
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో వేలాది రైతులు గత కొంత కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులను ఉద్ధేశించి బీజేపీ ఎంపీ, సీనియర్ బాలీవుడ్ నటి హేమమాలిని సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మథుర పార్లమెంట్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బుధవారం హేమమాలిని మాట్లాడుతూ.. అసలు రైతులకు ఏం కావాలో వారికే తెలియదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు రైతులు ఆందోళన చేస్తున్నారో వాళ్లకే తెలియదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముందో, వాటి వల్ల ఉన్నసమస్య ఏంటో కూడా తమకు తెలియదని పేర్కొన్నారు. దీన్నిబట్టి రైతుల ఆందోళన స్వచ్ఛందమైన కాదని, ఎవరో వారి వెనకుండి చేయిస్తే రైతులు చేస్తున్నారనే విషయం అర్థమవుతుందని హేమమాలిని అన్నారు. చదవండి: సాగు చట్టాల అమలుపై స్టే
అదే విధంగా నూతన చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించాడాన్ని హేమమాలిని స్వాగతించారు. తద్వారా పరిస్థితులు చక్కబడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ఏకాభిప్రాయానికి రావడం లేదని, వారు ఏం కోరుకుంటున్నారో కూడా తెలియదన్నారు. అలాగే రైతుల నిరసనల వల్ల పంజాబ్‌లో చాలా నష్టం ఏర్పడిందని, ముఖ్యంగా సెల్ టవర్లను ధ్వంసం చేయడం మంచిది కాదన్నారు. ఇదిలా ఉండగా కొత్త చట్టాల వల్ల కేవలం కార్పొరేట్ సంస్థలకే లాంభం చేకూరుతుందని నిరసనలు తెలియజేస్తున్న రైతులు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 1500కు పైగా రిలయన్స్ జియో టెలికాం టవర్లను ధ్వంసం చేశారు.
కాగా నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ చట్టాలు అమల్లోకి రాకముందు ఉన్న కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగుతుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment