రైతుల కోసం రోడ్డెక్కుతాం.. | Bharat Bandh: KTR Says TRS leaders Stage Protest Against Central | Sakshi
Sakshi News home page

రైతుల కోసం రోడ్డెక్కుతాం..

Published Mon, Dec 7 2020 3:22 AM | Last Updated on Mon, Dec 7 2020 10:05 AM

Bharat Bandh: KTR Says TRS leaders Stage Protest Against Central - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చిందని, దాన్ని వ్యతిరేకంగా ఈ నెల 8న జరిగే ‘భారత్‌ బంద్‌’కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. కేంద్రం మెడలు వంచేందుకు రైతులు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ సెల్యూట్‌ చేస్తోందని, రైతుల కోసం ఎన్నో పురోగమనశీల నిర్ణయాలు తీసుకున్న రాష్ట్రంగా అన్నదాతల ఆందోళనకు మద్దతు పలుకుతున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

భారత్‌ బంద్‌లో తనతోపాటు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు ఈ నెల 8న జాతీయ రహదారులపై ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించారు. రైతు విభాగం సభ్యులు, రైతు బంధు సమితి బాధ్యులు కూడా ఈ ధర్నాలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. భారత్‌ బంద్‌కు సంఘీభావంగా వ్యాపార, వాణిజ్య సంఘాలు మంగళవారం 2 గంటలు ఆలస్యంగా తమ కార్యకలాపాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్లు, ఆర్టీసీ కూడా తమ ఆందోళనకు సహకరించాల్సిం దిగా కేటీఆర్‌ కోరారు. 

ఈ మేరకు వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతి నిధులను పార్టీ శ్రేణులు కలసి బంద్‌కు సహకారం కోరాలని సూచించారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, టీఆర్‌ఎస్‌ పార్లమెం టరీ పార్టీ నేత కె.కేశవరావుతో కలసి ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు వ్యతిరేకిస్తూ ఓటు వేసినా కేంద్ర ప్రభుత్వం మందబలంతో ఆమోదించిందని మండిపడ్డారు.

రైతుల ఉద్యమానికి కేసీఆర్‌ వెన్నుదన్ను..
రైతుల ఆందోళనకు సీఎం వెన్నుదన్నుగా ఉంటారని, అవసరమైతే ఉద్యమానికి నేతృత్వం వహించే శక్తి కేసీఆర్‌కు ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఏటా రూ.60 వేల కోట్లు వెచ్చిస్తున్నామన్నా రు. ఈ భేటీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ రామ్మోహన్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement