చండీఘడ్: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని వ్యాఖ్యలపై కంధీ కిసాన్ సంఘర్ష్ కమిటీ(కేకేఎస్‌సీ) అసహనం వ్యక్తం చేసింది. నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఏయే ప్రయోజనాలు ఉన్నాయో తమకు వివరించాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ఆమె పంజాబ్‌కు రావాలని, తమ సొంత ఖర్చులతో అక్కడే వారం రోజుల పాటు వసతి ఏర్పాటు చేస్తామంటూ విమర్శలు సంధించింది. కాగా ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. నిరసనలు మొదలై యాభై రోజులు దాటినప్పటికీ ఇంతవరకు రైతు సంఘాలు, కేంద్రం మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇప్పటికే విధించగా.. వాటిని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో అన్నదాతలు నేటికీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. (చదవండి: రైతులకు ఏం కావాలో వాళ్లకే తెలియదు: హేమమాలిని)
ఈ నేపథ్యంలో మథుర ఎంపీ హేమమాలిని గత బుధవారం మాట్లాడుతూ.. అసలు తమకు ఏం కావాలన్న అంశంపై రైతులకే స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముందో, వాటి వల్ల కలిగే సమస్యలు ఏంటో కూడా వారికి తెలియదని, దీనిని బట్టి రైతుల ఆందోళన స్వచ్ఛందమైన కాదని తెలుస్తోందన్నారు. కొంతమంది వ్యక్తుల ప్రోద్భలంతోనే వారు ఆందోళనలు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన కేకేఎస్‌సీ ఆదివారం స్పందించింది. ఈ మేరకు.. ‘‘ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ కోడలినని హేమమాలిని గారు స్వయంగా చెప్పారు. గౌరవనీయులైన మిమ్మల్ని మేం వదినగా భావిస్తాం. అంటే తల్లితో సమానం.
కానీ రైతు ఆందోళనలపై మీరు చేసిన వ్యాఖ్యలు పంజాబీలను బాధించాయి. 51 రోజులుగా నిరసన చేస్తున్నాం. ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 100 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కఠిన శ్రమకోర్చి రైతు పంటను పండిస్తాడు. కనీస మద్దతు ధర కూడా లేకుండా దానిని ఎందుకు అమ్ముకోవాలి. దయచేసి మీరు ఇక్కడకు రండి. ఆ మూడు వ్యవసాయ చట్టాల గురించి సవివరంగా తెలియజేయండి. ఇందుకోసం హేమమాలిని ప్రయాణానికి అయ్యే ఖర్చులు మేమే భరిస్తాం. వారం రోజులపాటు ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఉండేందుకు మా సొంత డబ్బుతో ఏర్పాట్లు కూడా చేస్తాం’’ అని హేమమాలినికి లేఖ రాసింది. కాగా హేమమాలిని ధర్మేంద్రను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన స్వస్థలం పంజాబ్.
Comments
Please login to add a commentAdd a comment