మేం మొన్నమొన్నటి వరకు చూసిన నిమ్మగడ్డలా ఆయన కనిపించడంలేదని.. ఆయనపై మాకు అనుమానాలున్నాయని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment