సాగు రంగ సంస్కరణల కోసమంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు నిరసనగా జరుగుతున్న ఉద్యమం మంగళవారం నిర్వహించే దేశవ్యాప్త బంద్‌తో మరింత ఉధృతమయ్యే అవకాశంవుంది. ఈ చట్టాలు ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. పంజాబ్‌లో చిరకాలంగా బీజేపీకి మిత్రపక్షంగా వుంటున్న అకాలీదళ్ ఎన్‌డీఏకు దూరమైంది. గత కొన్ని రోజులుగా రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం సాగిస్తున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. చట్టాల రద్దు తప్ప మరి దేనికీ అంగీకరించబోమని రైతు సంఘాలు అంటున్నాయి.
బుధవారం కూడా చర్చలు కొనసాగుతాయి గనుక ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం కుదురుతుందని ఆశించాలి. ఆ సంగతలావుంచితే ఆందోళన తీవ్రత పెరగడానికి మొదటినుంచీ కేంద్రం అనుసరిస్తున్న వైఖరే కారణమని చెప్పాలి. రైతులతో నేరుగా ముందే చర్చించి వుంటే, ఆ సంస్కరణలవల్ల కలుగుతాయంటున్న లాభాల గురించి వారికి అవగాహన కలిగిస్తే ఆందోళన ఈ స్థాయిలో సాగేది కాదు. అయితే తాము చర్చించామన్నదే కేంద్రం జవాబు.
కరోనా వైరస్ సమస్యవల్ల 90 లక్షలమందికిపైగా రైతులతో వెబినార్‌ల ద్వారా మాట్లాడామంటున్నది. తమనెవరూ ఆహ్వానించలేదని, చర్చించలేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇక పార్లమెంటులో దాదాపు చర్చే జరగలేదు. బిల్లులకు చాలాముందే ఆర్డినెన్స్‌లు తీసుకురావడం, ఆ తర్వాత వాటి స్థానంలో తీసుకొచ్చిన బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందడంలాంటి కారణాలవల్ల రైతుల్లో సందేహాలు బలపడటానికి ఆస్కారం ఏర్పడింది. బిల్లుల్ని క్లాజులవారీగా క్షుణ్ణంగా చర్చించేలా సెలెక్ట్ కమిటీకి పంపివుంటే వేరుగా వుండేది. సాగు రంగంలో సంస్కరణలు అవసరమే అనుకున్నా వాటిని ఆదరా బాదరాగా తీసుకొస్తున్నారన్న అభిప్రాయం కలిగేలా ప్రవర్తించడం... రైతులపై బాష్పవాయుగోళాల, వాటర్ కేనన్‌ల ప్రయోగం సర్కారు తప్పిదం.
దేశంలో ఏమూలనున్న రైతులైనా తమ దిగుబడులు ఎక్కడైనా అమ్ముకోవడానికి తాజా సంస్కరణలు అవకాశమిస్తున్నాయని, ఇందువల్ల మంచి ధర వచ్చినచోటే తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వారికి వీలవుతుందని కేంద్రం వాదన. ఆ చట్టాల వల్ల లబ్ధిపొందామని చెబుతున్న రైతులతో ఒకటి, రెండు చానెళ్లు కార్యక్రమాలు కూడా రూపొందించాయి. అయితే రైతులకు మేలు కలిగే నిబంధనలున్నమాట వాస్తవమే అయినా, వాటికి తగిన రక్షణలు కల్పిం చకపోతే రైతులకు నష్టం కలుగుతుందని అకాలీదళ్ ఆర్డినెన్సుల జారీ సమయంలోనే తెలిపింది. వాటిని ఆపమని కోరింది. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) విషయంలో చట్టపరమైన రక్ష ణలుండాలని కోరింది. అయినా కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణ నిజమే అనుకున్నా ఆర్డినెన్సులు రూపొందించే దశలోనే దాన్ని అంచనా వేసివుండాల్సింది. కేవలం వదంతులు, అపోహలతోనే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తోందని ఇప్పుడు నమ్మించే ప్రయత్నం చేయడం వల్ల ఫలితం వుండదు.
ఇప్పుడున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేయడం వల్ల దళారుల గుత్తాధిపత్యం పోతుందని, రైతులు తమకు మంచి ధర వచ్చినచోట అమ్ముకోవచ్చని చెప్పడం బాగానే వున్నా...అందుకు తగిన ప్రత్యామ్నాయ వ్యవస్థలను ఏర్పర్చకుండా రైతులకు ఒరిగేదేమీ వుండదు. అలాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలను తమ ఏలుబడిలోని హరియాణా వంటి ఒకటి రెండు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపించవలసింది. వాటివల్ల మంచి ఫలితాలొస్తే రైతులే ఆ సంస్కరణల్ని స్వాగతిస్తారు. అందుకు భిన్నంగా హడావుడి ప్రదర్శించడం ఎందుకు?
మన దేశంలో మెజారిటీ రైతులు చిన్న కమతాల్లో వ్యవసాయం సాగిస్తున్నవారే. వారు తమ దిగుబడికి ఎక్కడో బ్రహ్మాండమైన ధర పలుకుతోందని తెలుసుకుని అక్కడికెళ్లి అమ్ముకోవడం కుదిరే పనికాదు. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లోనూ మండీ వ్యవస్థ ఒకేలా లేదు. పంజాబ్, హరియాణా వంటిచోట్ల అవి బలంగా పనిచేస్తున్నాయి. దానికితోడు ప్రభుత్వం ఏటా ప్రకటించే మద్దతు ధర, సేకరణ విధానం కారణంగా అక్కడ పండించే ఉత్పత్తులకు మంచి రేటు పలుకుతోంది. గోధుమలు క్వింటాలుకు రూ. 1,900 పలుకుతుంటే మండీల వ్యవస్థ సరిగాలేని బిహార్ వంటిచోట్ల అది రూ. 800 మాత్రమే.
వరి, గోధుమ తప్ప ఇతర దిగుబడులకు మద్దతు ధర ప్రకటించినా ఆ రేటుకు వారు అమ్ముకునేది తక్కువే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో బక్క రైతులకు తోడ్పడే రైతుబంధు, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కరోనా కాలంలో రైతులు పంటలు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వం రూ. 3,900 కోట్లు వెచ్చించి మొక్కజొన్న, కందులు, ఉలవలు, జొన్నలు, పొగాకు, అరటి తదితర పంటల్ని కొనుగోలు చేసింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నచోట రైతులు ఆందోళనకు దిగే అవసరం ఏర్పడదు.
కారణాలేమైనా... కారకులెవరైనా ప్రభుత్వం, రైతుల మధ్య ఇప్పుడు పరస్పర విశ్వాసం సన్నగిల్లిందన్నదైతే వాస్తవం. దాన్ని ఏమేరకు పునరుద్ధరించుకోగలమన్న అంశంపై శ్రద్ధ పెట్టడానికి బదులు ఎప్పటిలాగే రైతుల ఆందోళనపై కూడా ఖలిస్తానీ వేర్పాటువాదం, అర్బన్ మావోయిస్టు వంటి ముద్రలేయడం వల్ల ప్రయోజనం వుండదు. ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు స్వప్రయోజనం కోసం చొరబడే శక్తులు ఎప్పుడూ వుంటాయి. వాటిని ఉద్యమ నిర్వాహకులు గమ నించుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కానీ మొత్తం ఉద్యమానికే ఆ రంగు పులమాలనుకోవడం మంచిది కాదు. ఈ బంద్ ప్రశాంతంగా జరగాలని, ప్రతిష్టంభన సాధ్యమైనంత త్వరగా ముగిసి, ఒక మెరుగైన పరిష్కారం లభించాలని అందరూ కోరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment