![Indian Kisan Union Protest Against Agricultural Bills - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/16/Protest.jpg.webp?itok=zjpa-JO1)
పంజాబ్‌లోని బాదల్‌లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ నిరసన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులను విపక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్ర రైతులు వీటిని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. ఇన్నాళ్లూ ఆర్డినెన్స్ రూపంలో ఉన్న వీటిని రైతన్నలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే..
ఆ మూడు బిల్లులు
1. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు
2. రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు
3. నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు
ప్రభుత్వం చెబుతున్నదేంటి ?
మొదటి బిల్లు రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) ప్రకారం రైతులు పండించిన పంటల్ని మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనలు ఉండవు. తమ ఉత్పత్తుల్ని ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కువ ధర వచ్చినప్పుడే తమ పంటను అమ్ముకోవచ్చు. ఇక రెండో బిల్లు రైతుల ధరల హామీ, సేవల ఒప్పందం ప్రకారం పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుంది. కాంట్రాక్ట్ సేద్యాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వ్యాపారులు ఒప్పందాలను ఉల్లంఘించడం కుదరదు. ఇక మూడో బిల్లు నిత్యావసరాల సవరణ బిల్లు ప్రకారం చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయి. కాగా నిత్యావసరాల సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది.
రైతుల డిమాండ్లు ఇవీ
► మూడు బిల్లుల్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి
► మండీ వ్యవస్థని కొనసాగించాలి
► రుణ మాఫీ చేయాలి
► స్వామినాథన్ సిఫార్స్‌ల మేరకు పంటలకి కనీస మద్దతు ధర
Comments
Please login to add a commentAdd a comment