సాక్షి, అమరావతి: ప్రాధాన్యతా రంగాలకు సహకరించి సకాలంలో రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. శుక్రవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో జరిగిన 203వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో 2018–19 వార్షిక రుణ ప్రణాళికను సీఎం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ వార్షిక రుణ ప్రణాళికను రూ.1,94,220 కోట్లుగా ఖరారు చేశారు. ప్రాధాన్యతా రంగానికి రూ.1,44,220 కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ.50,000 కోట్లు కేటాయించారు. సకాలంలో బ్యాంకులు రుణాలిస్తే దిగుబడులు పెరిగి రైతులు క్షేమంగా ఉంటారని సీఎం పేర్కొన్నారు. సామర్థ్యం పెంపు, నైపుణ్యాభివృద్ధితో సేవలను మెరుగు పర్చుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. రుణాల మంజూరు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. పలు బ్యాంకులు సామర్థ్యాన్ని నిరూపించుకోలేకపోతున్నాయని, సంస్థను కాపాడుకోవటం మీ బాధ్యత కాదా? అని బ్యాంకర్లను సీఎం ప్రశ్నించారు. పెద్దనోట్ల ఉపసంహరణతో దేశమంతా బ్యాంకులు డిపాజిట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొనగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం డిపాజిట్లలో 9% వృద్ధి నమోదైనట్లు ఓ అధికారి తెలిపారు.
చిత్తూరు మామిడి రైతును ఆదుకున్నాం
గత ఏడాది చిత్తూరు జిల్లాలో కిలో రూ.8 ధర పలికిన తోతాపురి మామిడి కాయలు ఈదఫా రూ.4కి పడిపోతే తాను జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించినట్లు సీఎం చెప్పారు. పల్ప్ ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితికి చేరుకోవడంతో ప్రభుత్వం కిలో తోతాపురి మామిడికి రూ.2.50 పైసలు చొప్పున సబ్సిడీ ఇవ్వగా ఫ్యాక్టరీ యజమానులు రూ.5 చెల్లించడంతో రైతులకు కిలో రూ.7.50 ధర లభించిందని తెలిపారు. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు తెచ్చామని, ఉద్యాన పంటల్ని భారీగా ప్రోత్సహిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
– 2018–19 ఏపీ వార్షిక రుణ ప్రణాళిక రూ. 1,94,220 కోట్లు
– ప్రాధాన్యతా రంగం: రూ.1,44,220 కోట్లు
– ప్రాధాన్యేతర రంగం: రూ.50,000 కోట్లు
వ్యవసాయ రుణ ప్రణాళిక: రూ.1,01,564 కోట్లు
– స్వల్పకాలిక ఉత్పాదక రుణాలు: రూ.75,000 కోట్లు.
(ఇందులోకౌలు రైతులకు ఆర్ధిక సాయం: రూ.7,500 కోట్లు)
– వ్యవసాయం, అనుబంధ విభాగాలకు రుణాలు: రూ.21,323 కోట్లు.
– వ్యవసాయ మౌలిక సదుపాయాలకు: రూ.241 కోట్లు
– అనుబంధ కార్యక్రమాలకు: రూ. 5,000 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment