కాపులను దగా చేసిన సీఎం
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిగ
పాడేరు: కాపులను సీఎం చంద్రబాబు దగా చేశారని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. బీసీల్లో చేరుస్తామంటూ ఇచ్చిన హామీ అధికారం కోసమేనని తేటతెల్లమైందన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ డ్వాక్రా, రైతు రుణమాఫీ వంటివి నెరవేర్చలేక మాయమాటలతో మభ్యపెడుతున్నారని విమర్శిం చారు. ఎన్నికలప్పడు లేనిపోని ఆశలు కల్పించడం వల్లే కాపులు ఇప్పుడు ఉద్యమ బాట పట్టారన్నారు. దీనికి జవాబు చెప్పకుండా కాపుల్లో అనైక్యతను సృష్టించేందుకు,వారికి వ్యతిరేకంగా బీసీ వర్గాలను ఆందోళనకు పురికొల్పడం వంటి కుటిల ప్రయత్నాలకు చంద్రబాబు పూనుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. కాపు ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతునిచ్చారని, ఈ అక్కసుతో తుని ఘటనకు నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెడుతున్నారని అన్నారు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ వంటి వారిని నిందితులుగా చేర్చి కేసులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోందని, అధికార పార్టీవారే ఈ ఘాతక చర్యకు పూనుకుని ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్ర సాగిస్తున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు.
మన్యంలో తీవ్రంగా తాగునీటి సమస్య: ఏజెన్సీలో మంచినీటి సమస్య తీవ్రమవుతోందని, గ్రామాల్లో నిర్మిస్తున్న గ్రావిటీ పథకాలు నిరుపయోగంగా ఉంటున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మంచినీటి పథకాల నిర్మాణంపై పర్యవేక్షణ కొరవడడంతో నిధులు దుర్వినియోగం తప్పితే ప్రజలకు వీటి వల్ల తాగునీరు అందడం లేదన్నారు. మన్యంలో వాతావరణ పరిస్థితులు మారాయని, ఇప్పటి నుంచే ఎండలు తీవ్రమవుతున్నాయని, తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టకుంటే వేసవిలో మంచినీటి ఎద్దడి తప్పదన్నారు. కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చింతపల్లి మండలం రాళ్లగెడ్డ కొత్తూరులో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి భూములు ఇవ్వడం లేదని గిరిజనులపై వేధింపులు ఎక్కువయ్యాయని, దీనిపై రూరల్ ఎస్పీ దృష్టి సారించి గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు, వైఎస్సార్‌సీపీ నాయకులు రఘునాథ్, శ్రీరాములు పాల్గొన్నారు.