రైతుకు రూ.2.50 లక్షల రుణం ఇప్పించండి | Grant Rs .2.50 lakh loan to farmers | Sakshi
Sakshi News home page

రైతుకు రూ.2.50 లక్షల రుణం ఇప్పించండి

Published Mon, Mar 21 2016 1:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రైతుకు రూ.2.50 లక్షల రుణం ఇప్పించండి - Sakshi

రైతుకు రూ.2.50 లక్షల రుణం ఇప్పించండి

వారు అప్పులు తీర్చేందుకు సహకరించండి
♦ అధికారులు, బ్యాంకర్లతో కూడిన ఉప కమిటీ సిఫార్సు
♦ రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా చూడాలి
♦ ప్రత్యామ్నాయ జీవనోపాధికి సహాయం చేయాలి
 
 సాక్షి, హైదరాబాద్: అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకునేందుకు అధికారులు, బ్యాంకర్లతో కూడిన ఉప కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. ప్రధానంగా ఆత్మహత్యల నివారణపై దృష్టిపెట్టిన ఈ కమిటీ ఇటీవల తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీపై రైతులు తీసుకున్న రుణాలను తీర్చేందుకు వీలుగా రైతుకు రెండున్నర లక్షల వరకూ బ్యాంకులు రుణం మంజూరు చేయాలని, ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. 2007 సంవత్సరంలో అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రైవేట్ అప్పులు తీర్చేందుకు వీలుగా బ్యాంకుల ద్వారా రైతులకు రూ.లక్ష వరకు రుణం ఇప్పించారు.

అందుకు అనుగుణంగా ఆర్‌బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పుడు ఆ లక్ష  పరిమితిని రూ. 2.50 లక్షలకు పెంచాలని కమిటీ చెప్పింది. దీంతో ఈ సిఫార్సు అమల్లోకి తీసుకువచ్చే బాధ్యత సీఎం చంద్రబాబుకు అప్పజెప్పినట్లయింది.కేంద్రంతో చర్చించి ఆర్‌బీఐ ద్వారా ఆ పరిమితిని పెంచి రైతులకు బ్యాంకులు రుణం ఇచ్చేందుకు వీలుగా మార్గదర్శకాలను జారీ చేయించాల్సి ఉంది. కాగా, బ్యాంకుల రైతులు ఆ రుణం పొంది ప్రైవేట్ అప్పులు తీర్చిన తరువాత తిరిగి మళ్లీ వారు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా నిలువరించాలని, ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లు చర్యలను తీసుకోవాలని కమిటీ చెప్పింది. ప్రైవేట్ రుణం తీర్చడంతో పాటు ఆయా రైతుల ప్రత్యామ్నాయ జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కమిటీ సూచించింది. మహిళా స్వయం సహాయ సంఘాల తరహాలోనే రైతు సంఘాలను ఏర్పాటు చేసి రాష్ర్ట ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేయాలని కమిటీ పేర్కొంది.

 కౌలు రైతులకు క్రెడిట్ గ్యారెంటీ నిధి
 ప్రధానంగా కౌలు రైతులే పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఆ రైతులకు విరివిగా బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు వీలుగా క్రెడిట్ గ్యారెంటీ నిధిని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. వారి రుణ అర్హత కార్డుల కాలపరిమితి మూడు లేదా ఐదేళ్లకు పెంచాలని కమిటీ సూచించింది. ఏడాది కన్నా ఎక్కువ లీజు కాలం ఉంటే ఆ లీజు పత్రాన్ని సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించే విధంగాప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ పేర్కొంది.

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఒకే భూమిపై ఒకేసారి రెండు పంట రుణాలు మంజూరు చేయడం సాధ్యం కాదని, భూమి యజమాని ముందుగానే రుణం తీసుకుంటే ఆ భూమిని లీజుకు తీసుకునే కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను జారీ చేయరాదని కమిటీ సూచించింది. కౌలు సమయం పూర్తి కాగానే తమ భూమి చేతికి వస్తుందనే విశ్వాసాన్ని యజమానుల్లో కలిగించేందుకు కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు, నిబంధనలను జారీ చేయాలని సూచించింది. కౌలు రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి విరివిగా రుణాలు అందేలాగ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,  సీజన్‌లో ప్రతీ వారం రుణాల మంజూరుపై సమీక్ష నిర్వహించాలని కమిటీ సూచించింది.

 రుణ మాఫీ చేయనందునే ఆత్మహత్యలు
 రుణమాఫీ విషయంలో సీఎం మోసం చేయడంతో రాష్ట్రంలోని ైరైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బ్యాంకులు బంగారం వేలం పాటలు వేస్తుంటే ఆత్మాభిమానం చంపుకోలేని రైతులు జీవితాన్నే త్యజిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సరికి కోటికి పైగా రైతుల ఖాతాల్లో రూ. 87,612 కోట్ల అప్పులున్నాయి. అయితే చంద్రబాబు అధికారం చేపట్టాక 22 నెలలు దాటినా ఇప్పటి వరకు వడ్డీకి కూడా సరిపోకుండా రైతుల రుణ మాఫీకి కేవలం రూ. 7,433 కోట్లను మాత్రమే ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) బడ్జెట్‌లో రెండో విడత రైతు రుణ మాఫీకై రూ. 4,300 కోట్లు కేటాయించిన ఇప్పటి వరకూ పైసా విడుదల చేయలేదు. అరకొర రుణ మాఫీ కూడా కౌలు రైతులకు వర్తించలేదు.అప్పులు తీర్చలేక ఆ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా బ్యాంకులే ఆ రైతులను ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుంచి విముక్తి కల్పించేందుకు మార్గం సుగమం చేయాలని సూచిస్తున్నాయి.బ్యాంకుల చేత రైతులకు రూ.2.50 లక్షల వరకు రుణాలను మంజూరు చేయించాలని బ్యాంకర్లతో కూడిన కమిటీ ప్రభుత్వానికి సూచించింది.
 
 నేడు 193వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీ
 ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో 193వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. రబీ లో రైతులకు రూ.25 వేల కోట్ల  రుణాలు మం జూరు చేయాలని గతంలో నిర్ణయించగా డి సెంబర్ వరకు కేవలం రూ.17 వేల కోట్ల రు ణాలను మాత్రమే మంజూరు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో పాటు ఇతర చే తి వృత్తుల వారికి సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాల మంజూరు కూడా అంతంత మాత్రం గానే ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో 16. 25 లక్షల కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని లక్ష్యంకాగా.. 70 వేల మంది కౌలు రైతులకు మాత్రమే బ్యాంకులు ద్వారా రుణాలు ఇప్పించారు. ఇలాంటి నేపథ్యంలో ఈ సమావేశంపై  ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement