అమృత్‌సర్: ఒక్క పార్టీ మినహా పంజాబ్‌లోని పార్టీలన్నీ ఒకే మాటపై నిలబడ్డాయి. రైతులకు సంకటంగా మారిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌లోని అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తీర్మానం చేసింది. అయితే ఈ సమావేశానికి బీజేపీ దూరంగా ఉంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
(చదవండి: రేపు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు )
అమృత్‌సర్‌లో సీఎం అమరీందర్ సింగ్ అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. చట్టాల రద్దుతో పాటు గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన పరిణామాలపై ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ భేటిలో ఆమ్ ఆద్మీ పార్టీ అర్ధంతరంగా బయటకు వచ్చేసింది. ఢిల్లీలో పంజాబ్ పోలీసులు కూడా రక్షణ కల్పిస్తున్నారనే అంశంపై చర్చ సందర్భంగా జరిగిన సంవాదంతో ఆప్ వాకౌట్ చేసింది. ఇక గణతంత్ర రైతు పరేడ్‌లో పాల్గొన్న రైతులు అదృశ్యమయ్యారని వారి ఆచూకీ కనిపెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్, బీఎస్పీ, సీపీఐ, సీపీఐ (ఎం), ఎస్‌ఏడీ (ప్రజాస్వామ్యం) పార్టీలు పాల్గొన్నాయి. ఆయా పార్టీలకు చెందిన ప్రతినిధులు సమావేశంలో చర్చించి చివరకు ఓ తీర్మానం చేశారు. ఏకగ్రీవంగా వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేశారు. కొత్త విద్యుత్ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి. మొత్తం 8 అంశాలపై తీర్మానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment