సాక్షి, నెల్లూరు : ఎన్నికలు వస్తేనే సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకొస్తారా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ. 2 వేలకు పెంచుతానని హామీ ఇచ్చేంతవరకు చంద్రబాబుకు పెన్షన్ పెంచాలనే ఆలోచనే రాలేదని ఎద్దేవా చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే వైఎస్సార్ సీపీ పథకాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు.
డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మాటలను నమ్మి రుణాలు కట్టని మహిళలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో మహిళలను మరోసారి మోసం చేసే ప్రయత్నంలో భాగంగా.. మూడు విడతలుగా పదివేలు ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. రైతులకు కూడా రుణ మాఫీ చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. మూడు నెలలు కూడా పనిచేయని సెల్‌ఫోన్లను ఇస్తూ వాటి కొనుగోలులో కూడా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మోసం చేసిన తీరును రైతులు, డ్వాక్రా మహిళలు చర్చించుకుంటున్నారని గోవర్ధన్ రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment