పంట.. రుణాల మంట
పురుగు మందుల ధరలు పెరగడం.. కూలీ ఖర్చులు, బాడుగ రెట్టింపు కావడంతో పెట్టుబడి కూడా అధికంగానే అవసరమవుతోంది. వేరుశనగకు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి అవసరమని అంచనా. పత్తి సాగుకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు.. వరికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు వ్యయమవుతోంది.
సాధారణంగా రైతులందరికీ కాకపోయినా కొందరికైనా బ్యాంకులు రుణాలిచ్చేవి. ఈ విడత బాబు హామీ సందిగ్ధం కారణంగా బ్యాంకర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలతో పాటు.. బంగారం కుదువపెడుతున్నారు.
గతేడాది వరకు 56,300 మంది రైతులు బ్యాంకుల్లో బంగారం పెట్టి రూ.315.21 కోట్ల వ్యవసాయ రుణాలు తీసుకోగా.. ఈసారి బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడంతో గత రెండు నెలల్లో 12,500 మంది రైతులు దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల అప్పు తీసుకున్నారు. బయట ఎంత మేర అప్పు తెచ్చారనడానికి లెక్కల్లేవు. అయితే ఖరీఫ్ ఆరంభంలోనే ఎల్‌నినో ప్రభావం.. రుతు పవనాల జాప్యం తదితర కారణాలతో వర్షాలు ఆలస్యం కావడం రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.
బకాయిలు రూ.4344.13 కోట్లు
ఈ ఏడాది మార్చి నెల 31వ తేదీ నాటికి జిల్లాలో వ్యవసాయ రుణాలు రూ.4344.13 కోట్లు. ఇందులో పంట రుణాలు రూ.2819.97 కోట్లు(4,62,156 అకౌంటు) కాగా.. బంగారంపై వ్యవసాయ రుణాలు రూ.315.21 కోట్లు(56300 అకౌంట్లు), టర్మ్ లోన్లు రూ.1092.75 కోట్లు(89932 అకౌంట్లు) ఉన్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అధికారం చేపట్టిన తర్వాత విధి, విధానాలను రూపొందించేందుకు కమిటీ అంటూ తాత్సారం చేస్తుండటంతో రుణమాఫీపై రైతుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ.2888 కోట్లు
2014-15 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రైతులకు రూ.2888 కోట్లు పంట రుణాలుగా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించాయి. మామూలుగా అయితే ఈ పాటికి కనీసం రూ.200 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం రుణమాఫీని తేల్చకపోవడంతో ఇంత వరకు ఒక్క రైతురూ పంట రుణం లభించని పరిస్థితి నెలకొంది.
రైతులకు నోటీసులిచ్చే పనిలో బ్యాంకర్లు
గతేడాది తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సహజంగా రికవరీ సీజన్ జూన్ చివరి వరకు ఉంటుంది. అంత వరకు బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వవు. జూన్ నెల మరో పది రోజుల్లో ముగియనుండటంతో జులై మొదటి వారంలో నోటీసులు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. రుణాలు మాఫీ చేస్తే ప్రభుత్వం రైతుల అప్పులను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. లేదా రైతులైనా అప్పు చెల్లించాలి. ఎవ్వరూ చెల్లించకపోతే బ్యాంకులు మనుగడ సాగించలేవని.. అందువల్లే నోటీసులకు సిద్ధమవుతున్నట్లు ఓ బ్యాంకు అధికారి తెలిపారు.
మార్గదర్శకాలు రాలేదు
రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. వచ్చిన తర్వాతే బ్యాంకుల్లో పంట రుణాల పంపిణీకి అవకాశం ఉంటుంది. రుణాల విషయంలో ప్రభుత్వమే చొరవ చూపాలి.
- ఎల్‌డీసీఎం నరసింహారావు