రుణానంద ‘హరీ’
ఎన్నికల ఏరు దాటాక మాఫీ ‘రాగం’ మారింది..!
మాఫీ చేయాల్సిన ఖాతాలు కోటీ 5 లక్షలు... వడపోసి తేల్చింది 43 లక్షలే
ఈ ఖాతాలను కూడా ఇంకా కుదిస్తారట!
అంటే నికరంగా ఎంతమందికి మాఫీ వర్తిస్తుందనేది దేవుడికే ఎరుక
హామీ ప్రకారం మాఫీ చేయాల్సిన వ్యవసాయ రుణాలు రూ. 87 వేల కోట్లు
ఇప్పటికీ మాఫీ చేయకపోవడంతో ఏడాదిన్నరగా 14% చొప్పున అపరాధ వడ్డీ
అపరాధ వడ్డీతో కలిపితే మాఫీ చేయాల్సిన సాగు రుణాలు రూ. 1.07 లక్షల కోట్లు
20% రుణాలు మాఫీ చేస్తున్నామంటూ బాబు కేటాయించింది రూ. 5 వేల కోట్లు
ఈ లెక్కలకూ, బాబు నాన్చుడుకూ ఫలితం... రాష్ట్రమంతా రైతుల ఆత్మహత్యలు
చంద్రబాబు ఎన్నికల ప్రణాళికను ప్రకటించే నాటికి రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న బ్యాంకు ఖాతాల సంఖ్య ఒక కోటీ ఐదు లక్షలు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలోనూ ఇది నిర్ధారణ అయింది. ఆరు మాసాల పాటు కష్టపడి అందులో 62 లక్షల ఖాతాలను ప్రభుత్వం అడ్డంగా కొట్టేసింది. చివరికి 43 లక్షల ఖాతాలకు ప్రస్తుతం చేరుకుంది. మరోసారి జల్లెడ పట్టి వీటిని సగానికి సగం తగ్గించే పనిలో ప్రస్తుతం తలమునకలై ఉంది.
వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ టీడీపీ ఎన్నికల ప్రచారానికి దిగే నాటికే రాష్ట్రంలో రుణాలు రూ. 87,612 కోట్లు. ఆయ న అధికారంలోకి వచ్చాక బ్యాంకర్ల కమిటీ ఈ లెక్కను నిగ్గు తేల్చింది. బాబు హామీని నమ్మి రైతులు గడువులోగా అప్పు కట్టలేకపోవడంతో జూన్ నాటికి పైన పేర్కొన్న అసలుకు 14 శాతం అపరాధ వడ్డీగా కలిసింది. అసలు + అపరాధ వడ్డీ కలిసిన మొత్తానికి ఈ 6 నెలల అదనపు వడ్డీ కలిపితే లక్ష కోట్లు దాటుతుంది కదా? మరి 6నెలలు కసరత్తు చేసి.. ఐదు వేల కోట్లు ఇస్తాం.. అదే 20శాతం అని అంటే ఏమనుకోవాలి?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన క్షణంలోనే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ తొలి సంతకం పెడతానని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది. కానీ జరిగిందేమిటి? రైతుల రుణాలేమైనా మాఫీ అయ్యా యా? అంటే.. ఒక్క రైతుకు కూడా రుణం మాఫీ కాకపోగా.. చేయని పాపానికి వారిపై మరింత అపరాధ వడ్డీ భారం పడింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖరీఫ్ గడిచిపోయింది. రబీ కాలం కూడా పూర్తికావస్తోంది. అప్పులు మాఫీ అవుతాయని ఆశపడి ఓటేసిన రైతు ఇప్పుడు చెప్పుకునే దిక్కులేక అల్లాడిపోతున్నాడు.
అసలు రుణాలెన్ని? ఖాతాలెన్ని?
చంద్రబాబు ‘మీ కోసం’ పాదయాత్రలో చెప్పినప్పుడు.. ఎన్నికల ప్రచారంలో ఊరూరా ప్రచా రం సందర్భంగా ఉదరగొట్టినప్పుడు.. రాష్ట్రంలో (విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో) ఉన్న వ్యవసాయ రుణాల మొత్తం ఎంతంటే.. అక్షరాలా రూ. 87,612 కోట్లు. ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అపార అనుభవమున్న చంద్రబాబుకు ఈ లెక్కలు అందరికంటే ఎక్కువగా తెలుసు. అన్ని బ్యాంకుల్లో కలిపి ఒక కోటి ఐదు లక్షల మంది రైతులు (105 లక్షల ఖాతా లు) ఈ రుణాలు తీసుకున్నట్టు ఎస్‌ఎల్‌బీసీ నివేదిక తేల్చింది. ఈ లెక్క ప్రకారం రైతుల రుణాలు మాఫీ చేస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు.. దీనికి సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. మరి జరిగిందేమిటి? నిజంగానే తొలి సంతకం పెట్టి ఉంటే ఈ పాటికే రైతుల రుణాలు మాఫీ కావాలి. కానీ బాబు అధికారంలోకి రాగానే రైతుల రుణాల మాఫీ సంగతిని చాలా తెలివిగా పక్కనపెట్టారు.
చెప్పిన సంతకమొకటి.. చేసినదొకటి..!
ఎన్నికలకు ముందు అవసరం చంద్రబాబుది. అధికారంలోకి రావడంతోనే ఆయనకు ఆ అవసరం తీరింది. బాబు సూచనతో తొలి ఫైలు సిద్ధమైంది. రుణ మాఫీపై కసరత్తు పేరుతో నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ సిద్ధం చేసిన ఫైలుపై ప్రమాణ స్వీకారం అనంతరం బాబు తొలి సంత కం చేశారు. ‘ఎన్నికల ముందు చెప్పిన తొలి సం తకాని’కి.. సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత చేసిన తొలి సంతకానికి ఎంతో తేడా ఉంది. ఇచ్చిన వాగ్దానానికి పెట్టిన సంతకానికి అసలు పోలికా లేదు పొంతనా లేదు. బాబు తన సొంత ‘పవిత్ర పత్రాన్నే’ అలా అపవిత్రం చేశారు.
62 లక్షల ఖాతాదారులు రైతులే కాదట...
వ్యవసాయ రుణాలు తీసుకున్న బ్యాంకు ఖాతా లు ఒక కోటి అయిదు లక్షలు ఉండగా.. వారందరి రుణాలను మాఫీ చేస్తానన్న చంద్రబాబు గడిచిన ఆరు నెలలుగా చేస్తున్నదేమంటే.. మాఫీ చేయడం ఇష్టంలేక రైతుల ఖాతాల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు మాత్రమే. మొదటి దశ వడపోతలోనే.. వారు తీసుకున్నది వ్యవసాయ రుణాలు కాదంటూ 27.30 లక్షల రైతుల ఖాతాలను రుణ మాఫీ పరిధి నుంచి తిరస్కరించారు. ఆ తర్వాత దశల వారీగా వడపోత కార్యక్రమాన్ని కొనసాగించి చివరకు మొత్తంగా 62 లక్షల ఖాతాలకు రుణ మాఫీ లేదని తేల్చారు. రైతులకు సంబంధించి కోటీ అయిదు లక్షల ఖాతాలుంటే.. వా రంతా అసలు రైతులే కాదు.. రైతులు 43 లక్షల మందే ఉన్నారని కొత్త లెక్క చెప్పుకొస్తున్నారు.
43 లక్షల ఖాతాలనూ కుదించే కసరత్తు...
రుణ మాఫీకి కేవలం 43 లక్షల మందే అర్హులని చెప్తున్న చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అందులోనూ వడపోత ప్రక్రియ చేపట్టింది. ఒక కుటుంబానికి ఒక రుణమే మాఫీ చేయాలన్న లక్ష్యంతో ఈ ఖాతాలను వడపోస్తున్నారు. ఈ ఖాతాల్లో ఒక్కో కుటుంబం నుంచి ఎన్ని రుణ ఖాతాలున్నాయన్న లెక్క తేల్చే పనిని మొదలుపెట్టారు. పైగా.. ‘‘రేషన్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందా? ఇవి లేకుండా వాళ్లు రైతులెలా అవుతారు? అలాంటి వారందరినీ తొలగించండ’’ని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆపైన.. ‘‘అసలు అర్హతకు మించి రుణాలెలా ఇచ్చారు?’’ అంటూ ఇప్పుడు బ్యాంకర్లను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనను తెరమీదకు తెచ్చారు. దాని ప్రకారమే రుణాలిచ్చారా అని తేల్చాలని అడుగుతున్నారు. ఈ రకంగా ఆంక్షలు, పరిమితులు విధిస్తూ ఏదో రకంగా రైతుల సంఖ్యను కుదించాలన్న బాబు ఆదేశాల మేరకు ఆర్నెల్లుగా కసరత్తు చేస్తున్నారు.
వడ్డీలతో నడ్డి విరుగుతున్న రైతన్న...
ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు వ్యవసాయ రుణ మాఫీ చేయడం పక్కనపెట్టి రకరకాల సాకులు చెప్తూ ఆరు నెలలుగా కాలయాపన చేసిన కారణంగా.. రైతులు తమ రుణాలపై అపరాధ వడ్డీ భారం పడి విలవిలలాడుతున్నారు. పాత రుణాలు తీరకపోవటంతో బ్యాం కుల నుంచి కొత్త అప్పులూ పుట్టలేదు. దీంతో అధిక వడ్డీలకు ప్రయివేటు అప్పులు చేసి వ్యవసాయం చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
రుణ మాఫీకి 43 లక్షల మందే అర్హులు: మంత్రి పుల్లారావు
ఇప్పటివరకు రుణ మాఫీకి 43 లక్షల మంది రైతులే అర్హులుగా తేలినట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మరో 40 లక్షల మంది రైతులు అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వలేదని చెప్పారు. ఆధార్, రేషన్ కార్డు, సర్వే నంబర్, అడంగల్ వంటి పత్రాలు సమర్పించి రుణ మాఫీకి అర్హతను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ రైతులదేనని, ఇందుకు సమయం ఇస్తామని తెలిపారు. రుణ మాఫీపై సీఎం చంద్రబాబు మంగళవారం పలువురు మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి పుల్లారావు విలేకరులతో మాట్లాడుతూ.. రుణ మాఫీ చేయడానికి నాలుగైదు విధానాలపై చర్చించినట్లు చెప్పారు. మళ్లీ బుధవారం సీఎం సమీక్షిస్తారని తెలిపారు.
రాష్ట్రంలో 17 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేస్తున్నారని, ఆ రైతులకు లాభాలొస్తున్నాయని, అయినప్పటికీ వారికి ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసే విషయాన్ని పరిశీలించినట్లు మంత్రి చె ప్పారు. అలాగే రూ. 50 వేల రూపాయలపైన రుణాలు తీసుకున్న రైతులకే పంటల రుణ పరిమితిని వర్తింపచేయాలనే విషయం కూడా సమీక్షలో ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఈ అంశాలతోపాటు రుణ మాఫీకి సంబంధించి లెక్కలను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తారని తెలిపారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు తొలి దశలో రుణ మాఫీ 20 శాతం నిధులను బ్యాంకుల్లో రైతుల ఖాతాలకు జమ చేయనున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థిక సాయంపైన కూడా చర్చించినట్లు చెప్పారు.