ఏం చేయాలన్నా నిధులు కావాలి
హామీల అమలుకు కొంత సమయం అవసరం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
చిత్తూరు: ‘‘గత పదేళ్లలో వ్యవసాయం నిర్వీర్యమైపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మహిళలు ఆర్థికంగా చితికిపోయారు. అందుకే రైతు, డ్వాక్రా రుణాలను మాఫీచేసి ఆదుకుంటానని ప్రకటించాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తానని చెప్పాను. కానీ ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులు లేవు. ఖజానా ఖాళీ అయిపోయింది. అయినా వెనక్కుపోను. ఇచ్చిన హామీలు నిలపుకోవడానికి ప్రయత్నిస్తాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రెండురోజుల పర్యటనలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లా రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లె, కుప్పంలలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు.
కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసింది..
‘‘పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా కుప్పం ప్రజలు నన్ను ఆదరించి, అభిమానించారు. ఎన్నో పార్టీలు ఎన్నో రకాలుగా టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. అయినా ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. కాంగ్రెస్ కుట్రలు పన్ని రాష్ట్రానికి అన్యాయం చేసింది. రాజధాని, సచివాలయం ఎక్కడో తేల్చలేదు. ఐఏఎస్‌లు ఎక్కడ ఉండాలో చెప్పలేదు. సీఎం క్యాంప్ ఆఫీసు లేదు. లేక్‌వ్యూ అతిథి గృహం నుంచి బాధ్యతలు నిర్వహించాలి. ఇవన్నీ ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. సీఎం పదవి ఓ ముళ్లకిరీటంలాంటిది. ఆర్థిక వనరులు లేవు. ఉద్యోగస్తుల జీతాలకు డబ్బులు లేవు. ఇలాంటి క్రమంలో కష్టపడాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
కొంత టైమ్ పడుతుంది
‘‘రాష్ట్ర నిర్మాణం తిరిగి పునాదుల నుంచి జరగాలి. రాజధానికి డబ్బులు లేవు. చాలామంది చందాలు ఇస్తున్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రైతు రుణమాఫీపై విధివిధానాల కోసం కమిటీ వేశాను. తిరిగి ఈ నెల 22న కమిటీతో సమావేశం నిర్వహిస్తా.కేంద్రం సహకారం తీసుకుంటాం. ఆర్‌బీఐతో చర్చిస్తాం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా హామీల అమలుకు కొంత సమయం పడుతుంది. రైతు రుణాలపై ఒత్తిడి చేయొద్దని బ్యాంకర్లకు చెప్పాను. అయినా వారు వినే పరిస్థితి లేదు. ఆ సమస్యను నేను చూసుకుంటాను’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అన్నివిధాలుగా ఆదుకుంటారని భరోసా ఇచ్చారని ఆయన చెప్పారు.
జలవనరులను అభివృద్ధి చేయాలి
‘‘కృష్ణా, గోదావరి నదులు ఉన్నా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీరు-మీరు కార్యక్రమాన్ని పునః ప్రారంభించి జలవనరులను అభివృద్ధి చేస్తాం. తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తా. ఐదేళ్లలో ఇంటింటికీ ఓ మరుదుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకుంటా. మొదట కుప్పం నియోజకవర్గంలో ఇచ్చి ఆపై రాష్ట్రమంతా ఇస్తాం. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తాను. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది. దోపిడీ జరిగింది. కొంతమంది జైలుకు వెళ్లారు. కాంగ్రెస్‌కు దేశంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. రాష్ట్రంలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇలాంటి రాష్ట్రాన్ని అన్ని విధాల బాగు చేయాలి. మనకు సముద్రతీర ప్రాంతం ఉంది. 12 పోర్టులను నిర్మించవచ్చు. ఆ దిశగా చర్యలకు ఉపక్రమిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.