
సాక్షి, అమరావతి : ప్రలోభాల వీడియోపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తడబడ్డారు. మంత్రి పదవి కోసమే పార్టీ మారానన్న వ్యాఖ్యలను ఆమె పరోక్షంగా అంగీకరించారు. వీడియోలో మాట్లాడింది మీరేనా అన్నప్రశ్నకు గిడ్డి ఈశ్వరి సమాధానం దాటవేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. వీడియోపై మీడియా ప్రశ్నిస్తుండగానే బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి గిడ్డి ఈశ్వరి వెళ్లిపోయారు. మరోవైపు పదవుల కోసమే గిడ్డి ఈశ్వరి పార్టీ మారారని వైఎస్‌ఆర్ సీపీ గిరిజన ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయితే వైఎస్‌ఆర్ సీపీ గిరిజన ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆమె జవాబు దాటవేశారు.
కాగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలుచేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బండారం బట్టబయలైంది. ఇటీవల పార్టీ మారిన గిడ్డి ఈశ్వరితో చంద్రబాబు కుదుర్చుకున్న భారీ డీల్ గుట్టు రట్టయింది. మంత్రి పదవి లేదా ఎస్టీ కార్పొరేషన్ పదవి ఇస్తామని ఆశజూపి.. ఆమెను పార్టీలోకి తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు స్వయంగా డీల్ గురించి గిడ్డి ఈశ్వరే వెల్లడించారు. ఈ మేరకు కార్యకర్తలతో ఆమె మాట్లాడుతున్న వీడియో ‘సాక్షి’కి చిక్కింది.
చంద్రబాబు ఆఫర్‌ను అనుచరులకు వెల్లడించిన గిడ్డి ఈశ్వరి.. ఆఫర్ బాగుందని, వెళ్లకతప్పదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా మనకు పదవి కావాలంటూ ఆమె వెల్లడించారు. అన్ని పనుల్లో కమీషన్లు కూడా వస్తాయని ఆమె అన్నారు. టీడీపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లొంగదీసుకొని.. తమ పార్టీలో చేర్చుకుంటుందన్న మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా గిడ్డి ఈశ్వరి వ్యవహారంలో ‘సాక్షి’ చేతికి వీడియో సాక్ష్యం చిక్కింది. టీడీపీ నేతల ప్రలోభాల గుట్టు రట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment