బుధవారం శంకరపట్నం సభలో కార్యకర్తలు బహూకరించిన కత్తితో కె.లక్ష్మణ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రైతుబంధుగా మారితే.. ఆ రైతుల ప్రయోజనాలను విస్మరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రాబందుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రైతుల కోసం అనేక రాయితీలు, పథకాల కోసం కేంద్రం రూ.కోట్లు వెచ్చిస్తుండగా.. ఆ సొమ్ముతో కేసీఆర్ తానే చేస్తున్నట్లు పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ చేపట్టిన జన చైతన్య యాత్ర బుధవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఆ వర్గాన్ని దగా చేయడం ప్రారంభించారని దుయ్యబట్టారు. నిజాం పాలనను మరిపించేలా కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు మిషన్ కాకతీయ, భగీరథ లాంటి పథకాలు ప్రవేశపెట్టారని ఆరోపించారు.
రగులుతున్న తెలంగాణ బిడ్డలు
అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కుటుంబ పాలన సాగుతోందన్ని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే వరకు అక్కాచెల్లెళ్లు ఎత్తిన బోనం దించవద్దని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పాలన పట్ల తెలంగాణ బిడ్డలు రగిలిపోతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నిత్యం 18 గంటలు పని చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం ప్రగతిభవన్, ఫామ్‌హౌజ్‌లు కేంద్రంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ,, బోరు బావులు ఉచితంగా వేయించడం, అప్పుల మీద వడ్డీ మాఫీ చేస్తామని పురుద్ఘాటించారు. కౌలు రైతుకు ప్రత్యేక కౌలుదారు చట్టాన్ని అమల్లోకి తెస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు.
పంటలకు మద్దతు ధర ప్రకటించిన రూపాల
కరీంనగర్ జిల్లా శంకరపట్నం వేదికపై ‘రైతులకు తీపికబురు’అంటూ కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల 14 పంటలపై పెరిగిన కనీస మద్దతు ధరలను ప్రకటించారు. రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాగా, పంటలకు కనీస మద్దతు ప్రకటించినందుకు కేంద్ర మంత్రికి లక్ష్మణ్ మిఠాయి తినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment