వ్యవసాయం.. దండగన్నడు..
అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ ఒకే విధానం... వ్యవసాయం ఓ దండగమారి పని అన్నదే నినాదం. ఉన్నంత కాలం ఆ విధంగానే ముందుకు పోయారు. అందుకే ఆయన పేరు చెబితే సగటు రైతు ఇప్పటికీ కలవరంతో ఉలిక్కిపడతాడు. ఆయనే చంద్రబాబు. రాష్ట్ర రైతుల మదిలో అంతటి వ్యతిరేక ముద్ర వేసుకున్న చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయం గురించి రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. ఏదీ బాగా లేదంటున్నారు. రైతుల కోసం తాను పోరాడుతానంటున్నారు. బాబు కొత్త రూపం ఎలా ఉన్నా... సగటు తెలుగు రైతు మాత్రం పాత విషయాలను మరవడంలేదు. కరువుతో పొలాల్లో నెర్రెలు వచ్చి రైతు కన్నీళ్లు పెట్టుకున్నా పట్టని బాబు.., రుణాల మీద వడ్డీ మాఫీ విషయాన్ని ఆలోచించని బాబు.. ఇప్పుడు అసలు మొత్తం రుణాల మాఫీ గురించి మాట్లాడుతుండడంపై ప్రజలు నివ్వెరపోతున్నారు.
క్రిమినల్ కేసులు పెట్టించిన ఘనుడు
వ్యవసాయం దండగనే సిద్ధాంతాన్ని నమ్మిన బాబు అధికారంలో ఉన్న ఆఖరి ఏడాది(2004) బడ్జెట్‌లో వ్యవసాయానికి కేవలం రూ. 214 కోట్లు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటికీ కలిపి రూ.5014 కోట్లు మాత్రమే విదిల్చారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ పనికిరావని చెప్పిన చంద్రబాబు బిల్లులు చెల్లించని రైతులపై ఏకంగా దొంగతనం, క్రిమినల్ కేసులు నమోదు చేయించి బేడీలు వేయించి జైలుకు పంపారు. 1995లో రూ.150 ఉన్న 3 హార్స్ పవర్(హెచ్‌పీ) కరెంటు చార్జీలను పాలనా కాలం ముగిసేసరికి ఏకంగా రూ.825కు పెంచారు.
మద్దతు ధర ఊసెత్తితే ఒట్టు
చంద్రబాబు తన హయాంలో ఏ పంటకూ రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించలేదు. ఫలితంగా ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో వరి కనీస మద్దతు ధర రూ.50 మాత్రమే పెరిగింది. 2004లో వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 590 ఉండేది. ఇక పప్పుధాన్యాలు, పత్తి తదితర పంటల పరిస్థితైతేమరీ దారుణం. రైతులకు చేయూత లేక, రుణాలు తదితర సహాయ సహకారాలు అందక.. విద్యుత్ చార్జీల భారంతో 2004లో రాష్ట్రంలో కేవలం 109 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తే 109 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు మాత్రమే ఉత్పత్తయ్యాయి.
‘ఆముదం’ బాబు
చంద్రబాబు హయాంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిన ఏకైక పంట ఆముదం. వ్యవసాయం పట్ల అప్పటి ప్రభుత్వ నిరాదరణ కారణంగా అన్ని నూనెగింజల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. పొలాలను బీడు పెట్టుకోలేక.. పెద్దగా పెట్టుబడి అవసరం లేని ఆముదాన్ని రైతులు సాగుచేయాల్సి వచ్చింది.
కోతలకు రైతులే కారణం
రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యుత్ కోతలకు కారణం రైతులేనని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. 2000 సంవత్సరంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సలహాను పెడచెవిన పెట్టి రైతులు వాణిజ్య పంటలు వేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
కిడ్నీలు అమ్ముకున్నారు..
సేద్యం చేసి సర్వం కోల్పోయిన పల్నాడు రైతులు తమ శరీర అవయవాలను అమ్ముకునే దుస్థితి కల్పించింది బాబు జమానా. సరైన దిగుబడులు, గిట్టుబాటు ధరలు రాక ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే... కుటుంబ పోషణ కోసం మరికొందరు రూ.50 వేలకే తమ కిడ్నీలను అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు.
విద్యుత్ సబ్సిడీ ఇవ్వలేం
వ్యవసాయ రంగానికి ఇస్తున్న సబ్సిడీని కొనసాగించడం సాధ్యం కాదని, భారాన్ని రైతులు భరించవలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతల సమావేశాల్లో స్పష్టంగా ప్రకటించారు. విద్యుత్ చార్జీలను పెంచడం అనివార్యమని, ఈ మేరకు ప్రజలను మానసికంగా సిద్ధం చేయాలని కూడా ఆయన పార్టీ నేతలకు ఉపదేశించారు.
ప్రపంచ బ్యాంకు ఎజెండా..
విద్యుత్ సంస్కరణల వెనుక రహస్య ఎజెండా ఏదీ లేదని పదేపదే ప్రకటించుకున్నా బాబు ప్రపంచబ్యాంకు ఎజెండానే అమలు చేశారు. విద్యుత్ చార్జీలను పెంచాలని తాము రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్టు ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు జేమ్స్ ఉల్ఫెన్‌సన్ ప్రకటించారు. చార్జీలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని, రెగ్యులేటరీ కమిషన్ చేతుల్లోనే ఆ అధికారం ఉందని బాబు చెబుతూ వచ్చారు. కానీ ప్రపంచబ్యాంకు అధ్యక్షుడి ప్రకటనతో బాబు బండారం బయట పడింది.
ఏటేటా వడ్డింపు..
సామాన్యుల మీద విద్యుత్ భారం మోపడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఏటేటా విద్యుత్ చార్జీలు వడ్డిస్తామని చంద్రబాబు అధికారంలో ఉండగానే ప్రకటించారు.
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయాలను 2000 సంవత్సరంలో విజయవాడలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో బాహాటంగా సమర్థించారు.
కబేళాకు మూగ జీవాలు..
బాబు పాలనంతా కరువుకాలమే. అతివృష్టి, అనావృష్టి రైతులను అతలాకుతం చేశాయి. ఏ పంట వేసినా అప్పులు, తిప్పలే ఎదురుకావడంతో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా... గ్రాసం దొరకని స్థితిలో పశువులు బక్కచిక్కిపోయాయి. దిక్కుతోచక పశువులను కబేళాలకు తరలించారు.
విద్యుత్ పోటు..
బాబు హయాంలో విద్యుత్ సంక్షోభం అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. వ్యవసాయ రంగం మీద ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన రూ. 50లకు హార్స్‌పవర్ విద్యుత్ చార్జీని రూ. 250కి పెంచి కోలుకోలేకుండా దెబ్బ తీశారు. వ్యవసాయ విద్యుత్ చార్జీలను ఇబ్బడి ముబ్బడిగా పెంచారు.
సేద్యం ప్రైవేటు..
వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తన బాధ్యతలనుంచి వైదొలుగుతూ ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేందుకు బాబు ప్రయత్నించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల నిధుల మళ్లింపు తదితర ప్రతిపాదనలతో ముసాయిదాను రూపొందించారు. ఇజ్రాయెల్ తరహా సేద్యం పేరిట చిన్న రైతులను కబలించే యత్నం చేశారు.
రుణం కోసం చక్కర్లే
కంప్యూటరే సర్వస్వమని నమ్మిన బాబు వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారు. ఆయన హయాంలో పంట రుణాలపై 14శాతం వడ్డీరేటు ఉండేది. దీనిపై మళ్లీ రెండుశాతం స్టాంపు డ్యూటీ. రుణం కోసం రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు.
కుదేలు..లేదంటే మూసివేత
రాష్ర్టంలో ఉన్న ఒక్క వ్యవసాయ వర్సిటీనీ పట్టించుకున్న పాపానపోలేదు. విత్తనాలు, ఎరువులు, సాగు యంత్రాలు లాంటి ఉపకరణాల సరఫరా కోసం ఏర్పాటైన మార్క్‌ఫెడ్, రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ, నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య వంటి సంస్థలను నిర్వీర్యం చేశారు. కొన్నింటిని మొత్తానికే మూసివేశారు.
హెరిటేజ్ కోసం పాడిరంగాన్ని బలిచేసి..
వ్యవసాయ రంగాన్నే పట్టించుకోని చంద్రబాబు దీని అనుబంధ రంగాలను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. పాడి రంగాన్ని అభివృద్ధి చేయాలనే యోచన చేయలేదు. సొంత హెరిటేజ్ పాల డెయిరీ కోసం ప్రభుత్వ డెయిరీని కుదేలు చేశారు. గడ్డి విత్తనాలు, ఔషధాలకు నామమాత్రంగా తప్పితే సరిపడా నిధులు ఇచ్చిన పాపానపోలేదు. అధికారంలో ఉన్నన్ని రోజులు గొర్రెలు, మేకలు అంటే ఏమిటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. వాటి పెంపకందారుల కోసం ఏమీ చేయలేదు. మూగజీవాలకు కనీస వైద్యం కల్పించే విషయంలోనూ మొహం చాటేశారు.
పరిహారం కోసమే ఆత్మహత్యలన్నాడు..
బహుళజాతి కంపెనీ అయిన మోన్‌శాంటో కంపెనీతో కుమ్మక్కయిన బాబు రాష్ట్రంలోని పత్తి రైతులకు విత్తనాలు అందకుండా చేశారు. తెగుళ్లను తట్టుకుంటాయని చెబుతూ ఆ కంపెనీ ఒక్కో బీటీ విత్తనాల ప్యాకెట్‌ను రైతులకు రూ.1850కి అంటగట్టేది. సాగును సంక్షోభంలోకి నెట్టిన అపరాధ భావం ఏ కోశాన లేని చంద్రబాబు రైతులపై వ్యతిరేకతను ఎక్క డా ఆపుకోలేదు. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ ఆ కాస్త సహాయాన్నీ నిలిపేసిన ఘనత ఆయనది. రైతుల కష్టాలకు ప్రధాన కారణం అప్పులేనని తెలిసినా... వారికి కనీస సహాయం అందించలేక పోయారు.
విలువైన భూములను బడా బాబులకు కట్టబెట్టి..
స్వతహాగా భూ సంస్కరణలకు వ్యతిరేకి అయిన బాబు విలువైన భూములను పెద్దలకు కట్టబెట్టారు. కానీ గ్రామాల్లోని పేదలు వ్యవసాయం చేసుకునేందుకు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు. వర్షాధార ప్రాంతాల్లో వ్యవసాయం అంటేనే ఆశలు వదులుకునే పరిస్థితి కల్పించారు. విదేశీ నమూనాపై మోజుతో రైతులపై కుప్పం ప్రయోగం పేరుతో కుంపటి పెట్టారు. అన్ని శాఖల్లోలాగే వ్యవసాయ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేసే విషయం చంద్రబాబు కనీసం పరిశీలించలేదు. అలాగే రైతులకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య అనుసంధానంగా ఉండే వ్యవస్థ ఉండాలనే ఆలోచన చేయకపోవడంతో సాగురంగంలో వస్తున్న నూతన మార్పులకు సంబంధించిన సమాచారం రైతులకు అందే పరిస్థితి లేకుండా పోయింది.
గంగమ్మ దయకు మత్స్యశాఖ
బతుకుదెరువు కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను చంద్రబాబు గంగమ్మతల్లి దయకు వదిలేశారు. వేటకు వెళ్లిన వారికి సముద్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆర్థిక సాయం అందేది కాదు. వారు గల్లంతయినా బీమా మొత్తం అందించే విధానం ఉండేది కాదు. మత్స్య మిత్ర సంఘాలు, ఉచితంగా చేపల విత్తనాల సరఫరా, రాయితీపై మొబైల్ మార్కెట్లు, ఐస్ బాక్స్‌ల పంపిణీ, మార్కెట్ ఫీజు మినహాయింపు.. ఇవేవీ చంద్రబాబు పాలనలో మచ్చుకు కూడా లేవు.
వైఎస్ పథకాలపై చిన్నచూపు
రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రి అయిన కె.రోశయ్య.. వైఎస్ పథకాలపై చిన్నచూపు చూశారు. ఆయన తర్వాత సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టినా వైఎస్ నాటి పథకాలపై శ్రద్ధ చూపలేదు. అన్నపూర్ణగా వెలుగొందిన రాష్ట్రంలో రైతులు ‘పంట విరామం’ ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు, వ్యవసాయంలో ఆధునిక పరిశోధనల ఫలాలను గ్రామాల్లోని రైతులకు చేరవేసే ఉద్దేశంతో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆదర్శ రైతుల వ్యవస్థకు గండికొట్టారు. వీరికిచ్చే గౌరవ వేతనం ఇవ్వకుండా ఈ వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు.
ధరలు పెంచి.. భారం మోపి..
కిరణ్ ప్రభుత్వం రైతులకు అందించే విత్తనాల ధరలను అమాంతం పెంచేసింది. ఒక్కో ప్యాకెట్‌పై రూ.180 పెంచింది. రాష్ట్రంలో ఎక్కువగా సాగుచేస్తున్న బీటీ-2 పత్తి విత్తనాల ప్యాకెట్ ధరను రూ. 750 నుంచి రూ.930కి, బీటీ-1 విత్తనాల ధరను రూ. 650 నుంచి రూ.830కి పెంచిం ది. ధర పెంపుతో రాష్ట్రంలో పత్తి రైతులపై ఒక్క సీజనులోనే రూ.180 కోట్ల అదనపు భారం పడింది. అలాగే 2009లో రూ.486 ఉన్న డీఏపీ బస్తా ధర ప్రస్తుతం రూ.1350కి పెరిగింది. పాడిపరిశ్రమాభివృద్ధి, గ్రామీణ రైతు కుటుంబాల కోసం రూ.ఆరువేల కోట్లతో స్టేట్ మిల్క్ మిషన్ ప్రారంభమనేది ప్రకటనకే పరిమితమైంది.
తీగలపై బట్టలారేసుకోవాల్సిందే..
రైతులకు ఉచిత విద్యుత్.. ఏ పాలకుడూ ఊహించని పథకం. తొమ్మిదేళ్లు సీఎంగా, రైతులను అన్ని రకాలుగా వేధించిన చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ విద్యుత్ తీగలు బట్టలారేసుకోవడానికే పనికొస్తాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసే ప్రతీ పనికీ ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయాలన్నది బాబు పాలసీ, ఫిలాసఫీ. ఇందులో భాగంగానే వ్యవసాయానికీ విద్యుత్ చార్జీలను వసూలు చేశారు.
విద్యుత్ చార్జీలు చెల్లించని రైతులపై కేసులు పెట్టారు. జైళ్లకు పంపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు.
మొత్తం మీద 78 వేల కేసులను రైతుల మీద నమోదు చేశారు.
ప్రతీ ఏటా విద్యుత్ చార్జీలను పెంచారు. అటు
గృహ వినియోగానికి, ఇటు వ్యవసాయానికీ కరెంటు చార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుదే.
చార్జీలు చెల్లించడం లేదని వ్యవసాయ కనెక్షన్లు తొలగించారు. పోలాల మీద పడి మోటార్లు ఎత్తుకెళ్లారు. ఫ్యూజులు పీకేశారు. పంటలు ఎండిపోతున్నా కనికరించలేదు.
ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించదని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలకు బట్టలు ఆరేసుకోవాల్సిందేనని హేళన చేశారు.