రుణమాఫీ ఘనత నాదే
రెండో విడత రుణ విముక్తి పత్రాల పంపిణీలో సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.24 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన ఘనత తనదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఒంగోలులోని మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన రెండో విడత రుణ విముక్తి పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమం త్రి మాట్లాడుతూ.. మొదటి విడతలో రూ.7, 500 కోట్లు, తాజాగా రెండో విడతలో రూ.3, 500 కోట్లు మొత్తం రూ.11 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మిగిలిన రూ.13 వేల కోట్లను రాబోయే మూడే ళ్లలో ఏడాదికి 10 శాతం వడ్డీతో చెల్లిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.10 వేల చొప్పున ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు మూడు వేల చొప్పున ఇచ్చామన్నారు. వచ్చే నెలలో మిగిలిన మొ త్తాన్ని చెల్లిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేశానని, తన వల్లే రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అగ్రవర్ణాల పేదలకూ రిజర్వేషన్లు..
అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు తెచ్చి ఆదుకుంటానని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరు అడ్డొచ్చినా బుల్లెట్‌లా దూసుకుపోయి అమరావతిని నిర్మిస్తానన్నారు.
నీ పంటకు నువ్వే ధర నిర్ణరుుంచుకో..!
‘నీ పంటకు నువ్వే రేటు నిర్ణయించుకో.. కాదన్నది ఎవరు? ప్రస్తుతం రోజులు మారాయి. రైతులు ధాన్యాన్ని సైతం ఇతర రాష్ట్రాలకు, పోర్టుల ద్వారా ఇతర దేశాలకు తీసుకువెళ్లి విక్రయించుకోవచ్చు’ అంటూ చంద్రబాబు యర్రగొండపాలెంకు చెందిన వెంకటేశ్వర్లు చౌదరి అనే రైతుకు సూచించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్న ఆ రైతు ప్రశ్నకు సీఎం ఆ విధంగా స్పందించగా, అంతసీను ఎక్కడుందంటూ సభకు హాజరైన రైతులు నిట్టూర్చడం గమనార్హం.