పంజాబ్: కేంద్ర ప్రభుత‍్వం రైతులకు అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా 'ఖేతీ బచావో యాత్ర' పేరుతో పంజాబ్‌లో మూడు రోజుల పాటు ర్యాలీలు నిర్వహించనున్నారు. రైతులతో వరుస పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆ మూడు బిల్లులపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను చాటాలని నిర్ణయించారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఏర్పాటు చేసిన సభకు హాజరై... అనంతరం అక్కడి నుంచి లూదియానా వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), ప్రభుత్వ ఆధ్వర్యంలో హోల్‌సేల్ మార్కెట్లు.. ఇలా రైతులకు ఉపయోగపడే విధానాలను నాశనం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నింస్తోందని ఆయన విమర్శించారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ బైఠాయించిన మరుసటి రోజే రాహుల్ గాంధీ సభ ఏర్పాటు చేయడం గమనార్హం.
పలు రాష్ట్రాల్లో నిరసనలు
గత నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ బిల్లుల ద్వారా కార్పొరేటు శక్తులు వ్యవసాయ రంగంలో ప్రవేశించే అవకాశం ఉందని, అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నా... కేంద్ర ప్రభత్వం మాత్రం ఇవి రైతులకు ఉపయోగపడే బిల్లులని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment