‘మాఫీ’పై మళ్లీ ఆశలు
♦ అర్హులైన రైతులకు అందే అవకాశం
♦ ప్రభుత్వానికి ప్రతిపాదించిన వ్యవసాయ శాఖ
♦ రైతులు 20,848.. మాఫీ కావాల్సింది రూ.107.98కోట్లు
అర్హత ఉన్నా రుణమాఫీ కాని పరిస్థితి.. అధికారుల నిర్లక్ష్యమో.. ప్రభుత్వ తప్పిదమో.. అటువంటి రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది.. అర్హత కలిగిన రైతుల జాబితాను రూపొందించింది.. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20,848 మంది రుణమాఫీకి నోచుకోని రైతులు ఉండగా.. వీరికి రూ.107.98కోట్లు రుణమాఫీ కావాల్సి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు విడతల రుణమాఫీ ప్రక్రియ ఈ ఏడాదితో పూర్తికాగా.. అర్హులై ఉండి.. రుణమాఫీ పొందని రైతుల విషయం మళ్లీ తెరపైకి రావడంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. – ఖమ్మంవ్యవసాయం
ఖమ్మంవ్యవసాయ:
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ జాబితా తయారీ బాధ్యతను వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకర్లకు అప్పగించింది. ఆయా శాఖలు రూపొందించిన జాబితా ఆధారంగా ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. ఇందులో ప్రభుత్వ శాఖలు తగిన జాబితా రూపొందించకపోవటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. రెండు జిల్లాలకు రుణమాఫీ నిధులు రూ.1711కోట్లు అవసరం ఉంటాయని ప్రాథమికంగా గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. దీని ఆధారంగా రెండు జిల్లాల్లోని 3.80 లక్షల మంది రైతులకు తొలి విడతలో రూ.427.80కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత వివిధ స్థాయిల్లో జాబితాలను వడబోసి.. నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో 3.59 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు.
వీరికి మొత్తం రూ.1637కోట్లు అవసరం ఉంటాయని పేర్కొంటూ ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా తొలి విడతలో రెండు జిల్లాలకు రూ.409కోట్లు సరిపోతాయి. అయితే ప్రభుత్వం తొలి విడత కోసం రూ.427.80కోట్లు పంపింది. అయితే ఆ నిధులు అదనంగా ఉండటంతో వాటిని వెనకకు పంపించాలని ఆదేశించింది. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి రూ.18కోట్లను వెనకకు పంపారు. ఈ క్రమంలో రూపొందించిన జాబితాలో అర్హత ఉన్న రైతులు రుణమాఫీకి నోచుకోకపోవటంతో రెవెన్యూ, బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగారు. మండలస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోవటంతో ఆందోళనలు చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ, కలెక్టర్, నోడల్, లీడ్ బ్యాంక్ చుట్టూ కూడా రైతులు తిరిగారు. అయితే సమస్యను గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం అర్హత ఉండి.. రుణమాఫీకి నోచుకోని రైతుల జాబితా తయారు చేసింది. ఇందులో ఉన్న రైతులు తమకు రుణమాఫీ వర్తిస్తుందని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.
అర్హులని అప్పుడే గుర్తింపు..
రెండు జిల్లాల్లో మరో 20,848 మంది రైతులు రుణమాఫీకి అర్హులని ప్రభుత్వ శాఖలు అప్పుడే గుర్తించాయి. వీరికి సంబంధించి రూ.107.98కోట్లు విడుదల చేయాలని కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం వివిధ బ్యాంకుల నుంచి భూముల పహాణీలను తాకట్టు పెట్టి.. పంట రుణాలు తీసుకున్న రైతులు(మిస్సైన వారు) 17,642 మంది వివిధ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందారు. వీరికి సంబంధించి రూ.84.43కోట్ల రుణాలు మాఫీలో చేర్చాల్సి ఉందని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అంతేకాక అర్బన్ బ్యాంకుల్లో తీసుకున్న గోల్డ్ లోన్‌ల వ్యవహారం కూడా ఉంది. రెండు జిల్లాల్లో 3,206 మంది రైతులు తమ పంట భూముల ఆధారంగా బంగారాన్ని అర్బన్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు.
వీటిని కూడా తొలుత రుణమాఫీలో చేర్చలేదు. ఆయా రైతులకు చెందిన రూ.23.55కోట్లు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో చేర్చాలి. మొత్తంగా 20,848 మంది రైతులను అర్హులుగా గుర్తించి, వారికి సంబంధించి రూ.107.98కోట్లు విడుదల చేయాలని కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 15వేల మంది రుణమాఫీకి అర్హత కలిగిన రైతులు ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ గుర్తించి, వీరికి సంబంధించి రూ.140కోట్ల మంజూరుకు ప్రతిపాదించిందనే సమాచారం ఉంది. దీంతో రెండు జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ దక్కుతుందా? వీరిలో కూడా కొందరికే దక్కుతుందా? అనేది బాధిత రైతుల్లో చర్చనీయాంశంగా ఉంది.