సఫలమైన రైతుల సామూహిక శక్తికి జేజేలు. కొత్త సాగు చట్టాల రద్దు డిమాండుతో ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతు నిరసనకారుల శిబిరాలు... పంజాబ్ చరిత్రను తిరగరాస్తున్నాయి. మాదకద్రవ్యాల మత్తులో మునిగితేలుతున్న పంజాబ్ యువతను సరికొత్తగా ఆవిష్కరించిందీ రైతుల పోరాటం. ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఏమిటంటే... శిబిరాల్లోని యువత అక్కడి తాత్కాలిక లైబ్రరీల్లో వివిధ ఉద్యమాల చరిత్రను అధ్యయనం చేస్తూ వచ్చారు. రైతులకు మద్దతిస్తూ శిబిరాలను సందర్శించిన సకల జీవన రంగాలకు చెందిన వ్యక్తులతో ఢిల్లీ సరిహద్దుప్రాంతం ఒక యాత్రా స్థలంగా మారిపోయింది. రైతుల శాంతియుత నిరసనల అనుభవం పంజాబ్ జానపద గాథల్లో భాగం కానుంది. గర్వించే ఈ వారసత్వం భవిష్యత్ తరాలకు చరిత్రగా మిగలనుంది.
పంజాబ్‌లో పర్యటిస్తున్న వారు అమృత్‌సర్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించాలని, ప్రత్యేకించి 1919లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై బ్రిటిష్ వారు కాల్పులు జరిపి మారణకాండ సృష్టించిన జలియన్ వాలాబాగ్‌ని తప్పక చూడాలని చెబుతుంటారు. గత వారం ఢిల్లీ – హరియాణా సరిహద్దులో సింఘూను సందర్శించిన నాకు అదే అనుభూతి కలిగింది. శాంతియుతంగా నిరసన కొనసాగించిన రైతులు శక్తిమంతమైన భారతీయ పోలీసు రాజ్యం మెడలు వంచిన ప్రత్యక్ష సమరస్థలిని నేను అక్కడ చూశాను.
నేను సోనీపట్‌లో నివసిస్తూ, అక్కడే పనిచేస్తున్నాను. 2020 నవంబర్ నుంచి సింఘూ సరిహద్దు ప్రాంతంలో సాగుతున్న రైతుల నిరసనను సందర్శించాను. ఇటీవలే రైతులు తమ నిరసనను ముగించారు. ఉత్తర ఢిల్లీలో నెలకొన్న ఈ ప్రాంతంలోనే సంవత్సరం పైగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం చేస్తూ వచ్చారు.
రైతులు రహదారులను దిగ్బంధించారని అధికారులు ప్రకటిçస్తూ వచ్చారు. కానీ ప్రభుత్వం ఇనుపతీగలు చుట్టి కాంక్రీట్ అవరోధాలను అడ్డుపెట్టిన ఢిల్లీ ప్రవేశమార్గాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మా యూనివర్సిటీ నెలకొన్న సోనీపట్‌లో నేను పనిచేస్తున్నప్పటి నుంచి వందలాది పర్యాయాలు ఇదే మార్గంలో ప్రయాణించాను. కానీ ఇప్పుడు ఇది బెర్లిన్, పాలస్తీనా గోడలపై ఉన్న చిత్రాలను ఆవాహన చేస్తున్నట్లుంది.
గత సంవత్సరం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ని చేరుకోవాలని ప్రయత్నించిన రైతు నిరసనకారులను ఇక్కడే ఆపివేశారు. దాంతో వారు ఇక్కడే రోడ్లపై తిష్ఠవేయాలని నిర్ణయించుకున్నారు. వణికిస్తున్న చలి నుంచి, మండిస్తున్న ఎండ నుంచి, అకాల వర్షాల నుంచి రక్షణ పొందడానికి వీరు ట్రాక్టర్ ట్రాలీలను, తాత్కాలికంగా వెదురుతో ఇళ్లను నిర్మించుకుని ఉండసాగారు. నెలల తరబడి వారు ఇక్కడ ఇలాగే కొనసాగుతూ వచ్చారు. మేం అక్కడికి వెళ్లినప్పుడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక సూక్ష్మ ప్రపంచంతో భేటీ అయినట్లనిపించింది. ప్రతి టెంట్‌లోనూ పంజాబ్‌లోని తమ గ్రామం లేదా జిల్లా పేరును రాసి ప్రదర్శించారు.
ఢిల్లీ సరిహద్దు నుంచి గురు తేజ్ బహదూర్ స్మారక చిహ్నం దాకా పన్నెండు కిలోమీటర్ల పొడవునా రైతుల శిబిరాలు నెలకొని ఉన్నాయి. వీటిని సందర్శించినవారు, కుటుంబాలు, పిల్లలు... ఆనాడు మొఘల్ పాలకులు బలిగొన్న తొమ్మిదవ సిక్కు గురువు తేజ్ బహదూర్‌కి నివాళి అర్పిస్తూ కనిపించారు. ఆయన స్మారక చిహ్నాన్ని ఇక్కడే నెలకొల్పారు. ఈ స్మారక చిహ్నం మరోసారి శక్తిమంతమైన రాజ్యంతో సాగుతున్న ప్రస్తుత రైతుల పోరాటాన్ని భావనాత్మకంగా గుర్తుచేసింది. ఢిల్లీ సరిహద్దులో శిబిరాలు ఏర్పాటు చేసుకున్న సిక్కు రైతులకు ప్రతి సౌకర్యమూ అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సిక్కు సమాజం చేస్తున్న సహాయ సహకారాలతో భోజనశాలల నుండి ఉచితంగా ఆహారం అందిస్తూ వచ్చారు. రైతు ఉద్యమం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు 120 కంటే ఎక్కువ వంటశాలలు ఏర్పర్చి నిరసనకారులకు, సమీపంలోని పేదలకు తిండి పెట్టారు. రైతు నిరసనకారులను సందర్శించిన వారు అక్కడ తమకు అందించిన ఆహారాన్ని ఆరగిస్తూ, ఇతరులతో ముచ్చటలాడుతూ గడుపుతారు. మాకూ అదే అనుభూతి ఎదురైంది.
రైతు నిరసనకారుల మద్దతుదారులు అక్కడ పలు క్షేత్ర ఆసుపత్రులను ప్రారంభించి శిబిరాల్లో అస్వస్థతకు గురైన వారికి ప్రాథమిక చికిత్సను, మందులను అందిస్తూ వచ్చారు. లైఫ్ కేర్ ఫౌండేషన్ హాస్పిటల్ వెంటిలేటర్లు, హార్ట్ మానిటర్లు వంటి క్రిటికల్ కేర్ సపోర్టుతో కూడిన 12 బెడ్లను ఏర్పర్చింది. నిరసన కారులకు, గుండెపోటుకు గురై బాధపడే ప్రజలకు ఇక్కడ సమర్థంగా సేవలందించారు. ఇక్కడ ఉచిత మందుల షాపు ఏర్పర్చి రైతులకు రక్తపోటు, తలనొప్పి, జ్వరాలు వచ్చినప్పుడు, పరీక్షించి అన్ని వేళలా మందులు అందిస్తూ వచ్చారు.
ఆ ప్రాంతంలో మూడు చిన్న లైబ్రరీలను చూశాం. ఒక లైబ్రరీని జంగీ కితాబ్ ఘర్ (పోరాట గ్రంథాలయం) అని పిలుస్తున్నారు. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఒక పరిశోధక విద్యార్థి తన దగ్గర ఉన్న పుస్తకాలను అక్కడ ఉంచారు. శిబిరాల్లో ఉంటున్న ప్రజలు ఆలోచనలను ప్రేరేపించే సమాచారాన్ని చదవగలరని తన ఉద్దేశం. అక్కడ పంజాబీ, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లోని పుస్తకాలు కనబడ్డాయి. చైనా చరిత్రపై పలు ఆసక్తికరమైన రచనలను గ్రంథాలయంలో చూశాను. నిరుపేద చైనా రైతు బాలుడిపై కథనం చాలామందిని ఆకర్షించినట్లు అనిపించింది. ఈ చిన్ని గ్రంథాలయంలో భగత్‌సింగ్ రచనలు, భగత్‌సింగ్‌పై ఇతరుల రచనలు కూడా కనిపించాయి. ఈ లైబ్రరీ చిన్న చిన్న సదస్సులకు, స్వేచ్ఛాయుతమైన చర్చలకు చోటు ఇచ్చింది. జేఎన్‌యూ తరహా ఆలోచనా స్ఫోరకమైన చర్చలను ఇవి పోలి ఉండటం కద్దు. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇక్కడ ఒక లైబ్రరీని నెలకొల్పింది. ఇక్కడ పంజాబ్ చరిత్ర, సాహిత్యంపై పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భగత్‌సింగ్ మనవరాలిని ఆమె సొంత శిబిరంలో ఇక్కడ నేను కలిశాను. ఆమె పేరు గుర్జీత్ కౌర్. తన వయస్సు 70 ఏళ్లు. పంజాబ్ చరిత్రను తిరగరాస్తున్న ఈ శిబిరాల్లోని వృద్ధులైన నిరసనకారుల మనోభావాలను ఆమె నాతో పంచుకున్నారు. వేర్పాటువాద హింసతో చితికిపోయిన పంజాబ్ చరిత్రను ఇక్కడ తిరగరాస్తున్నారు. పంజాబ్‌లోని గ్రామాలు, పట్టణాల్లో సంవత్సరకాలంగా కొనసాగుతున్న రైతుల పోరాటం... మాదకద్రవ్యాల మత్తులో మునిగి తేలుతున్న యువతను సరికొత్తగా ఆవిష్కరించింది. గర్వించే ఈ వారసత్వం భవిష్యత్ తరాలకు అందుతుంది కూడా!
ఈ కొత్త చరిత్రను నిరసనకారులే తమ కోసం రాస్తున్నారు. డాక్టర్ అమ్నీత్ కౌర్... గురుగోవింద్ సింగ్ మహిళా కాలేజీలో పాఠాలు బోధిస్తున్నారు. నెలల తరబడి ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శిబిరాల్లో ఉన్నారు. రైతుల పోరాటాన్ని ఫొటోలు, కవితల ద్వారా సంగ్రహిస్తున్నారు. ‘ఎ సైలెంట్ ఎవేకినింగ్: పవర్ ఆఫ్ ది ప్లో’ పేరిట తను రాసిన పుస్తకంలో ఈ ఉద్యమంలో మహిళలు పోషిస్తున్న విస్తృత పాత్రను ఆమె వివరించారు. రైతుల నిరసనోద్యమంలో పంజాబ్ ఆధిక్యత కనిపిస్తున్నప్పటికీ ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులను ఇక్కడ నేను కలిశాను. రైతులకు మద్దతుగా కావేరీ డెల్టా ఫార్మర్స్ అసోసియేషన్ పేరిట తమిళనాడు నుంచి రైతులు వచ్చారు. జామియా యూనివర్సిటీ నుండి విదేశీ భాషల్లో పరిశోధకుడు బిహార్ నుంచి ఇక్కడికి వచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న హైదరాబాద్ ముస్లిం యువకుడు మరొక ‘జాతి వ్యతిరేక’ ఉద్యమంలో పాల్గొనడానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాడు. గత సంవత్సర కాలంగా రైతులకు మద్దతిస్తూ నిరసనలో పాల్గొంటున్న సకల జీవన రంగాలకు చెందిన వ్యక్తుల సందర్శనతో ఈ నిరసన స్థలం ఒక యాత్రా స్థలంగా మారిపోయింది. నిరసన ప్రాంతాన్ని చూపించడానికి చాలామంది తమ కుటుంబాలను ఇక్కడికి తీసుకొచ్చారు. నిరసన ‘గ్రామం’ మొత్తాన్ని పర్యటనలో భాగంగా చూపిస్తూ వారి అనుభవాలను పంచుకుంటూ కనిపించారు. రైతుల నిరసనోద్యమం ఇటీవలే ముగిసినందున, వారి శాంతియుత నిరసనల అనుభవం పంజాబ్ జానపద గాథల్లో భాగం కానుంది. తరాలుగా బాధిస్తున్న దేశ విభజన తాలూకు బాధాకరమైన జ్ఞాపకాల్లాగా కాకుండా, ఈ రైతాంగ నిరసనల్లో తొలి నుంచీ గర్విస్తూ పాల్గొన్న తమ అనుభవాలను భారత ప్రజలు కూడా కలకాలం గుర్తుంచుకుంటారు.
డాక్టర్ రాజ్‌దీప్ పాకనాటి
వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,
ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, సోనీపట్
Comments
Please login to add a commentAdd a comment