సాక్షి, అమరావతి : ఈ ప్రభుత్వంలో ఇదే చివరి బడ్జెట్.. ఇంకేం సాయం చేస్తారు? ఈ సర్కారు చెప్పిందేమిటి? చేసిందేమిటి? అని అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలోకి రాగానే రైతన్నల పంట రుణాలు రూ.87,612 కోట్లు బేషరతుగా మాఫీ చేస్తామన్న చంద్రబాబు గద్దెనెక్కగానే మాట మార్చారు. అప్పు మాఫీ అవుతుందనే ధీమాతో ఉన్న వారందరికీ అసలుతో పాటు వడ్డీ కలిపి తడిసి మోపెడైంది. మాఫీ సొమ్ము పావు వంతు వడ్డీకి కూడా సరిపోక ఎక్కడికక్కడ అప్పులు అలానే ఉండిపోయాయి. అప్పు ఎగవేతదారులుగా ముద్ర పడటంతో బ్యాంకుల్లో కొత్త అప్పులు పుట్టక, ఉన్నవి మాఫీ కాక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సున్నా వడ్డీకి రుణాలు లభించక బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సాగు చేసి అప్పులపాలయ్యారు. కాకి లెక్కలు వేసిన సర్కారు రైతుల రుణాలను రూ.24,500 కోట్లకు కుదించినా, ఆ ఈ మేరకు కూడా మాఫీ చేయలేకపోయింది.
ఈ మొత్తాన్ని కూడా విడతల వారీగా చెల్లిస్తామని బాండ్లు పంపిణీ చేసింది. ఏటా బడ్జెట్‌లో అత్తెసరు నిధుల కేటాయింపుతో ఈ మాత్రం హామీని కూడా నిలుపుకోలేకపోయింది. అంకెల గారడి చేసి మాఫీ చేసేశామంటోంది. 2015–16 ఆర్థిక సంవత్సరం వరకు రూ.10,867 కోట్లు ఇవ్వగా, 2017–18లో రూ.3,629 కోట్లు కేటాయించింది. అయితే ఇందులో విడుదల చేసింది మాత్రం రూ.3,069 కోట్లే. ఈ విషయాన్ని వ్యవసాయ బడ్జెట్‌లో ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో రుణమాఫీ కింద సర్కారు తేల్చిన అప్పుల ప్రకారమే అనుకున్నా రూ.10,564 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.4,100 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే కోత వేసి.. కాకి లెక్కలు వేసిన సొమ్ములోంచి కూడా రూ.6,464 కోట్ల కేటాయింపులను గాలికి వదిలేసింది. ఈ సొమ్మును ఎలా సర్దుబాటు చేస్తారో చెప్పలేదు. మొత్తంగా సర్కారు చర్యలతో రైతులు కోలుకోలేని ఊబిలో కూరుకుపోయారన్నది స్పష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment